Advertisement
Advertisement
Abn logo
Advertisement

వృద్ధికి ‘శక్తి’

 • ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లలో యథాస్థితి 
 • వృద్ధి అంచనాల్లోనూ మార్పులేదు.. 

ముంబై: ఒమైక్రాన్‌ వ్యాప్తితో మళ్లీ అనిశ్చితిలో పడ్డ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతుగా నిలిచేందుకే ఆర్‌బీఐ మొగ్గు చూపింది. వృద్ధికి దోహదపడేలా కీలక రెపోరేట్లను యథాతథంగా కొనసాగించాలని బుధవారం నాటి ద్వైమాసిక విధాన సమీక్షలో నిర్ణయించింది. రెపోరేటు యథాతథంగా, చారిత్రక కనిష్ఠ స్థాయిల్లో ఉంచడం ఇది వరుసగా తొమ్మిదో సారి. రెపోరేట్లను యథాస్థితిలోనే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. అంతేకాదు, వడ్డీరేట్లపై ప్రస్తుతం అనుసరిస్తున్న సానుకూల విధానాన్ని కూడా అవసరమైనంత కాలం కొనసాగించనున్నట్లు చెప్పారు.


ఈ విషయంలో మాత్రం ఎంపీసీ సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటు వేయగా ఒకరు వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. ‘‘వృద్ధికి మద్దతివ్వడం, వృద్ధి పునరుద్ధరణ, మార్కెట్లో ధరల నిలకడ, ఆర్థిక స్థిరత్వం విధాన ప్రాధాన్యతలుగా గుర్తించాం.  పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు మాత్రం ఇంకా పెరగాల్సి ఉంది.  కమోడిటీ ధరలు, కంటైనర్లు, చిప్‌ల కొరత రూపంలో ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. ’’ అని దాస్‌ అన్నారు.


బ్యాంక్‌లకు ఊరట 

ఈ పరపతి సమీక్షలో ఆర్‌బీఐ బ్యాంక్‌లకు నిబంధనలను సడలించింది. ఇకపై బ్యాంక్‌లు విదేశాల్లోని శాఖలకు మూలధనం సమకూర్చేందుకు, విదేశీ శాఖలు తమ లాభాలను స్వదేశానికి పంపేందుకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతి అవసరం లేదు. 


డిజిటల్‌ లావాదేవీల రుసుముకు కళ్లెం!? 

ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన డిజిటల్‌ లావాదేవీల రుసుమును సమీక్షించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. క్రెడిట్‌ కారు ్డలు, డెబిట్‌ కార్డులు, మొబైల్‌ వ్యాలెట్లు, ఇతర ప్రీ-పెయిడ్‌ సాధ నాలు, యూపీఐ లావాదేవీలపై వసూలు చేసే రుసుము సహేతుక  స్థాయిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘‘డిజిటల్‌ చెల్లింపు సేవలందించే కంపెనీలు తమ వ్యయాన్ని మర్చంట్‌ లేదా కస్టమర్‌ నుంచి లేదా ఇద్దరి నుంచి వసూలు చేస్తుంటాయి. కస్టమర్లపై ఈ చార్జీల విధింపుతో ప్రయోజనాలతోపాటు దుష్ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ చార్జీలు సముచిత స్థాయిలో ఉండాలి. డిజిటల్‌ చెల్లింపు సేవల వినియోగానికి ప్రతిబంధకం కాకూడదు’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు. 


డిజిటల్‌ కరెన్సీకి ఆ రెండే సవాలు 

సైబర్‌ భ్రదత, డిజిటల్‌ మోసాలే డిజిటల్‌ కరెన్సీకి ప్రధాన సవాళ్లని, వాటిని ఎదుర్కొనే విషయంలో ఆర్‌బీఐ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని శక్తికాంత దాస్‌ అన్నారు. అధికారిక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ ఈ ఏడాది తొలినాళ్లలోనే ప్రకటించింది. 


త్వరలో ఫీచర్‌ ఫోన్ల ద్వారా యూపీఐ చెల్లింపులు!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే సాధ్యమయ్యే డిజిటల్‌ చెల్లింపులను త్వరలో ఫీచర్‌ఫోన్‌ ద్వారానూ జరపవచ్చు. ఫీచర్‌ ఫోన్ల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. తద్వారా దేశంలోని కోట్లాది మంది ఫీచర్‌ఫోన్‌ వినియోగదారలకు సైతం డిజిటల్‌ చెల్లింపు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది అక్టోబరు నాటికి దేశంలో 118 కోట్ల మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులున్నారు. అందులో 30-40 కోట్ల మంది వినియోగదారులు ఇంకా ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారని అంచనా. ూ99ు కోడ్‌ ద్వారా ఫీచర్‌ ఫోన్ల నుంచి చెల్లింపులు జరిపేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే నేషనల్‌ యూనిఫైడ్‌ యూ ఎస్‌ఎస్‌డీ ప్లాట్‌ఫామ్‌ను (ఎన్‌యూయూపీ) అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఆ సేవలకు అంతగా స్పందన లభించలేదు. 


ముఖ్యాంశాలు

 1. వరుసగా 9వ సారి రెపో రేట్లు యథాతథం 
 2. రెపో 4 శాతం, రివర్స్‌ రెపో 3.35 శాతానికి పరిమితం 
 3. వడ్డీ రేట్లపై సానుకూల విధానం కొనసాగింపు
 4. ఈ ఆర్థిక సంవత్సరానికి 9.5ు వృద్ధి అంచనా యథాతథం 
 5. మూడు, నాలుగో త్రైమాసిక అంచనాలు మాత్రం వరుసగా 6.6 శాతం, 6 శాతానికి కుదింపు 
 6. 2022-23 తొలి త్రైమాసికంలో 17.2శాతం వృద్ధి అంచనా
 7. 2021-22లో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం అంచనా 5.3 శాతం 
 8. బ్యాంక్‌ల విదేశీ శాఖలకు మూలధనం నిబంధనల సడలింపు 
 9. డిజిటల్‌ చెల్లింపుల రుసుముపై సమీక్షకు త్వరలో చర్చాప్రతం 
 10. 2022 ఫిబ్రవరి 7-9 తేదీల్లో తదుపరి ద్రవ్యపరపతి సమీక్ష 
Advertisement
Advertisement