రావత్‌ రాజీనామా !

ABN , First Publish Date - 2021-03-10T06:45:57+05:30 IST

పదిరోజుల్లో నాలుగేళ్ళపాలన పూర్తిచేసుకోవాల్సిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు....

రావత్‌ రాజీనామా !

పదిరోజుల్లో నాలుగేళ్ళపాలన పూర్తిచేసుకోవాల్సిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా రాజుకుంటున్న అసమ్మతిని బట్టి ఈ పరిణామాన్ని మీడియా కొద్దిరోజుల క్రితమే ఊహించింది. రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రులెవ్వరూ ఇప్పటివరకూ ఐదేళ్ళ పదవీకాలాన్ని పూర్తిచేసింది లేదు. నాలుగేళ్ళ క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 11స్థానాలకు పరిమితం చేసి, యాభైఏడుమంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఈ రాష్ట్రంలో ఎంతో బలంగా అధికారంలో వచ్చింది. రావత్‌ను మార్చితే తప్ప వచ్చే ఏడాది ఎన్నికల్లో విజయం సాధ్యపడదని అత్యధికులు తేల్చేయడంతో అసమ్మతి ధాటీకి జడిసి పార్టీ అధిష్ఠానం నేడు కొత్త ముఖ్యమంత్రిని తేబోతున్నది. 


బీజేపీలో రెండుసార్లు ముఖ్యమంత్రులైనవారు ఉన్నారు కానీ, ఐదేళ్ళూ పూర్తిచేసింది లేదు. ఈ చిన్న రాష్ట్రశాఖ అసమ్మతికి పెట్టింది పేరు. అమిత్‌షాకు రావత్‌ అత్యంత సన్నిహితులనీ, ఆయన అండచూసుకొనే ఈయన అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనీ, కీలకమైన నిర్ణయాలను సైతం ఏకపక్షంగా తీసుకుంటారని అంతర్గత శత్రువుల విమర్శ. రావత్‌ ఢిల్లీ వచ్చి అధిష్ఠానానికి ఏవో సవరణలూ వివరణలూ ఇచ్చారు కానీ, బీజేపీ పెద్దలకు అవి పెద్దగా పట్టలేదట. రాజీనామా చేయనిపక్షంలో పదవినుంచి తప్పించక తప్పదన్న హెచ్చరికలు కూడా రావత్‌కు అందాయట. రాజీనామా తరువాత తన మద్దతుదారులతో ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆయన బైఠాయించడానికి లోపల రగులుతున్న ఈ ఆగ్రహమే కారణం కావచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌నుంచి చీలి ఇరవైయేళ్ళక్రితం ఏర్పడిన ఈ చిన్నరాష్ట్రాన్ని ఇప్పటివరకూ ఎనిమిది మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే, ఐదేళ్ళపదవీ కాలాన్ని పూర్తిచేసింది నారాయణ్‌దత్‌ తివారీ ఒక్కరే. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ళకు జరిగిన తొలి ఎన్నికల్లో ముప్పై ఆరుమంది ఎమ్మెల్యేలతో, స్వల్ప మెజారిటీ మాత్రమే ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తివారీ విజయవంతంగా నడిపించారు. ఈయనకు ముందు నిత్యానందస్వామి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది కూడా పూర్తికాకుండానే పార్టీ పెద్దలు ఆయనను తప్పించి ఎన్నికలకు నాలుగునెలల ముందు బిఎస్‌ కోషియారీని పదవిలో కూచోబెట్టినా ఎన్నికల్లో పార్టీ నెగ్గలేదు. ఎన్డీ తివారీ ఐదేళ్ళ పాలన తరువాత 2007లో అధికారంలోకి వచ్చిన బీజేపీ గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రులను పూర్తికాలం ఉండనివ్వకుండా మధ్యలో మార్చుతూ వచ్చింది. 2012 ఎన్నికలకు సరిగ్గా ఆర్నెల్లముందు రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ను తప్పించి, మళ్ళీ బీసీ ఖండూరీని గద్దెనెక్కించినా బీజేపీ కంటే కాంగ్రెస్‌ ఒకస్థానం ఎక్కువే నెగ్గి మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్‌నుంచి పెద్దతలకాయలను చేర్చుకోవడం, విపక్షాలను బలహీనపరచడం వంటి విన్యాసాలు ఒకపక్కన సాగుతున్నా, బీజేపీకి అసమ్మతి సెగ ఎప్పటికప్పుడు తప్పడం లేదు.


ఎన్డీ తివారీ తరువాత అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రావత్‌ను ఇప్పటికైనా తప్పించకుంటే, బీజేపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోనో, ఆమ్‌ ఆద్మీపార్టీలోనో చేరిపోతారని బీజేపీ పెద్దలకు సమాచారం అందిందట. రావత్‌మీద అవినీతి ఆరోపణలు రావడం, హైకోర్టు తప్పుబట్టడం అసమ్మతికి మరింత ఊతం ఇచ్చింది. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ సహా యాభైఒక్క దేవస్థానాలను ప్రభుత్వ అధీనంలోకి తెచ్చిన చట్టంతో ఆయన విహెచ్‌పి, ఆరెస్సెస్‌ల ఆగ్రహానికి గురైనారని అంటారు. రాష్ట్ర ఆధ్యాత్మిక రంగంలో కొంతమంది పెత్తనాన్ని దెబ్బతీయడానికే రావత్‌ ఈ పనిచేశారన్నది విమర్శ. రాష్ట్రంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఎంతోకాలంనుంచి కుమావూన్‌, గర్వాల్‌ కమిషనరేట్లు మాత్రమే ఉండగా, ఈ రెండింటిలోని కొన్ని భూభాగాలతో ఒక కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు చేయడం రెండుప్రాంతాలవారినీ ఆగ్రహానికి గురిచేసింది. ఇలా, ఆధ్యాత్మిక రంగంలోనూ, రాజకీయంగానూ రావత్‌ పార్టీకి చేసిన నష్టం పూడ్చుకోవాలంటే కొత్తముఖ్యమంత్రినే కాక, కొత్తగా ఉపముఖ్యమంత్రి స్థానంలో కుమావూన్‌ ప్రాంతంనుంచి ఎవరో ఒకరిని తెచ్చిపెడితే తప్ప ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని అధిష్ఠానం భావన. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించడమనే కాంగ్రెస్‌ విధానానికి బీజేపీ దూరం కానిదే ఈ అసమ్మతికి స్వస్తి పలకడం అసాధ్యం.

Updated Date - 2021-03-10T06:45:57+05:30 IST