Aug 2 2021 @ 05:01AM

రవికి... మేఘానికీ... దోస్తీ

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘దోస్తీ’ పాటను విడుదల చేశారు. చిత్రంలో కథానాయకులిద్దరి మధ్య స్నేహం, వాళ్ల క్యారెక్టరైజేషన్లు వివరించేలా ‘పులికి, విలుకాడికి... తలకి, ఉరితాడుకి... కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్లకి... రవికి, మేఘానికీ... దోస్తీ’ అంటూ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు.


రండి గెలుద్దాం! - ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఈ నెలలో మొదలు కానుందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రచార చిత్రంలో జెమినీ టీవీ వెల్లడించింది. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది. కల మీది. ఆట నాది... కోటి మీది. రండి గెలుద్దాం!’ అంటూ ప్రచార చిత్రంలో ఎన్టీఆర్‌ సందడి చేశారు.