Abn logo
Sep 26 2021 @ 23:34PM

బెంగళూరు ఎట్టకేలకు.. ముంబై చిత్తు

దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. ముంబైని చిత్తుగా ఓడించి అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఓ హ్యాట్రిక్‌తో పాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్‌కు తోడు స్పిన్నర్ చాహల్ 4 ఓవర్లలో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 2.75 ఎకానమీతో 3 వికెట్లు తీసి బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. అలాగే ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఛేజింగ్‌లో ముంబైకి రోహిత్ శర్మ(43: 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) క్వింటన్ డీకాక్(24: 23 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. 

ఓపెనింగ్ బాగున్నా వీరిద్దరూ అవుటైన తర్వాత ముంబై చతికిలపడింది. ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో 18.1 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ముంబై ఆలౌటైంది. దీంతో ఏకంగా 54 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో అర్థ సెంచరీతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాణించిన మ్యాక్స్‌వెల్(56: 37 బంతుల్లో, 2/23)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కాగా.. ఈ ఓటమితో సెకండ్ షెడ్యూల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ముంబై ఓడినట్లైంది. అయితే బెంగళూరు మాత్రం తొలి రెండు మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శనతో ఓడినా.. మూడో మ్యాచ్‌లో సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 10 మ్యాచ్‌లలో 6 విజయం సాధించి 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. అయితే రన్ రేట్ విషయంలో మాత్రం ఆర్సీబీ పరిస్థితి కొంత ఆందోళన కరంగానే ఉంది. -0.359 రన్‌రేట్‌తో కేకేఆర్(+0.322), పంజాబ్(-0.271) కంటే వెనకపడి ఉంది.