ఆర్‌అండ్‌బీ ఆస్తులూ తనఖాలోకి!

ABN , First Publish Date - 2021-06-11T08:13:59+05:30 IST

కొత్తగా ఎన్ని రోడ్లు వేశారు అని అడగొద్దు! ఎక్కడైనా కొత్తగా భవనాలు కట్టారేమో అని వెతకొద్దు! ఇవేవీ లేకున్నా... రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సర్కారు వారు సిద్ధమయ్యారు

ఆర్‌అండ్‌బీ ఆస్తులూ తనఖాలోకి!

విలువ 5 వేల కోట్లు!

వాటి తాకట్టుతో ఆగస్టు నుంచి అప్పులు 

అప్పుల్లో సర్కారు అదుర్స్‌

పది వారాల్లో రూ.12 వేల కోట్ల అప్పు

జూలై నాటికి 20వేల కోట్ల పరిమితి పూర్తి

ఇక ఆ తర్వాత తనఖా పెడితేనే పుట్టేది

అందుకే ఆర్‌అండ్‌బీ ఆస్తులపై గురి


ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కానీ... మొదటి పది వారాల్లోనే రూ.12 వేల కోట్లు అప్పు చేశారు.


ఆర్‌అండ్‌బీ ఆస్తుల విలువ రూ.5వేల కోట్లు. పాత అప్పులు, వాటిపై వడ్డీలకు ప్రతినెలా రూ.2,900 కోట్లు కడుతున్నారు. అంటే... ఆర్‌అండ్‌బీ ఆస్తుల విలువకు సమానమైన అప్పులు తెచ్చినా మూడు నెలల ‘కిస్తీ’లు కూడా కట్టలేరు.


ఆస్తులు, ఆదాయం లేని ఏపీఎ్‌సడీసీకి అప్పులు ఎలా ఇస్తాం.. అని బ్యాంకులు ప్రశ్నించాయి. అందుకే... కనీసం 2వేల కోట్ల విలువైన ఆస్తులను ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ‘విశాఖ తనఖా’ అందులో భాగమే అని సమాచారం!


ఆదాయం లేదు! అప్పులే దిక్కు! అందుకే ‘గీత’దాటి అప్పులు చేసేస్తున్నారు. ఇక ముందు ఆస్తులు తనఖా పెడితేగానీ... అప్పు పుట్టని పరిస్థితి! అందుకే... విశాఖను తనఖాలోకి నెడుతున్నారు. తాజాగా... రహదారులు, భవనాల శాఖకు చెందిన విలువైన ఆస్తులు, స్థలాలనూ ‘తాకట్టు’ జాబితాలోకి చేర్చేస్తున్నారు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొత్తగా ఎన్ని రోడ్లు వేశారు అని అడగొద్దు! ఎక్కడైనా కొత్తగా భవనాలు కట్టారేమో అని వెతకొద్దు! ఇవేవీ లేకున్నా... రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సర్కారు వారు సిద్ధమయ్యారు. ఇదంతా... అచ్చంగా అప్పులు తెచ్చేందుకే! ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చింది. త్వరలో... గరిష్ఠ పరిమితి కూడా తీరనుంది. ఆ తర్వాత... తేబోయే అప్పుల కోసమే, ఈ ‘తాకట్టు’ తతంగం! రోడ్లు, భవనాల శాఖకు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో చాలా విలువైన భవనాలు, అతిథి గృహాలు, క్వార్టర్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది. ఈ ఆస్తులు చూపించి త్వరలో అప్పుల కోసం బ్యాంకులను సంప్రదించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే మీరూ ‘అప్పు’లో కాలేసినట్లే! కొత్తగా తేబోయే అప్పు... అచ్చంగా పాత అప్పులు, వాటిపై వడ్డీలు తీర్చడం కోసమే! గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం అప్పులు, వడ్డీల రూపంలో రూ.35,000 కోట్లు చెల్లించింది. అంటే.. నెలకు రూ.2,916 కోట్లు! ఇప్పుడు ఆర్‌అండ్‌బీ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టినా మూడు నెలల అప్పు, వడ్డీ కూడా కట్టలేరు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ... రాష్ట్ర ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించకపోగా, ప్రభుత్వ శాఖల ఆస్తులు తనఖా పెట్టడానికే సర్కారు ఉవ్విళ్లూరుతోంది. 


అప్పులు చేయడంలోనే అభివృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కానీ... రాష్ట్ర సర్కారుది అప్పుల విషయంలో అలవి మాలిన ఆకలి! ఆర్థిక సంవత్సరం మొదటి పది వారాల్లోనే ఏకంగా రూ.12 వేల కోట్ల అప్పులు తెచ్చారు. మిగిలింది రూ.8 వేల కోట్లే. రుణ సేకరణ విషయంలో ఇదే ‘వేగం’ చూపిస్తే... జూలై ఆఖరు నాటికే మొత్తం 20 వేల కోట్ల పరిమితి ముగుస్తుంది. మరి ఆగస్టు నుంచి అప్పులు తెచ్చుకునేదెలా? దీనికి సమాధానమే, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు!


‘విశాఖ తనఖా’ అందుకేనా?

కేవలం అప్పులు తెచ్చుకోవడం కోసమే ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు రూ.21,500 కోట్లు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులతో ఒప్పందం కుదిరింది. బ్యాంకులు ఇప్పటి వరకు రూ.18,500 కోట్లు అప్పులు ఇచ్చాయి. మిగిలిన రూ.3,000 కోట్ల అప్పులు కూడా తెచ్చుకోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఏపీఎ్‌సడీసీకి ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు. మద్యంపై విధించే సెస్‌ను ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపిస్తున్నారు. మాట ఇచ్చినట్లుగా ప్రభుత్వం మద్య నిషేధం విధిస్తే... ఆ ఆదాయం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఆ కార్పొరేషన్‌కు సొంతంగా ఆస్తులు ఉంటేనే అప్పులిస్తామని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఆ కార్పొరేషన్‌కు బ్యాంకులు ఇచ్చే అప్పులో 10 శాతం విలువైన ఆస్తులను ఆ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తామని ఆర్థిక శాఖ గతంలో ఒక జీవో ఇచ్చింది. 10 శాతం అంటే దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను ఆ కార్పొరేషన్‌ పేరిట బదలాయించాలి. ఇందుకోసమే విశాఖలోని ప్రభుత్వ శాఖల భూములను ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది.

Updated Date - 2021-06-11T08:13:59+05:30 IST