రీ డిజైన్‌ చేయాల్సిందే!

ABN , First Publish Date - 2020-10-20T09:21:04+05:30 IST

ఇప్పుడు హైటెక్‌ సిటీ అంటున్నాం కానీ.. ఒకప్పుడు హైదరాబాద్‌ లేక్‌ సిటీ! అంటే చెరువులతో కూడిన నగరం! నిజాం నవాబుల కాలంలోనే ...

రీ డిజైన్‌ చేయాల్సిందే!

  • పట్టణ ప్రణాళికల్లో మార్పులు చేయాల్సిందే
  • భాగ్యనగర భవిష్యత్తుకు ఇదే మార్గం
  • చెర పట్టిన చెరువులకు విముక్తి కల్పించాలి
  • నాలాలపై కబ్జాలను తొలగించాల్సిందేh
  • వరద నీటి పారుదల వ్యవస్థ తక్షణావసరం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇప్పుడు హైటెక్‌ సిటీ అంటున్నాం కానీ.. ఒకప్పుడు హైదరాబాద్‌ లేక్‌ సిటీ! అంటే చెరువులతో కూడిన నగరం! నిజాం నవాబుల కాలంలోనే గొలుసుకట్టు చెరువులను తీర్చిదిద్దారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తించిన చెరువులే 185 వరకూ ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో రూపొందించిన హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ఏకంగా 3200కుపైగా చెరువులు ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌ కేంద్రమైన నాంపల్లి నుంచి 45-50 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు వానలు, వరదలు వస్తే నగరం మొత్తం అతలాకుతలం కావడానికి కారణం ఇదే! 400 ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం భవిష్యత్తు భద్రంగా ఉండాలన్నా, హైటెక్‌ సిటీగా మారిన హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినకుండా ఉండాలన్నా మహానగర పునర్నిర్మాణానికి ప్రణాళికలు రచించాలని పట్టణ ప్రణాళిక నిపుణులు సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రణాళిక మెరుగ్గా లేకపోవడంతోనే నగరం అతలాకుతలమైందంటున్నారు.


గొలుసుకట్టు చెరువుల నీళ్లు మూసీలోకి..

హైదరాబాద్‌కు సునామీలు, తుఫానుల ప్రభావాలు ఉండవని ఇన్నేళ్లుగా ధీమాగా ఉన్నారు. కానీ, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏదో ఒక రూపంలో నగరానికి ముప్పు తప్పదనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తీవ్రతను గుర్తించి వేల కోట్లు వెచ్చించి ఫ్లై ఓవర్లు అండర్‌పా్‌సలు నిర్మిస్తున్న ప్రభుత్వం.. అదే స్థాయిలో హైదరాబాద్‌ మధ్య నుంచి పారుతున్న మూసీ నది విషయంలో నిర్లక్ష్యం చూపింది. మూసీని ప్రధాన కేంద్రంగా చేసుకుని నగరం చుట్టూ ఉన్న చెరువులు నిండిన తర్వాత వరద నీరంతా మూసీకి వెళ్లేలా గొలుసుకట్టు కాల్వలు నిర్మించాల్సి ఉంది. కానీ, నిజాం కాలంలో నిర్మించిన నాలాలే కబ్జాకు గురి కావడంతో వరద నీరు వెళ్లే మార్గం లేకుండాపోయింది.


డ్రెయినేజీతోపాటు వరద నీటి కాల్వలు కీలకం

పట్టణాల్లో మురుగునీటి పారుదలతోపాటు వరద నీటి పారుదల చాలా కీలకం. హైదరాబాద్‌లో వందలాది చెరువులున్నాయి. భారీ వర్షాలకు అవి నిండి, అలుగుపారితే, ఆ వరద నీరంతా సాఫీగా దిగువన ఉన్న మూసీలోకి వెళ్లేలా వరద నీటి పారుదల కోసం పైపులైన్ల వ్యవస్థను నిర్మించాలి. నాలాల ఆధునీకరణ కచ్చితంగా జరగాలి. చెరువు కట్టలను బలం గా నిర్మించి అవి తెగకుండా ఏర్పాట్లు చేసి, నిండిన తర్వాత కిందకి వె ళ్లేలా పైపులైన్లను నిర్మించాలి.

- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌


మాస్టర్‌ ప్లాన్‌లో చూపినట్లు పరిరక్షణ లేదు 

హైదరాబాద్‌కు సంబంధించి 2008లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో చెరువుల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంది. వాటిని పరిరక్షించాలని సూచించాం. అమల్లోకి వచ్చిన హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయి. నగరంలో ప్రస్తుత పరిస్థితికి కారణం ఇదే.

- ఎస్‌.విశ్వనాథ్‌, హెచ్‌ఎండీఏ,  మాస్టర్‌ ప్లాన్‌ నిపుణులు


పట్టణ ప్రణాళిక నిపుణులు ఏరీ!?

నగరానికి సరిపోయేలా పట్టణ ప్రణాళికలు రూపొందించే అర్బన్‌ డిజైనర్స్‌ మన దగ్గర లేరు. కేవలం అర్బన్‌ ప్లానర్స్‌ మాత్రమే ఉన్నారు. ఇక్కడి నేల, దాని స్వభావం, ఇతర వనరులను పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పట్టణాల డిజైనింగ్‌ జరగాలి. అప్పుడే వాటికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే హైదరాబాద్‌లో లోపించింది. ఇప్పటికైనా పట్టణ ప్రణాళిక విషయంలో ప్రభుత్వం పునరాలోచించి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.

- సాయికృష్ణ సంఘ,  ఆర్కిటెక్ట్‌, విజిటింగ్‌ ప్రొఫెసర్‌

Updated Date - 2020-10-20T09:21:04+05:30 IST