పంపిణీ... పరేషన్‌!

ABN , First Publish Date - 2021-05-14T05:47:25+05:30 IST

జిల్లాలో 669 రేషన్‌ దుకాణాలున్నాయి.

పంపిణీ... పరేషన్‌!
రేషన్‌ కోసం వేచిచూస్తున్న లబ్ధిదారులు

 సర్వర్‌ సతాయింపు 

 అందని ఓటీపీ

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో డీలర్ల భయం

 బుధవారం సర్వర్‌ డౌన్‌తో జిల్లావ్యాప్తంగా రేషన్‌ లబ్ధిదారుల ఇక్కట్లు

ఖమ్మం కలెక్టరేట్‌, మే13: జిల్లాలో 669 రేషన్‌ దుకాణాలున్నాయి. వీటిపరిధిలో 4,04909 కార్డుదారులున్నారు. వీరికి మే నెలకు సంబందించి 57646.78 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల మెదటి నుంచి రేషన్‌ పంపిణీపై నీలినీడలు అలముకున్నాయి. నేలకొండపల్లి, కూసుమంచి ఖమ్మం నగరంలో పలువురు రేషన్‌ డీలర్లు కరోనాతో మృతి చెందడంతో పంపిణీకి డీలర్లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మేనెల రేషన్‌ పంపిణీ తీవ్ర జాప్యం అవుతోంది. దీనికి తోడు బుధవారం నుంచి జిల్లాలో లాక్‌డౌన్‌ అమలౌతోంది. ఉదయం 5గంటల నుంచి 10గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో రేషన్‌ లబ్దిదారులు దుకాణాలకు బారులు తీరుతున్నారు. 


 సర్వర్‌ సతాయింపు


ఈ పాస్‌ మిషన్లుకు నెట్‌ వర్క్‌ లేక సర్వర్‌ సతాయిస్తోంది. దీంతో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయడానికి వీల్లేకుండా పోతోంది. ఐరిష్‌ విధానంలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో బొటనవేలు, లేకుంటే ఓటీపీ ద్వారా రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే సర్వర్‌ రాకపోవడంతో ఈ పాస్‌ మిషన్‌లో వివరాలు లేక ఓటీపీ రావడంలేదు. దీంతో సరుకుల పంపిణీకి తీవ్ర జాప్యం అవుతోంది. దీనిపై కుస్తీలు పడుతున్న డీలర్లు లబ్దిదారులకు సమాధానం చెప్పలేక నానా యాతన పడుతున్నామని వాపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయం మీరుతుండడంతో పోలీసులు అనుమతులు ఇవ్వరని లబ్ధిదారులు, ఇటు డీలర్లు భయంతో వణికిపోతున్నారు. సర్వర్‌ సమస్యతో వారు గంటల తరబడి దుకాణాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా బుధవారం రేషన్‌ దుకాణాల్లో ఇదే పరిస్థితి దాపురించింది. అయితే సర్వర్‌ లోపం కారణంగా గంటల తరబడి వేచి ఉండి వెళ్లిపోయి మరుసటి రోజు మళ్లీ రావాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 భయంతో గడపాల్సి వస్తోంది,: షేక్‌ ఇబ్రహీం, నగరంలో డీలర్‌


రేషన్‌ పంపిణీలో ఈపాస్‌ యంత్రాల్లో సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 5గంటల వ్యవధి మాత్రమే పంపిణీకి సమయం ఉంది. కానీ సర్వర్‌ లేకపోవడంతో పట్టుమని పది మందికి కూడా రేషన్‌ ఇవ్వలేక పోతున్నాం. పది గంటలకే కార్డుదారులు బారులు తీరుతున్నారు.  లాక్‌డౌన్‌ సమయం అయిపోతుండడంతో పోలీసులు ఇబ్బంది పెడతారని భయపడాల్సి వస్తోంది. ఇటు సర్వర్‌ రాక ఇబ్బందులు, కార్డుదారుల ఒత్తిళ్లు భరించలేకపోతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి సర్వర్‌ సమస్య లేకుండా చేయాలి.


Updated Date - 2021-05-14T05:47:25+05:30 IST