ఇంకొంత విశ్రాంతి దొరికి ఉంటే మొదటి టెస్టు కూడా..: రవిశాస్త్రి

ABN , First Publish Date - 2021-03-07T04:57:16+05:30 IST

మొన్న ఆసీస్‌పై, ఇప్పుడు ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయాలను సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ విజయాలతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి సగర్వంగా టాప్‌ప్లేస్‌లో..

ఇంకొంత విశ్రాంతి దొరికి ఉంటే మొదటి టెస్టు కూడా..: రవిశాస్త్రి

ఇంటర్నెట్ డెస్క్: మొన్న ఆసీస్‌పై, ఇప్పుడు ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయాలను సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ విజయాలతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి సగర్వంగా టాప్‌ప్లేస్‌లో అడుగుపెట్టింది. దీనిపై భారత జట్టు కోచ్ రవిశాస్త్రి మాట్లాడారు. తమ కుర్రాళ్లు జాంబీల్లా మారారని, ఇంకొంత విశ్రాంతి దొరికి ఉంటే చెన్నైలోని తొలి టెస్టు ఫలితం కూడా అనుకూలంగానే వచ్చేదని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడా బెరుకు లేకుండా ఆడి విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు. టెస్ట్ చాంపియన్ షిప్ గురించి ఆలోచించకుండా కేవలం ఈ సిరీస్‌పైనే దృష్టి సారించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.


‘కుర్రాళ్లు సిరీస్‌పై మాత్రమే ఫోకస్ చేశారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి ఆలోచన కూడా చేయలేదు. టెస్ట్ చాంపియన్ షిప్ రేసులో మేం అగ్రస్థానంలో ఉండగా.. ఛాంపియన్‌షిప్‌ రూల్స్ మార్చారు. అయినా పట్టించుకోలేదు. సిరీస్‌పై మాత్రమే దృష్టి సారించాం. అయితే మరికొంత విశ్రాంతి లభించి ఉంటే చెన్నైలో తొలి టెస్టులో ఫలితం మారి ఉండేది. విశ్రాంతి తగ్గి కుర్రాళ్లు జాంబీల్లా మారారు. గెలిచేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ కుదరలేద’ని రవిశాస్త్రి పేర్కొన్నారు.


అంతేకాకుండా అలసిపోయి ఉన్న తమ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కనీసం స్టేడియంలో ప్రేక్షకులు కూడా లేరని అన్నారు. ఇక పిచ్ విషయంలో మాట్లాడుతూ.. ఇలాంటి పిచ్‌లపై ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తమ ఆటగాళ్లు ఈ పిచ్‌పై అద్భుతంగా రాణించారని, దీనిపై ఫిర్యాదులు చేయడం సమంజసం కాదని శాస్త్రి చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-03-07T04:57:16+05:30 IST