దారి మళ్లుతున్న రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-05-18T05:43:52+05:30 IST

రేషన్‌ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే మాఫియా దందా ఆగటం లేదు. అధికారులు ఎంత కట్టడి చేసినా వెనకడుగు వేయటం లేదు.

దారి మళ్లుతున్న రేషన్‌ బియ్యం
రేషన్‌ బియ్యంతో పట్టుబడ్డ వాహనం(ఫైల్‌)


పట్టుబడుతున్నా ఆగని వ్యాపారం

యథేచ్ఛగా అక్రమ రవాణా


చీరాల, మే 17 : రేషన్‌ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే మాఫియా దందా ఆగటం లేదు. అధికారులు ఎంత కట్టడి చేసినా వెనకడుగు వేయటం లేదు. మూడు రోజుల క్రితం వేటపాలెం మండలం పందిళ్లపల్లి సమీపంలో రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. వీటిని చినగంజాం మండలం మోటుపల్లికి చెందినవారు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అధికారులు  పక్కా సమాచారం అందినపుడు మాత్రమే  స్పందిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో పాటు పట్డుబడ్డ వారిపై పెట్టే కేసులు కూడా కఠినంగా ఉండటం లేదు. దీంతో తమకు వచ్చే ఆదాయంతో పోలిస్తే పోలీస్‌, రెవెన్యూ, కోర్టు కేసులకు సంబంధించి చేసే ఖర్చు తక్కువగా ఉండటంతో ఆ దందా చేసేవారు వెనకడుగు వేయటంలేదని విషయం తెలిసిన వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

 6ఏ కేసులతో కనిపించని ప్రయోజనం..

డీలర్లు సేకరించిన బియ్యం కొన్ని సందర్భాల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడుతుంటాయి. ఆ సమయంలో వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. దీనివలన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. చర్యలు నామమాత్రంగా ఉండటంతో డీలర్లు కూడా పెద్దగా భయపడటం లేదు. ఈ క్రమంలో ఇటీవల నల్లబజారు వ్యాపారానికి సంబంధించి క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినా వారు వెనకడుగు వేయటం లేదు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


మద్దిపాడులోనూ ఆగని దందా

మద్దిపాడు, మే 17  : ప్రభుత్వం పేదలకిస్తున్న రేషన్‌ బి య్యాన్ని కొందరు వ్యాపారదారులు పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమ వ్యాపారం చేసి లక్షలకు పడగలెత్తుతున్నారు. ఈ మాఫియా దందా మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. ప్రజల వద్ద నుంచి కిలో 10 నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా చీకటి వ్యాపారం అగడంలేదు. గ్రామాలలో సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి పాలిషింగ్‌ పట్టి ఎక్కువ ధరలకు అమ్మకాలు చేపడుతున్నారు. 

మండలంలోని వెల్లంపల్లి, మద్దిపాడు, గుండ్లాపల్లిలోని వ్యాపారులు కొంతమంది ఏజెంట్లను ఏర్పరుచుకుని డీలర్ల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. విజిలెన్సు అధికారులకు వ్యాపారులపై పూర్తి సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2021-05-18T05:43:52+05:30 IST