కాపవరంలో గ్రావెల్‌ తవ్వకాలపై నేటి నుంచి రీ సర్వే

ABN , First Publish Date - 2021-05-18T06:51:54+05:30 IST

బిక్కవోలు మండలం కాపవరంలో నాగార్జున ఫిర్టిలైజర్స్‌కు చెందిన సుమారు 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరిగిందని, అంతే కాకుండా వేలాది చెట్లను అనుమతి లేకుండా నరికి కలపను మాయం చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన దాఖలు చేశారు.

కాపవరంలో గ్రావెల్‌ తవ్వకాలపై నేటి నుంచి రీ సర్వే

పిటిషనర్‌ అభ్యర్ధన మేరకు విచారణ అధికారుల మార్పు

అనపర్తి, మే 17: బిక్కవోలు మండలం కాపవరంలో నాగార్జున ఫిర్టిలైజర్స్‌కు చెందిన సుమారు 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరిగిందని, అంతే కాకుండా వేలాది చెట్లను అనుమతి లేకుండా నరికి కలపను మాయం చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు తవ్వకాలపై సర్వే నిర్వహించి నివేదిక సమర్పించారు. ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయని, తిరిగి సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ సమక్షంలో విచారణ జరగాలని కూడా ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని విజిలెన్స అధికారులు పిటిషనర్‌ రామకృష్ణారెడ్డికి నోటీసులు కూడా అందజేశారు. ఈ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందని తాను ఫిర్యాదు చేస్తే చేస్తే పట్టించుకోని అధికారులే ఇక్కడ సర్వే నిర్వహించడంపై పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజిలెన్స, ఎనఫోర్స్‌మెంట్‌ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో మరో బృందంతో విచారణ నిర్వహిస్తామని, విచారణకు హాజరు కావాలని కోరారు. దీంతో మంగళవారం నుంచి విజిలెన్స అధికారులు పిటిషనర్‌ రామకృష్ణారెడ్డి సమక్షంలో విచారణ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే రంగంపేట మండలం దొంతమూరులో సుమారు రూ.6.50 కోట్ల విలువైన గ్రావెల్‌ తరలించినట్టు అధికారులు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.  దీనిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు కాపవరంలో రీ సర్వేకు కోర్టు ఆదేశించడంతో ఇక్కడ ఏ మేర అక్రమాలు బయటపడతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

గతంలో కాపవరంలో గ్రావెల్‌ అక్రమాలను  పరిశీలించేం దుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆ గ్రామంలో సత్యంశెట్టి వెంకటరమణ మరో 50మందితో కలిసి తన కారును  అడ్డగించి దాడికి యత్నం చేశారని రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు తాను హాజరు కావలసి ఉందని, ఇప్పుడు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... తగిన చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అనపర్తి సీఐ భాస్కరరావు, అనపర్తి, బిక్కవోలు ఎస్‌ఐలు ఉమామహేశ్వరరావు, వాసులకు ఆయన లేఖలు రాశారు. 


Updated Date - 2021-05-18T06:51:54+05:30 IST