Abn logo
Sep 21 2021 @ 01:09AM

గుట్టను కాజేశారు

యంత్రాలతో చదును చేసి, స్వాధీనం 

ఆరు ప్లాట్లుగా విభజించి, నిర్మాణాలు 

ముఖ్యనేత సమీప బంధువులే కబ్జాదారులు

ఆర్డీఓ స్థాయి అధికారికి ముడుపులతో సర్దుబాటు?

హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న విలువైన భూమి 

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

రాయదుర్గం, సెప్టెంబరు 20

విలువైన ప్రభుత్వ భూమిపై కొందరు అధికార పార్టీకి చెందిన వారు కన్నేశారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్టను కాజేశారు. అక్కడున్న చిన్నపాటి గుట్టను తొలగించి, చదును చేసే పనులను ప్రారంభించారు. క్రమేపీ కొద్ది కొద్దిగా చేస్తూనే ఒక్కసారిగా ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆ భూమిలో యంత్రాలను పెట్టి చకచకా పనులు చేసి, విలువైన ప్లాట్లుగా తీర్చిదిద్దారు. అందులో నిర్మాణాలను ప్రారంభించి, వేగవంతం చేశారు. రూ.అరకోటి విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా అధికారులు మాత్రం నోరుమెదపట్లేదు. ఆర్డీఓ స్థాయి అధికారి ఒకరు ముడుపులతో సర్దుబాటు చేసుకోవడంతోనే అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసి, ఏకంగా నిర్మాణాలే మొదలుపెట్టారు. ముఖ్యనేతకు సమీప బంధువులు కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలియవచ్చింది. కబ్జాలతో విలువైన ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అవసరాలకు స్థలాలు అవసరమైతే అధికారులు మాత్రం కోట్ల రూపాయలు చెల్లించి, కొనుగోలు చేసే పరిస్థితి. కబ్జా అవుతున్న స్థలాలను మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, ముడుపులకు ఆశపడి అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.


హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని...

రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డు నుంచి బళ్లారి రోడ్డుకు నిర్మించే ప్రతిపాదనలో ఉన్న హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఏయే సర్వే నెంబర్లలో స్థలాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందనే వివరాలు ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే సేకరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉండే భూములకు డిమాండ్‌ వస్తుందని కబ్జాదారులు అంచనా వేశారు. 497/98/99 సర్వే నెంబర్ల భూములు పూర్తిగా అసైన్డ్‌తోపాటు ప్రభుత్వానికి చెందినవి. హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు కూడా చేస్తున్నారు. మిగిలివున్న గుట్ట, కొండ ప్రాంత భూమిపై కొందరు కన్నేశారు. కబ్జాకు ఉపక్రమించారు. అందులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా మట్టి అవసరమని చెప్పి, గుట్టను చదును చేయడం మొదలుపెట్టారు. క్రమేపీ ఆ భూమిపై పట్టు సాధిస్తూ ముఖ్యనేతకు సమీప బంధువులైన నలుగురు ఏకంగా కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో బేస్‌మట్టం వరకు పూర్తి చేశారు. అనంతరం ఆనుకుని ఉన్న మిగులు భూమిలో యంత్రాలను పెట్టి, చదును చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తగ్గట్టు ఆరు ప్లాట్లను సిద్ధం చేశారు. వాటిలో కూడా నిర్మాణాలు చేసేందుకు పునాదులు తవ్వేశారు.


అధికారులకు తెలిసినా...

ముఖ్యనేతకు సమీప బంధువులతోపాటు ప్రధాన అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు అయ్యే వరకు అటువైపు వెళ్లకుండా కొద్దిరోజుల అనంతరం కబ్జా చేసుకున్న స్థలాలకు పొజిషన్‌ సర్టిఫికెట్లను ఇచ్చి, క్రమబద్దీకరించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను కొంతవరకు ముడుపులను కూడా చెల్లించేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. హాఫ్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని నిత్యం జనసంచారం ఉండే ప్రాంతమైనప్పటికీ అధికారులకు తెలియనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ యంత్రాంగంలో కొందరు లోపాయికారీగా పూర్తి సహకారం అందించి, నిర్మాణాలు చేపట్టేందుకు వారిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అధికారులకు విలువైన భూమి కబ్జా అవుతుందనే విషయం తెలిసినా రెవెన్యూ శాఖలోని ఆర్డీఓ స్థాయి ఉన్నతాధికారి ఒకరు అండగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే యంత్రాంగం ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా పట్టించుకోకుండా వున్నట్లు తెలిసింది. తాత్కాలికంగా నిర్మాణాలు నిలిపివేసినా కొన్నిరోజుల అనంతరం వాటిని క్రమబద్ధీకరించి, ముఖ్యనేత సమీప బంధువుల చేతిలో పెట్టేందుకు అడుగులు పడుతున్నట్లు తెలియవచ్చింది. కబ్జా అవుతున్న స్థలం గురించి రెవెన్యూ, మున్సిపల్‌ యంత్రాంగంలో తీవ్ర చర్చ సాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం తెలియనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం.


ముడుపులతో సర్దుబాటు

విలువైన భూమి కావడంతో కబ్జాదారులు 

ఎలాగైనా చేజిక్కించుకోవాలనే వ్యూహంతో ముడుపులను ఎరవేసి, కొందరు అధికారులను సర్దుబాటు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు ఆ భూమి జోలికెళ్లకుండా ముడుపులు తీసుకుని, మౌనం వహిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు తెలిసినా 

వీళ్ల జోలికి వెళితే బదిలీలు చేయిస్తారనే భయంతో ఉన్నట్లు సమాచారం.


భూకబ్జాలను ప్రోత్సహించేది లేదు

ముడుపులు తీసుకుని, భూకబ్జాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. పట్టణంలోని 497/98/ 99 సర్వే నెంబర్లలో భూకబ్జా అంశం నా దృష్టికి రాలేదు. రాయదుర్గం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ బాలకిషన్‌ను క్షేత్రస్థాయిలో విచారించి, చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తా. వాస్తవాలు నిగ్గుతేల్చి, కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కబ్జాదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.

నిశాంత్‌ రెడ్డి, ఆర్డీఓ, కళ్యాణదుర్గం