డిమాండ్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2021-05-18T05:58:29+05:30 IST

కొవిడ్‌ రెండో దశ ఉధృతిపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ కష్టాల్లో పడుతోందని సోమవారం విడుదల చేసిన తన నెలవారీ బులెటిన్‌లో పేర్కొంది

డిమాండ్‌ ఢమాల్‌

కొవిడ్‌ రెండో దశ ఉధృతిపై ఆర్‌బీఐ హెచ్చరిక 

లాక్‌డౌన్లతో మరిన్ని తిప్పలు


ముంబై: కొవిడ్‌ రెండో దశ ఉధృతిపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ కష్టాల్లో పడుతోందని సోమవారం విడుదల చేసిన తన నెలవారీ బులెటిన్‌లో పేర్కొంది. ఈ ఉధృతితో జూన్‌ త్రైమాసికం తొలి నెలన్నర రోజుల్లో డిమాండ్‌ బాగా తగ్గిందని తెలిపింది. డిమాండ్‌ నీరసించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు గత ఏడాదిలా పెద్దగా దెబ్బతినలేదని పేర్కొంది. భారత్‌తో పాటు అనేక దేశాల్ని ముంచేస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్లతో రాకపోకలు తగ్గిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో విచక్షణాపూరిత ఖర్చులతో పాటు ఉపాధి అవకాశాలకూ గండి పడిందని ఆర్‌బీఐ తన బులెటిన్‌లో పేర్కొంది.  


పరిమిత ప్రభావం 

గత ఏడాదితో పోలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ ప్రభావం పరిమితంగానే ఉందని ఈ బులెటిన్‌లో రాసిన ఒక వ్యాసంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎండీ పాత్రా పేర్కొన్నారు. లాక్‌డౌన్లు కొన్ని చోట్ల మాత్రమే అమలు చేయడం, ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచి పనికి అలవాటు పడడం, ఈ-కామర్స్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ డెలివరీలు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనంగా మారాయని పాత్రా పేర్కొన్నారు. 


ఎన్‌బీఎ్‌ఫసీకి దెబ్బే 

కొవిడ్‌తో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎ్‌ఫసీ), ఎంఎ్‌సఎంఈలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. రిటైల్‌ రుణాల రంగంలో ఉన్న ఎన్‌బీఎ్‌ఫసీల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, ఇతర ఎన్‌బీఎ్‌ఫసీల పరిస్థితి మాత్రం ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలిపింది. గత ఆరు నెలల్లో వీటి రుణ వితరణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉన్న విషయాన్ని ఆర్‌బీఐ గుర్తు చేసింది. కొవిడ్‌ దెబ్బతో ఎంఎ్‌సఎంఈల పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొంది. 


ఈ ఆదివారం నెఫ్ట్‌ సేవలుండవు 

ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి ఉపయోగించే నెఫ్ట్‌ వ్యవస్థ టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ పనుల కారణంగా శనివారం (22 వ తేదీ) అర్ధరాత్రి నుంచి ఆదివారం (23 వ తేదీ) మధ్యాహ్నం 2 గంటల వరకు 14 గంటల పాటు అందుబాటులో ఉండదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఏడాదిలో అన్ని రోజులూ 24 గంటలూ అందుబాటులోకి వచ్చిన ఈ ఆన్‌లైన్‌ నగదు బదిలీ వ్యవస్థను మరింత ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని మరింత సమర్థవంతంగా పని చేసే విధంగా టెక్నికల్‌గా శక్తివంతం చేస్తున్నట్టు  తెలిపింది.  

Updated Date - 2021-05-18T05:58:29+05:30 IST