హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్బీఐ ఝలక్!

ABN , First Publish Date - 2020-12-03T18:57:48+05:30 IST

భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా గుర్తింపు పొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్బీఐ ఝలకిచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్బీఐ ఝలక్!

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ఝలకిచ్చింది. బ్యాంకు అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవల్లో పలు మార్లు అంతరాయాలు ఏర్పడటంతో సీరియస్ అయిన ఆర్బీఐ.. కొత్త క్రెడిట్ కార్డులను జారీని తాత్కాలికంగా నిలిపి వేయాలని బ్యాంకును ఆదేశించింది. అంతేకాకుండా.. కొత్త డిజిటల్ సేవలేవీ ప్రారంభించవద్దని కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో..బ్యాంకు ఐటీ వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను తొలగించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాజమాన్యానికి సూచించింది. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్వయంగా స్టాక్ మార్కెట్లకు తెలిపింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తొందన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ..ఈ ఆదేశాల వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది. తమ ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపింది.


గత రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆన్‌లైన్ సేవల్లో పలు మార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల బ్యాంకు డాటా సెంటర్లలో తలెత్తిన ఓ సమస్య కారణంగా.. ఏకంగా 12 గంటల పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులతో పాటూ..ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై బ్యాంకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కూడా వినియోగదారులు పెదవి విరిచారు. తమ డాటా సెంటర్లలో అనూహ్య సమస్య తలెత్తిందని పేర్కొన్న బ్యాంకు.. ఇందుకు గల కారణాలేమిటో మాత్రం స్పష్టంగా వివరించలేదు. ఇది హ్యాకింగ్ దాడా, అంతర్గతంగా తలెత్తినా సమస్యా, లేక బ్యాంకు ఐటీ వ్యవస్థలో ఉన్న సంస్థాగత లోపాల అన్న దానికి హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎటువంటి వివరణా లేదు. గత రెండేళ్లుగా బ్యాంకులో ఇటువంటి సమస్యలు పెరుగుతుండటంతో సీరియస్ అయిన ఆర్బీఐ.. ఈ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-12-03T18:57:48+05:30 IST