భరత్‌ అద్భుతం..

ABN , First Publish Date - 2021-10-09T06:39:35+05:30 IST

ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్‌ రసవత్తరంగా ముగిసింది. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా పేసర్‌ అవేశ్‌ ఐదు బంతుల్లో 9 పరుగులే ఇచ్చాడు.

భరత్‌ అద్భుతం..

చివరి బంతికి సిక్సర్‌తో ఆర్‌సీబీ విజయం 

టాప్‌లోనే ఢిల్లీ

దుబాయ్‌: ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్‌ రసవత్తరంగా ముగిసింది. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా పేసర్‌ అవేశ్‌ ఐదు బంతుల్లో 9 పరుగులే ఇచ్చాడు. దీంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయమనే అంతా భావించారు. కానీ తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ (52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 నాటౌట్‌) చివరి బంతిని సిక్సర్‌గా బాది కోహ్లీ సేనలో జోష్‌ నింపాడు.  శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. పృథ్వీ షా (48), ధవన్‌ (43) రాణించారు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. మ్యాక్స్‌వెల్‌ (51 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించాడు. నోకియాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా భరత్‌ నిలిచాడు. 


ఉత్కంఠ ముగింపు:

ఛేదనలో ఆర్‌సీబీ ఆరు పరుగులకే దేవ్‌దత్‌ (0), కోహ్లీ (4) వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో జట్టును ఆదుకునే బాధ్యత భరత్‌ తీసుకున్నాడు. చివరి వరకు ఎదురుదాడే లక్ష్యంగా అద్భుత షాట్లతో విరుచుకుపడ్డాడు. డివిల్లీర్స్‌ (26)తో కలిసి మూడో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. పదో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ ఏబీని అవుట్‌ చేశాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్‌ 14వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా.. రెండు క్యాచ్‌లను కూడా ఫీల్డర్లు వదిలేశారు. అటు 37 బంతుల్లో భరత్‌ తొలి ఐపీఎల్‌ ఫిఫ్టీని సాధించాడు. అయితే ఈ దశలో చేయాల్సిన రన్‌రేట్‌ 11కి పెరగడంతో 17వ ఓవర్‌లో మ్యాక్స్‌ 4, భరత్‌ 6తో గేరు మార్చారు. 18వ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో సమీకరణం 12 బాల్స్‌ 19 రన్స్‌కు చేరింది. కానీ 19వ ఓవర్‌లో నోకియా నాలుగు పరుగులే ఇచ్చి ఉత్కంఠ పెంచాడు. ఇక చివరి ఓవర్‌లో 15 రన్స్‌ కావాల్సి ఉండగా అవేశ్‌ ఖాన్‌ తొలి ఐదు బంతుల్లో 9 రన్స్‌ ఇచ్చి కట్టడి చేశాడు. కానీ అనూహ్యంగా చివరి బంతి వైడ్‌గా వెళ్లడం.. మరో బంతిని భరత్‌ సిక్సర్‌గా మలచడంతో కోహ్లీ సేన సంబరాల్లో మునిగిపోయింది.


ఓపెనర్ల వేగం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి పది ఓవర్లలో దూసుకెళ్లింది. అయితే మిడిలార్డర్‌ పరుగులు తీసేందుకు ఇబ్బంది పడింది. ఆరంభంలో ఓపెనర్లు ధవన్‌, పృథ్వీ షా వరుస ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో స్కోరు 55కి చేరింది. ఈ దశలో చెరో సిక్సర్‌తో మరింత ఊపు మీద కనిపించారు. కానీ పుంజుకున్న ఆర్‌సీబీ బౌలర్లు ఈ ఇద్దరితో పాటు కెప్టెన్‌ పంత్‌ (10)ను కూడా వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత శ్రేయాస్‌ (18), హెట్‌మయెర్‌ ఆచితూచి ఆడడంతో మధ్య ఓవర్లలో ఆశించిన మేర పరుగులు రాలేదు. 18వ ఓవర్‌లో శ్రేయాస్‌ అవుట్‌ కాగా ఇన్నింగ్స్‌ చివరి బంతికి హెట్‌మయెర్‌ వెనుదిరిగాడు.


 స్కోరుబోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) గార్టన్‌ (బి) చాహల్‌ 48; ధవన్‌ (సి) క్రిస్టియన్‌ (బి) హర్షల్‌ 43; పంత్‌ (సి) భరత్‌ (బి) క్రిస్టియన్‌ 10; శ్రేయాస్‌ (సి) క్రిస్టియన్‌ (బి) సిరాజ్‌ 18; హెట్‌మయెర్‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 29; రిపల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 164/5; వికెట్ల పతనం: 1-88, 2-101, 3-108, 4-143, 5-164; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 3-0-29-0; సిరాజ్‌ 4-0-25-2; గార్టన్‌ 3-0-20-0; చాహల్‌ 4-0-34-1; హర్షల్‌ 4-0-34-1; క్రిస్టియన్‌ 2-0-19-1.


బెంగళూరు: కోహ్లీ (సి) రబాడ (బి) నోకియా 4; పడిక్కళ్‌ (సి) అశ్విన్‌ (బి) నోకియా 0; శ్రీకర్‌ భరత్‌ (నాటౌట్‌) 78; డివిల్లీర్స్‌ (సి) అయ్యర్‌ (బి) అక్షర్‌ 26; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 51; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 166/3; వికెట్ల పతనం: 1-3, 2-6, 3-55; బౌలింగ్‌: నోకియా 4-0-24-2; అవేశ్‌ ఖాన్‌ 4-0-31-0; అక్షర్‌ పటేల్‌ 4-0-39-1; రబాడ 4-0-37-0; అశ్విన్‌ 1-0-11-0; రిపల్‌ 3-0-22-0. 

Updated Date - 2021-10-09T06:39:35+05:30 IST