వడ్డీలు తగ్గే ఆశల్లేవ్‌...

ABN , First Publish Date - 2020-11-30T07:04:26+05:30 IST

ఆర్‌బీఐ వచ్చే శుక్రవారం ప్రకటించనున్న ద్రవ్య విధానంలో కూడా రెపోరేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే ఆస్కారం ఉంది. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతూ ఉండడం ఇందుకు కారణమని నిపుణులు...

వడ్డీలు తగ్గే ఆశల్లేవ్‌...

  • యథాతథ స్థితికే ఆర్‌బీఐ మొగ్గు


న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వచ్చే శుక్రవారం ప్రకటించనున్న ద్రవ్య విధానంలో కూడా రెపోరేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే ఆస్కారం ఉంది. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతూ ఉండడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సారథ్యంలోని ఆరుగు రు సభ్యుల ద్రవ్య విధా న కమిటీ (ఎంపీసీ) వచ్చే రెండు నెలల కాలానికి అనుసరించదగిన ద్రవ్యపరపతి విధానంపై చర్చించేందుకు వచ్చే బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. వచ్చే శుక్రవారంనాడు ఎంపీసీ నిర్ణయాలను దాస్‌ ప్రకటిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ప్రతికూల వృద్ధిరేటు నమోదైన నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల విషయంలో సద్దుబాటు ధోరణిని కొనసాగించే ఆస్కారం ఉన్నదన్నది నిపుణుల అభిప్రాయం. అక్టోబరు నాటి ఎంపీసీ సమావేశంలో సద్దుబాటు ధోరణిని  కొనసాగిస్తూనే రెపోరేట్లను యథాతథంగా కొనసాగించిన విషయం విదితమే.  ఈ సారి కూడా అదే వైఖరి అవలంబిస్తే వరుసగా మూడోసారి ఆ తరహా నిర్ణయం తీసుకున్నట్టవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేట్లను 1.15 శాతం మేరకు తగ్గించిన ఆర్‌బీఐ గత రెండు విడతలుగా తగ్గింపు నిర్ణయాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఆహార వస్తువుల ధరల కారణంగా వినియోగదారుల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 9 నెలలుగా పెరుగుతూ ప్రస్తుతం 7.61 శాతం వద్ద ఉంది. 2014 మే తర్వాత ఇది అంత గరిష్ఠ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పైకి లేదా దిగువకు రెండు శాతం వంతున మార్జిన్‌తో 4 శాతం వద్ద స్థిరంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించింది.


ప్రస్తుతం అది 6 శాతం కన్నా పై స్థాయిలోనే కదలాడుతున్న కారణంగా రేట్ల తగ్గింపునకు అవకాశం లేనట్టుగానే తాము భావిస్తున్నామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ శాంతి ఏకాంబరం అన్నారు. అయితే ప్రస్తు తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటూ ఉండడం, వినియో గ డిమాండు సాధారణ స్థితికి రావడం సానుకూల అంశాల ని, ఆ జోరు నిలబడుతుందా, లేదా అనేందుకు వచ్చే కొద్ది నెలలు కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. కేర్‌ రేటింగ్స్‌ ప్రధా న ఆర్థికవేత్త మదన్‌ సబ్నవిస్‌, క్రిసిల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ ధర్మకృతి జోషి, బ్రిక్‌వర్క్స్‌ రేటింగ్‌ ఎం.గోవిందరావు కూడా ఇదే తరహా అభిప్రాయం ప్రకటించారు. వాస్తవ వడ్డీరేట్లు ఇప్పటికే ప్రతికూలంగా మారాయని, అందు వల్ల మరింతగా రేట్ల తగ్గింపు సాధ్యం కాకపోవచ్చునని రావు అన్నారు.  


Updated Date - 2020-11-30T07:04:26+05:30 IST