బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు ఇక లేరు

ABN , First Publish Date - 2021-04-21T06:43:10+05:30 IST

భారత బ్యాంకింగ్‌ రంగ సంస్కరణల పితామహుడు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం ఇక లేరు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు...

బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు ఇక లేరు

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం కన్నుమూత 


హైదరాబాద్‌: భారత బ్యాంకింగ్‌ రంగ సంస్కరణల పితామహుడు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం ఇక లేరు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. ఆర్‌బీఐ 13వ గవర్నర్‌గా 1977 మే 2 నుంచి నవంబరు 30 వరకు (7 నెలలు) బాధ్యతలు నిర్వహించారు. ఆర్‌బీఐ క్యాడర్‌ నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి, ఏకైక వ్యక్తి ఈయనే. ఆర్‌బీఐకి తొలి తెలుగు గవర్నర్‌ కూడా.


తొలుత నరసింహం ఆర్‌బీఐలోని ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహిం చారు. గవర్నర్‌గా నియమితులు కాకముందు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా నరసింహం కొనసాగింది స్వల్పకాలమే అయినప్పటికీ, అనంతరం ప్రపంచ బ్యాంక్‌లో భారత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత  ఐఎంఎఫ్‌లోనూ కీలక పదవి చేపట్టారు. 1981లో ఐఎంఎఫ్‌ నుంచి భారత్‌కు భారీ ఆర్థిక ప్యాకేజీ లభించడంలో కీలకపాత్ర పోషించారు. అధిక ధరాఘాతం, కరువు, అడుగంటిన విదేశీ మారక నిల్వలతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్‌ను గడ్డు పరిస్థితుల నుంచి గటెక్కించడంలో ఐఎంఎఫ్‌ ప్యాకేజీ ఎంతగానో తోడ్పడిందని ఆర్‌బీఐ చరిత్ర వాల్యూమ్‌-3 పేర్కొంది. అంతేకాదు, ఆర్థిక సేవల రంగానికి సంబంధించి 1991లో ఏర్పాటైన కమిటీతోపాటు 1998లో బ్యాంకింగ్‌ రంగ సంస్కరణల కమిటీకీ నేతృత్వం వహించారు. 1983లో భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు. ఆర్థిక రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా  2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. 





బ్యాంకింగ్‌ రంగానికి విశేష సేవలు 

  1. ప్రభుత్వ రంగ బ్యాంకులకు అనుబంధంగా గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఆయన నేతృత్వంలో 1975లో ఓ కమిటీ ఏర్పాటైంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) ఆ కమిటీ కృషి ఫలితమే. 
  2. భారత ఆర్థిక సేవల రంగానికి సంబంధించి 1991, 1998లో ఆయన అధ్యక్షతన ఏర్పాటైన  కమిటీల సిఫారసులు.. బ్యాంకింగ్‌ సంస్కరణలకు గట్టి పునాది వేశాయి. 1991 కమిటీ రిపోర్టు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ)ను నిర్వచించింది. బ్యాంకులకు వర్తించే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎ్‌సఎల్‌ఆర్‌), నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) క్రమంగా తగ్గింపుతో పాటు అధిక క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో, వడ్డీ రేట్ల సడలింపును సూచించిందీ ఈ కమిటీనే. ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏల టేకోవర్‌ కోసంఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ ఫండ్‌ ఏర్పాటు చేయాలని నరసింహం కమిటీ అప్పట్లోనే ప్రతిపాదించింది. 
  3. ప్రభుత్వ బ్యాంకులకు స్వయం ప్రతిపత్తి, పీఎస్‌బీల విలీనాలు, ప్రభుత్వ వాటాల విక్రయం వంటి మరెన్నో సిఫారసులను ఈయన నేతృత్వంలోని కమిటీ చేసింది.


Updated Date - 2021-04-21T06:43:10+05:30 IST