గుడ్డివాడిగా కనిపించేందుకు లెన్సులు పెట్టుకోమన్నారు.. కానీ నేను..: ‘మహాభారతం’ నటుడు

ABN , First Publish Date - 2020-05-28T23:40:16+05:30 IST

రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లు పున:ప్రసారంలోనూ దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. అత్యధికంగా టీవీ వీక్షకుల...

గుడ్డివాడిగా కనిపించేందుకు లెన్సులు పెట్టుకోమన్నారు.. కానీ నేను..: ‘మహాభారతం’ నటుడు

న్యూఢిల్లీ: రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లు పున:ప్రసారంలోనూ దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. అత్యధికంగా టీవీ వీక్షకుల మన్ననలు పొందుతున్న ఈ సీరియళ్లు పలు రికార్డులనూ సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఆయా సీరియళ్లలో నటించిన నటులు అనేకమంది తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాభారతంలో ధృతరాష్ట్రుడిగా  నటించిన గిరిజా శంకర్ కూడా తన అనుభవాలను ఇటీవల ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే తాను వృద్ధుడైన ధృతరాష్ట్రుడి పాత్ర చేశానని, అది తనకెంతో గుర్తుండిపోయే పాత్ర అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "దృతరాష్ట్రుడికి కళ్లు కనిపించవు కనుక నేను కూడా అలా కనిపించేందుకు లెన్సులు ధరించమని డైరెక్టర్ రవి చోప్రా చెప్పారు. కానీ సీరియల్ అంటే చాలా కాలం కొనసాగుతుంది.


అంతకాలం ప్రతి రోజూ లెన్సులు పెట్టుకోవాలంటే చాలా కష్టం. అందుకే రవి దగ్గరకు వెళ్లి లెన్సులు అవసరం లేదని, నేను ఇలానే నటిస్తానని చెప్పాను. దానికి ఆయన చూద్దాం అన్నారు. అయితే మొదటి సన్నివేశం తరువాత ‘అంతా బాగుంది లెన్సులు అవసరం లేకుండానే బాగా చేశావు’ అని మెచ్చుకున్నారు" అంటూ గిరిజా శంకర్ తెలిపారు.

Updated Date - 2020-05-28T23:40:16+05:30 IST