Abn logo
Sep 27 2021 @ 00:52AM

రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తుండడంతో చాలామంది ఏం చేస్తున్నారంటే..

రేషన్‌ బియ్యం విక్రయానికి కలవంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు

 బ్లాక్‌మార్కెట్‌కు, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న చౌకబియ్యం


తిరుపతి సిటీ, సెప్టెంబరు 20: చౌకదుకాణాల్లో రాయితీపై ఇచ్చే బియ్యం అక్రమార్కులకు పరమాన్నంగా మారుతోంది. పేదల నోటికి చేరాల్సిన ముద్దతో రూ.కోట్ల వ్యాపారం సాగుతోంది. జిల్లాలోని 2,901 చౌక దుకాణాల పరిధిలోని 11.56 లక్షల రేషన్‌ కార్డుదారులకు ప్రతినెలా నెలా 18 వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం రెండో విడతలో ఇచ్చే ఉచిత బియ్యం మరో 18 వేల టన్నులు కలుపుకొంటే 36 వేల టన్నులు పంపిణీ అవుతోంది. ఇందులో సగం వరకు రేషన్‌ బియ్యం నల్ల బజారుకు తరలిపోతోందన్న విమర్శలున్నాయి. షాపుకొచ్చే కార్డుదారులతో బియ్యం నాణ్యతగా లేవని, వాటికి బదులుగా కిలోకు రూ.10 లెక్కన నగదు చెల్లిస్తామంటూ కొందరు డీలర్లు బేరమాడుతున్నారు. దీంతో కొందరు లబ్ధిదారులు ఎంతో కొంత నగదు వస్తుందనే ధోరణితో బియ్యం తీసుకున్నట్లు వేలిముద్రలు వేసి నగదు తీసుకెళ్తున్నారు. మరికొందరు ఇళ్ల వద్దకే వచ్చి ‘రేషన్‌ బియ్యం కొంటాం’ అని అడుగుతున్నారు. కిలో రూ.10 నుంచి రూ.13 వరకు చెల్లించి కొంటున్నారు. ఇలా, డీలర్ల నుంచి కొంత.. ఇళ్ల నుంచి తీసుకెళ్లే వారితో మరికొంత రేషన్‌ బియ్యాన్ని దళారులకు రూ.16 నుంచి రూ.20 వరకు విక్రయుస్తున్నారు. వీరు ఈ బియ్యాన్ని మిల్లులకు తరలించి అక్కడ మిల్లింగ్‌ చేశాక అదే బియ్యాన్ని రూ.30 నుంచి 35 చొప్పున మార్కెట్‌లో సంచులుగా మార్చి విక్రయిస్తున్నారు. మరికొందరు అదునుచూసి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు కొందరు సామాజిక మాధ్యమాలను సాధనంలా చేసుకుని రేషన్‌ బియ్యం అమ్మబడును అని విక్రయాలు సాగిస్తున్నారంటే జిల్లాలో రేషన్‌ బియ్యం వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలో నెలకు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు రేషన్‌ బియ్యం మీదనే అక్రమ వ్యాపారం సాగుతోందని అంచనా. కొందరు డీలర్లు రాజకీయ నేతల ముసుగులో దర్జాగా రేషన్‌ బియ్యం నిల్వచేసి విక్రయాలు సాగిస్తున్నారనే సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఒకవేళ అటు వెళ్లినా బడా నేతల నుంచి వెంటనే వీరిపై ఒత్తిళ్లు వస్తున్నాయి. అడపాదడపా సమాచారం అందినప్పుడు పోలీసులే దాడులు చేపట్టి వేల టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు తప్ప సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉందన్న ఆరోపణలున్నాయి. 

వెదురుకుప్పం మండలంలో ఇటీవల రేషన్‌ బియ్యంలో గుర్తించిన ప్లాస్టిక్‌ బియ్యం

ప్లాస్టిక్‌ బియ్యం భయంతో విక్రయాలు

రేషన్‌ బియ్యంలో ఇటీవల ప్లాస్టిక్‌ బియ్యం వస్తుండటంతో ఆ బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గుర్రంకొండ, వెదురుకుప్పం మండలాల్లో ప్లాస్టిక్‌ బియ్యం కలిసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ భయంతోనూ పలువురు కార్డుదారులు రేషన్‌ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. 

శనివారం పట్టుబడిన మదనపల్లెలోని ఓ రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌బియ్యం

ఇటీవల పట్టుబడిన ఘటనలు 

  •  కేవీబీపురం మండలంలోని కోవనూరు గిరిజనకాలనీలో జూలై నెల 28న అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 182 బస్తాల రేషన్‌ బియ్యం, కారును పోలీసులు సీజ్‌ చేశారు.
  •  తిరుపతి నగరం చింతలచేనులో అక్రమంగా నిల్వచేసి ఉన్న రూ.11 లక్షల విలువైన 35 టన్నుల రేషన్‌ బియ్యాన్ని జూన్‌ 9న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు ముఠాగా ఏర్పడి రేషన్‌ బియ్యం కొని.. ఇలా నిల్వచేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
  •  అదే నెలలో నగరి మండలంలోని పలు గ్రామాల్లో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేసిన రెవెన్యూ అధికారులు 509 బస్తాల్లోని 22,090 కిలోల బియ్యాన్ని స్వాఽధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు.
  •  చిత్తూరు, తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, మదనపల్లె వంటి పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ఇటీవల పోలీసులు, విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి.
  •  రెవెన్యూ అధికారులకు అందిన సమాచారం మేరకు మదనపల్లె పట్టణంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ రైస్‌మిల్లులో 80 టన్నుల రేషన్‌ బియ్యం నిల్వను శనివారం గుర్తించారు. ఇందులో పాలిష్‌ చేసినవి 719 క్వింటాలు, వేస్టేజీ కింద 92 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.