ఉచిత బియ్యానికి స్వస్తి

ABN , First Publish Date - 2020-12-01T04:34:51+05:30 IST

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్‌ కార్డుదారులకు అందించిన ఉచిత రేషన్‌బియ్యం సరఫరా గడువు ముగిసింది.

ఉచిత బియ్యానికి స్వస్తి
రేషన్‌దుకాణం

-ఈనెల నుంచి రేషన్‌షాపుల్లో కిలోకు రూపాయి చొప్పున బియ్యం పంపిణీ

-ఉత్తర్వులు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

-జిల్లాలో 1,37,310 ఆహార భద్రత కార్డులు 

ఆసిఫాబాద్‌, నవంబరు30: కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్‌ కార్డుదారులకు అందించిన ఉచిత రేషన్‌బియ్యం సరఫరా గడువు ముగిసింది. డిసెంబరు నుంచి జిల్లాలోని అన్ని రేషన్‌దుకాణాల్లో లబ్ధిదారులకు కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం అందించ నున్నారు. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఎనిమిది నెలలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ప్యాకేజీ నవంబరు నెలతో ముగించారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో వినియోగదారునికి 12కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయగా జూలై నుంచి నవంబరు వరకు 10 కిలోల చొప్పున అందజేశారు. డిసెంబరు నుంచి పాత పద్ధతిలోనే రేషన్‌బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


ఎనిమిది నెలలుగా ఉచితం

కరోనా వైరస్‌ దృష్ట్యా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో తెల్లరేషన్‌కార్డుదారులకు ఎనిమిది నెలల పాటు రేషన్‌ డీలర్లు ఉచితంగా బియ్యాన్ని  పంపిణీ చేశారు. జిల్లాలో 1,37,310 ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులతో పాటు 12,982 ఏఏవై కార్డులు, 21 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 278 రేషన్‌షాపుల ద్వారా ఆహార భద్రత కార్డు దారులకు మనిషికి ఆరు కిలోల చొప్పున, ఏఏవై కార్డుదారులకు ఒక్కో కుటుంబానికి 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. 


ఉచితంగా బియ్యం ఇవ్వాలంటున్న పేదలు

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగు తుండటంతో రోజురోజుకూ కేసులు పెరుగు తున్నాయి. ఈనేపథ్యంలో ఉపాధి సమస్య ప్రజలను పట్టి పీడిస్తుండటంతో ప్రభుత్వం గతంలో మాదిరి గానే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత బియ్యం పంపిణీ మరికొంత కాలం కొనసాగించాలని కోరుతున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు మళ్లీ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఇంకా కొంత కాలం పడుతుందని, అప్పటి వరకు ఉచితంగా బియ్యం సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

పేదలను ఆదుకోవాలి

-బోగే ఉపేందర్‌, సీపీఐ జిల్లా నాయకుడు

కరోనా మహమ్మరి పూర్తి స్థాయిలో తగ్గక పోవడంతో గ్రామీణ పేద ప్రజలు నేటికీ ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. దీంతో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు కాస్తంత ఊరట లభిస్తుంది. 

 

Updated Date - 2020-12-01T04:34:51+05:30 IST