మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ వీరబాదుడు.. కోల్‌కతా ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-18T22:55:48+05:30 IST

కోహ్లీ మరోమారు విఫలమయ్యాడు. 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది

మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ వీరబాదుడు.. కోల్‌కతా ఎదుట భారీ లక్ష్యం

చెన్నై: కోహ్లీ మరోమారు విఫలమయ్యాడు. 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. అయినప్పటికీ తొలుత మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత డివిలియర్స్ మెరుపు ఇన్సింగ్స్‌తో కోహ్లీ సేన పటిష్ఠ స్థితికి చేరుకుంది. ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచి సవాలు విసిరింది. 


ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.


రెండో ఓవర్ రెండో బంతికే కెప్టెన్ కోహ్లీ (5) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి రజత్ పటీదార్ (1) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తొలుత వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించాడు.


క్రీజులో కుదురుకున్నాక ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 3  సిక్సర్లతో 78 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో హర్భజన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 


ఆ తర్వాత క్రీజులో ఉన్న డివిలియర్స్ చెలరేగిపోయాడు. కైల్ జెమీసన్ (11)‌ అండగా రెచ్చిపోయాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకోగా, పాట్ కమిన్స్, ప్రసీద్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2021-04-18T22:55:48+05:30 IST