ఆర్బీకేల తీరు... రైతు బేజారు!

ABN , First Publish Date - 2021-07-30T06:23:50+05:30 IST

ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. సిబ్బంది విధులు అలంకారప్రాయమయ్యాయి.

ఆర్బీకేల తీరు... రైతు బేజారు!
కళ్యాణదుర్గం మండలంలో సాగుచేసిన టమోటా పంట

రైతు భరోసా కేంద్రాల గడప దాటని సిబ్బంది

అలంకారప్రాయంగా విధులు

పొలాల వైపు వస్తే ఒట్టు.. 

సాగుపై రైతులకు కొరవడిన సలహాలు, సూచనలు 


కళ్యాణదుర్గం, జూలై29: ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన  రైతు భరోసా కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. సిబ్బంది విధులు అలంకారప్రాయమయ్యాయి. ప్రభుత్వ లక్ష్యం ఒకటైతే... ఆర్బీకే కార్యకలాపాలు రైతు శ్రేయస్సుకు దూరంగా సాగుతున్నాయి. మరోవైపు పంటల సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో సలహాలు, సూచనలు కొరవడ్డాయి. కళ్యాణదుర్గం ని యోజకవర్గంలో ఉద్యానవన పంటల సాగు రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈప్రాంతంలో పండించిన పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.  ఈ వరుసలో మామిడి, దానిమ్మ, బొప్పాయి, అరటి లాంటి వాణిజ్య పంటలతో పాటు టమోటా పంటను కూడా విస్తారంగా సాగుచేస్తున్నారు. అనతికాలంలో ఆర్థిక లాభాలను తెచ్చే టమోటా పంట వైపు రైతులు అధిక సంఖ్యలో మక్కువ చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో నియోజకవర్గ పరిధిలో సుమారు 3 వేల హెక్టార్లలో టమోటా పంట సాగైంది.


కళ్యాణదుర్గంలో 900 హెక్టార్లు, శెట్టూరులో 600, కంబదూరులో 850, బ్రహ్మసముద్రంలో 650, కుందుర్పిలో 700 హెక్టార్లలో టమోటా పంటను సాగుచేశా రు. అయితే ఆయా సీజన్లలో ఏరకం పంటను సాగుచేయాలి..? సస్యరక్షణ చర్యలు, నీరు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ రైతులకు సవా లుగా మారాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ కేంద్రాలు ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకూ సిబ్బంది పొలాల బాట పట్టిందే అరుదు. ఏనాడూ సలహాలు, సూచనలు అందించిన సందర్భాలు లేవని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.


నియోజకవర్గంలో 77 రైతు భరోసా కేంద్రాలు..

నియోజకవర్గ పరిధిలో 77 ఆర్‌బీకేలు ఉన్నాయి. కళ్యాణదుర్గంలో 18 కేంద్రాలు, శెట్టూరులో 13, కంబదూరు 16, బ్రహ్మసముద్రం 14, కుందుర్పి లో 16 కేంద్రాలున్నాయి. వీటన్నిటిలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వారికి విధులు, బాధ్యతలు గుర్తు చేసేనాథులే కరవయ్యారన్న విమర్శలు లేకపోలేదు. వారి పనితీరుపట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యమైంది. రైతు ల ప్రయోజనాల దృష్ట్యా అసిస్టెంట్లు గ్రామాల్లో నివాసముంటూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేయాల్సి ఉంది. పంటల ను పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అయితే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఏ ఒక్క గ్రామంలో కూడా అమలు కావడం లేదని స్థానిక రైతులు వాపోతున్నారు. 


అవగాహన లోపంతో నష్టపోతున్న రైతులు

 పంటల సాగు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన లేకపోవడంతో భారీగా పెట్టుబడి సొమ్ము, ఆదాయాన్ని నష్టపోతున్నారు. ఆయా సీజన్లలో నాణ్యమైన పంటల సాగు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. విధిలేక రైతులు సాంప్రదాయ సాగు ప ద్ధతులతోనే నెట్టుకొస్తున్నారు. ఉన్న కొంత పరిజ్ఞానంతో వివిధ రకాల పంటలను సాగుచేస్తూ నష్టాలను చవిచూస్తున్నారు. టమోటా పంటకు లీఫ్‌మైనర్‌, పచ్చపురుగు, మచ్చ, బూడిద తెగుళ్లు సోకుతున్నాయి. నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో రైతులకు వివరించే వారే లేరు. పంటను కాపాడుకునేందుకు రైతులు స్థానిక ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వారు సూచించిన పురుగుమందులను కొని వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందక రైతుల మోసపోతున్నారు. పంట కోతకు వచ్చే వరకు ఎరువుల దు కాణాల యజమానులను నమ్ముకుని పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఇదే అదునుగా భావించిన ఎరువుల దుకాణాల యజమానులు రైతులకు నాసిరకం ఎరువులు, రసాయనిక మందులు అంటగట్టి  నిలువునా మోసం చేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. సాగు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి నష్టాలను చవిచూడాల్సిన దయనీయ పరిస్థితి రైతుల్లో నెల కొంది. 


రైతు భరోసా కేంద్రాలతో ఉపయోగం లేదు:

వన్నూరు రెడ్డి, రైతు, బసంపల్లి 

రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. హార్టికల్చర్‌ అసిస్టెంట్లు ఏరోజూ పొలాలవైపు కన్నెతి చూసిన దాఖలాలు లేవు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో.. ఎవరికోసం పనిచేస్తున్నారో తెలియదు. ఎరువుల దుకాణాల యజమానులను అడిగి ఎరువులు, రసాయనిక మందులు తెచ్చుకుని వినియోగిస్తున్నాం.


సలహాలు, సూచనలిచ్చే వారే లేరు..:

 శ్రీధర్‌బాబు, రైతు, జల్లిపల్లి 

 పంటలసాగు, తెగుళ్ల నివారణపై సలహాలు, సూచనలిచ్చే నాథులే లేరు. పంట నష్టం వాటిల్లినా పట్టించుకునే అధికారులు అసలే లేరు. ప్రభుత్వం ఆర్‌బీకే కేం ద్రాలను ఎందుకోసం ఏర్పాటు చేసిందో అర్థం కావడం లేదు. హార్టికల్చర్‌ అసిస్టెంట్లు  పొలాలను సందర్శించిన దాఖలాలు లేవు.

Updated Date - 2021-07-30T06:23:50+05:30 IST