లక్ష్యాన్ని చేరుకునేనా?

ABN , First Publish Date - 2021-12-02T06:13:15+05:30 IST

ఓవైపు కమ్ముకొస్తున్న కారుమబ్బులు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో ఆంతర్యం.

లక్ష్యాన్ని చేరుకునేనా?
భువనగిరిలోని ధాన్యం కొనుగోలుకేంద్రంలో కొనసాగుతున్న విక్రయాలు

 సేకరించాల్సింది నాలుగులక్షల మెట్రిక్‌ టన్నులు

 సేకరించింది 81,916 మెట్రిక్‌ టన్నులు మాత్రమే 

 కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి

 క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశం

 కొనుగోళ్లు ఆలస్యం కావడంతో కమీషన్‌ ఏజెంట్లను ఆశ్రయిస్తున్న రైతులు


ఓవైపు కమ్ముకొస్తున్న కారుమబ్బులు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో ఆంతర్యం. వెరసి రైతన్నల కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విక్రయిద్దామంటే కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు పేచీ పెడుతున్నారు. కాదని దళారులకు అమ్ముకుందామంటే క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోవాల్సి వస్తోంది. అయినా సరే వర్షం వస్తే తడిసిపోయి, అసలుకే ఎసరొస్తుందన్న ఆందోళనతో రైతులు ఇప్పటివరకు 40వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దళారులు, కమీషన్‌ ఏజెంట్లకు విక్రయించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభంకాగా, కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇక కొంత సమయమే మిగిలి ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేనా ? అని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తంచేస్తోంది.


యాదాద్రి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు, విపక్షాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొనుగోలుకేంద్రాలు ప్రారంభంకావడంతో కోతలుకోసి రైతులు ధాన్యాన్ని కల్లాలు, సేకరణ కేంద్రాల వద్ద రాశులు పోసుకున్నారు. అయితే జిల్లాయంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం సేకరణ ప్రక్రియను ఆలస్యంగా చేపట్టింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోవడంతో మొలకెత్తింది. రైతులు ఏ, బీగ్రేడ్‌ మద్దతు కోల్పోయి తీవ్రంగా నష్టాలపాలయ్యారు. అయితే మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాటపట్టారు. ఈనేపథ్యంలో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మూడురోజులక్రితం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ధాన్యం సేకరణను పరిశీలించి, వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్‌ శాఖల అధికారులతోపాటు రైస్‌మిల్లర్లతో సమావేశాలు నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లపై నిత్యం క్షేత్రస్థాయికి వెళ్లి సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేసింది. ధాన్యం కొనుగోలు వేగవంతంచేయాలని, ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మొత్తం 2.60లక్షలఎకరాల్లో వరిని సాగుచేశారు. 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని, దాదాపు నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నాలుగైదు రోజులుగా కొనుగోళ్లు వేగవంతంచేశారు. 


 కమీషన్‌ ఏజెంట్లను ఆశ్రయిస్తున్న రైతులు

వాతావరణంలో మార్పులు, తుఫాను కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం తడిస్తే కొనుగోలు చేసేందుకు కేంద్రాల్లో నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షానికి ధాన్యం తడవకముందే విక్రయించాలని కమీషన్‌ ఏజెంట్లు, దళారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో దాదాపు 45,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభు త్వం ఏ-గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాకు రూ.1960, బీ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1940 మద్దతు ధర ఇస్తుంది. అయితే కమీషన్‌ ఏజెంట్లు, దళారులు రైతుల వద్ద క్వింటాకు రూ.1300నుంచి రూ.1400 వరకు కొనుగోలు చేశారు. దీంతో రైతు లు క్వింటా ధాన్యానికి దాదాపు రూ.400నుంచి రూ.500వరకు నష్టపోయా రు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం కానిపక్షంలో మరింత మంది రైతులు కూడా కమీషన్‌ ఏజెంట్లను ఆశ్రయించే  అవకాశం ఉంది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే ఆరుగాలం శ్రమించిన రైతాంగం మద్దతు ధరను కోల్పోయామని వాపోతున్నారు.


జిల్లాలో 279 కొనుగోలు కేంద్రాలు 

జిల్లాలో మొత్తం ధాన్యం సేకరణకు 279 కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 184,ఐకేపీ91, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 9,847 మంది రైతుల వద్ద జిల్లావ్యాప్తంగా 81,916.520 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యాన్ని 73,884.520 మె ట్రిక్‌ టన్నుల వరకు రైస్‌ మిల్లులకు తరలించారు. ఇంకా 8032.10 మెట్రిక్‌ టన్నుల వరకు మిల్లలకు తరలించాల్సి ఉంది. వాతావర ణం సహకరించిన పక్షంలో వారంరోజుల్లోగా మరో లక్ష మెట్రిక్‌ టన్నులపైగా ధాన్యం సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. 


కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు చర్యలు : గోపీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌  

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మొత్తం 279 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అన్ని కేంద్రాల్లోనూ ధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 81,916 మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశాం. వారం రోజుల్లోగా మరో 50 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా సేకరించనున్నాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలిస్తున్నాం. 

Updated Date - 2021-12-02T06:13:15+05:30 IST