స్వీయఅధ్యయనమేరేపటి చదువు

ABN , First Publish Date - 2020-09-29T06:18:02+05:30 IST

కరోనా సంక్షోభం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను విద్యాసంస్థలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నత విద్యనందిస్తున్నాయి...

స్వీయఅధ్యయనమేరేపటి చదువు

21వ శతాబ్దంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, అధ్యాపకులపైనో ఆధారపడకూడదు. ఎవరు స్వయంశిక్షణ  పొందుతారో వాళ్లకే నిజమైన భవిష్యత్తు ఉంటుంది. నేటి డిజిటల్‌ యుగంలో ఈ రోజు ఉన్నవి రేపు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. అనుక్షణం కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదానికి కళాశాలకు వెళ్లి నేర్చుకుంటామంటే కుదిరే పని కాదు. ఎప్పటికప్పుడు అంతర్జాలంలోకి వెళ్లి నేర్చుకునేందుకు అలవాటుపడాలి.


కరోనా సంక్షోభం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను విద్యాసంస్థలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నత విద్యనందిస్తున్నాయి. కరోనా విపత్తు వల్ల ఈ ప్రక్రియను ఎక్కువగా అనుసరిస్తున్నప్పటికీ భవిష్యత్తులో కూడా అది తప్పకుండా కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ సడలించినా ఈ విద్యాసంవత్సరంలో దాదాపు 50 శాతం విద్యార్థుల్ని స్కూళ్లకు, కాలేజీలకు రొటేషన్‌ పద్ధతిలోనే అనుమతిస్తారు. వారికి సగం సిలబస్‌ను ప్రత్యక్షంగా తరగతి గదుల్లోను, మిగతా సగం పరోక్షంగా ఆన్‌లైన్‌లోను బోధించాల్సిందే. ఈ విధానం భవిష్యత్తులో బోధన పద్ధతుల్లో సమూల మార్పులకు దారితీస్తుంది.


ఇది డిజిటల్ యుగం. నేటి యువత విద్యనభ్యసించడం కోసం అధ్యాపకులు, విద్యాసంస్థల మీద ఆధారపడకుండా ఎక్కువగాస్వీయ అధ్యయనానికి (సెల్ఫ్‌ లెర్నింగ్‌) అలవాటు పడాలి. ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించడం అనేది విద్యార్థి వ్యక్తిగతంగా నేర్చుకునే స్థాయిపై కూడ ఆధారపడి ఉంటుంది. దానివల్ల ఆన్‌లైన్‌ బోధనా పద్ధతులు భవిష్యత్తులో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్లాసులో 60 మంది విద్యార్థులు ఉంటే, ఎంత ప్రతిభావంతుడైన అధ్యాపకుడు బోధించినా 60 నుంచి 70 శాతం మందికి మాత్రమే పూర్తిగా అర్ధమవుతుంది. మిగతా 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు పాఠం అర్థంకాని పరిస్థితుల్లోనే ఉంటారు. అందువల్ల స్వీయ అధ్యయన పద్ధతిలో వారు పాఠ్యాంశాలను గ్రహించే స్థాయిని బట్టి భవిష్యత్తులో వారికి బోధన జరిపే ఏర్పాట్లు ఉంటాయి. వీటికి తోడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టీచర్స్‌ వచ్చినా కూడ  ఆశ్చర్యం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులకు, స్వీయ అధ్యయనానికి అలవాటు పడటం మంచిది.


ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంటి వాతావరణంలో విద్యార్థికి సహజంగా ఉండే అనేకమైన ఆకర్షణలలో భాగంగా టీవీ, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించే అలవాటు కూడ ఉంటుంది. దీంతో క్లాసులపైన ఎక్కువగా దృష్టి పెట్టి వినడం కుదరకపోవచ్చు. ఆన్‌లైన్‌ క్లాసులను జూమ్‌ యాప్‌ ద్వారానో, గూగుల్‌ యాప్‌ ద్వారానో బోధిస్తే వారికి అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. అంతేకాక తరగతి గదిలో బోధిస్తున్నప్పుడు విద్యార్థికి కలిగే భావన కూడ కలగకపోవచ్చు. వాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులను 10–15 నిమిషాలు మాత్రమే శ్రద్ధగా వినగలరు. ఆ పద్ధతిలో సబ్జెక్టును సోదాహరణంగా వివరించే అవకాశం తక్కువగా ఉంటుంది. ట్రాయ్‌ లెక్కల ప్రకారం మన దేశంలో 62 కోట్ల మంది జనాభా సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ క్వాలిటీ ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అమెరికా వంటి దేశాలలో సగటున 100 మందిలో 60 మంది దగ్గర ల్యాప్‌ట్యాప్‌లు ఉంటే మనదేశంలో 3 శాతం మంది దగ్గర మాత్రమే ఉన్నాయి. గ్రామాలలోని విద్యార్థులకు ఇంటర్నెట్‌ అనుసంధానం చాలా ఇబ్బంది కలిగించే విషయం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ట్యాబ్‌లు, సెల్‌ఫోన్‌లు కొనుక్కోవడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు విద్యార్థులు రోజూ ఫోన్లు, ట్యాబ్‌లు ఎక్కువగా చూడటం వల్ల రేడియేషన్‌తో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాక ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు ఆన్‌లైన్‌లోనే పాఠాలు వినడం వల్ల మెడ పట్టుకోవడం, కళ్లు దెబ్బతినడం, కీళ్ల సమస్యలు వచ్చే ముప్పు ఉంది. వీటన్నింటినీ మించినది– ఆన్‌లైన్‌లో బోధించడం వల్ల విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య భావోద్వేగమైన అనుసంధానం ఉండకపోవడం.


