కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ

ABN , First Publish Date - 2021-04-07T17:37:13+05:30 IST

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన..

కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ

ముంబై: కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపో రేటు, 3.3 శాతం రివర్స్ రిపోరేటు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శక్తికాంతదాస్ బుధవారంనాడు ప్రకటించారు. ఆర్బీఐ తాజా ప్రకటనతో 4 శాతం రెపోరేటు, 3.3 శాతం రివర్స్ రెపోరేటు యథాతథంగా కొనసాగడం ఇది ఐదోసారి అవుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండేలా ఆర్బీఐ చర్యలు చేపడుతుందని శక్తికాంతదాస్ పేర్కొన్నారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని, మూడో  త్రైమాసికం నాటికి అది 4.4 శాతానికి పరిమిత కావచ్చని కూడా ఆర్బీఐ అభిప్రాయపడింది. 2021-22లో జీడీపీ వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఆర్బీఐ కట్టుబటి ఉందని, దేశీయ ఆర్థిక సంస్థలపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ప్రభావం నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంత దాస్ తెలిపారు.


తాజా రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ, ఎస్‌ఐడీబీఐలకు రూ.50,000 కోట్లు అదనపు లిక్విడిటీ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రాష్ట్రాలకు ఇచ్చే చేబదుళ్ల ('వేస్ అండ్ మీన్స్) పరిమితిని రూ.47,010 కోట్లకు పెంచింది. అలాగే, కోవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మధ్యంతర రూ.51.560 కోట్ల చేబదుళ్ల కాలపరిమితిని కూడా సెప్టెంబర్ వరకూ పొడిగించినట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు. కోవిడ్ వ్యాప్తి నిరోధం, ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి సారించిన్నట్టు తెలిపారు.

Updated Date - 2021-04-07T17:37:13+05:30 IST