వ్యాక్సిన్‌ తీసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ కట్‌ !?

ABN , First Publish Date - 2021-10-27T08:31:20+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారి జాబితాను రూపొందించి, వారికి రేషన్‌, పెన్షన్‌ ఆపేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో మంగళవారం పోస్టు చేశారు. జిల్లాలో 100 శాతం ..

వ్యాక్సిన్‌ తీసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ కట్‌ !?

వారి జాబితా తయారు చేయండి.. గద్వాల కలెక్టర్‌ ట్వీట్‌ 

ట్వీట్‌పై స్పందించాలని డీహెచ్‌ను కోరిన మీడియా  

ఖండించని గడల.. ఎలకా్ట్రనిక్‌ మీడియాలో విస్తృత ప్రచారం 

వివరణ కోరిన ఉన్నతాధికారులు 

ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ డీహెచ్‌ గడల ప్రకటన 


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారి జాబితాను రూపొందించి, వారికి రేషన్‌, పెన్షన్‌ ఆపేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో మంగళవారం పోస్టు చేశారు. జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆ ట్వీట్‌లో నిర్దేశించారు. ఈ ట్వీట్‌పై ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు స్పందన కోరారు. అయితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోనివారి పెన్షన్లు, రేషన్లను కట్‌ చేస్తారన్న అంశాన్ని ఆయన ఖండించలేదు. దీంతో టీకా తీసుకోని వారికి నవంబరు 1 నుంచి పెన్షన్లు, రేషన్లు నిలిపివేస్తామని డీహెచ్‌ గడల శ్రీనివాసరావు పేర్కొన్నట్టుగా కొన్ని టీవీ చానళ్లలో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. కాసేపట్లోనే ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో విధానపరమైన నిర్ణయాన్ని ఆయనెలా తీసుకుంటారంటూ ఉన్నతాధికారులు డీహెచ్‌ను సచివాలయానికి పిలిపించి వివరణ కోరినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో వెంటనే స్పందించిన గడల.. వ్యాక్సిన్‌ను తీసుకోని వారికి వచ్చేనెల నుంచి రేషన్‌, పింఛన్‌లను నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.


ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అనవసర ఆందోళనకు గురి కావద్దని  ప్రజలకు సూచించారు. తప్పుడు వార్తలను ప్రసారం చేేస్త కఠిన చర్యలు తప్పవని డీహెచ్‌ గడల శ్రీనివాసరావు హెచ్చరించారు. వాస్తవానికి రెండు రోజుల క్రితం రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ 3 కోట్లు దాటిన సందర్భంగా డీహెచ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్‌ పాల్గొన్నారు. ఆ రోజు 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై చర్చించారు. 100 శాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా చూసేందుకు ప్రతీ పల్లెకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని నిర్ణయించారు. ఆ సందర్భంగానూ పెన్షన్‌, రేషన్‌ కట్‌లపై ఎటువంటి చర్చ జరగలేదని సమాచారం.

Updated Date - 2021-10-27T08:31:20+05:30 IST