ఆన్‌లైన్‌ క్లాసులు సక్రమంగా జరగాలంటే దేశంలో ముందుగా మౌలిక వసతుల కల్పన జరగాలి. ఇంటర్నెట్‌ సదుపాయం, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనే స్తోమత కొందరు విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. మన దేశంలో బ్రాడ్‌బాండ్‌ కనెక్టివిటీ చాలా తక్కువ. 60 శాతం మంది జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో జ్ఞానాన్ని అందించడమే కాకుండా దానికి సరిపడా ప్రయోగ పద్ధతులు, నమూనాలు చేర్చితేనే ఆ బోధన ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది బోధనా సిబ్బంది ఆన్‌లైన్‌లో కూడా బ్లాక్‌బోర్డు సంప్రదాయ పద్ధతులను వాడుతున్నారు. అధ్యాపకులకు డిజిటల్‌ విధానంలో ఈ–కంటెంట్‌ను తయారుచేయడంలో తర్ఫీదునివ్వాలి. ప్రస్తుతం మన దేశంలో నిషేధించిన పబ్జీ గేమ్‌ను ఆడేందుకు యువత ఎంతగా ఉత్సాహం చూపుతోందో, ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన ఈ–కంటెంట్‌ను చూడటానికి కూడ అంతే ఉత్సాహం ప్రదర్శించే విధంగా టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలి. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. డిజిటల్‌ వీడియోలను రూపొందించడం వల్ల విద్యార్థి ప్రతిరోజు అధ్యాపకుడిని వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం ఉండదు. మల్టీమీడియా రికార్డెడ్‌ ప్రజేంటేషన్స్‌ ద్వారా విద్యార్థికి అనుకూలమైన సమయంలో, కావలసినంత సేపు వీడియోలను చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ మందికి తక్కువ ఖర్చుతో బేసిక్‌ కోర్సులను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా అందించవచ్చు. 


భవిష్యత్తులో ఆన్‌లైన్‌ విద్యావ్యవస్థలో కృత్రిమ మేధ ద్వారా ఇంటరాక్టివ్‌ మెథడ్స్‌ అనేవి కొంతవరకు భాగం కావచ్చు. అవి తరగతి గది వాతావరణానికి దగ్గరగా ఉండేలా చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరాల ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి విద్యార్థుల కదలికలను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అధ్యాపకుడిలాగానే వారిని అప్రమత్తం చేయడం వంటివి ఈ ప్రక్రియలో ఉంటాయి. వీడియోగేమ్స్‌లో ఎలా స్థాయిలు ఉంటాయో, ఆన్‌లైన్ క్లాసులను సైతం అదేవిధంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలుగా వర్గీకరించి, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి వారికి తగ్గట్టుగా పాఠ్యాంశాలను బోధించడానికి అధ్యాపకులు కృషి చేస్తారు. దీనితోపాటు వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీ ద్వారా కూడా వ్యక్తిగత స్థాయిలో బోధనకు అధ్యాపకులు సహకరిస్తారు. ఇలా  అనేక విధాలుగా కృత్రిమ మేథాబోధకులు విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా భవిష్యత్తులో బోధన జరిపే అవకాశముంది. ఈ ప్రక్రియలో వేగంగా విద్యనభ్యసించే వారికి వేగంగాను, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు నెమ్మదిగాను బోధించే అవకాశం ఉంటుంది.


21వ శతాబ్దంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, కళాశాలల్లో ఉండే అధ్యాపకులపైనో ఆధారపడకూడదు. ఎవరు స్వయంశిక్షణ పొందుతారో వాళ్లకే నిజమైన భవిష్యత్తు ఉంటుంది. నేటి డిజిటల్‌ యుగంలో ఈ రోజు ఉన్నవి రేపు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. క్షణక్షణం విషయం మారిపోవటం, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదానికి కళాశాలకు వెళ్లే నేర్చుకుంటామంటే ఇక కుదిరే పని కాదు. విద్యార్థులు ఎప్పటికప్పుడు అంతర్జాలంలోకి వెళ్లి నేర్చుకునేందుకు అలవాటుపడాలి. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పాఠ్యాంశాలు పూర్తిగా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు స్వయం ఆన్‌లైన్, యూజీ పీజీ మూక్స్, ఈపీజీ పాఠశాల, ఈ కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్, స్వయంప్రభ వంటి బోధనాపరమైన వెబ్‌సైట్లలో వివిధ రకాల కోర్సులతోపాటు పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే ఎన్నో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) ద్వారా ఇంట్లోనే కూర్చుని ప్రఖ్యాత యూనివర్సిటీ ప్రొఫెసర్ల పాఠాలు వినవచ్చు. మనకు నచ్చిన, భవిష్యత్తుకు ఉపయోగపడే స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా పూర్తిచేయొచ్చు.


అయితే కొంతమందికి దీనిపై ఒక సందేహం కలగవచ్చు. ఆన్‌లైన్‌ క్లాసులు పూర్తిగా సఫలీకృతమై కృత్రిమ మేథాబోధకులు వస్తే ఇప్పుడున్న అధ్యాపకులు, విద్యాసంస్థలు ఏమవుతాయని? దీనికి సమాధానం– విద్యా సంస్థల ప్రాధాన్యం సదా మరింతగా పెరుగుతూనే ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా చాలా వరకు బోధన జరిగినప్పటికీ విద్యార్థి పూర్తి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే ఇంకా చాలా ముఖ్యమైన అంశాలు దానికి తోడు కావల్సిందే. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలు, సామాజిక దృక్పథం అనేవి క్యాంపస్‌లోనే సాధ్యపడతాయి, అలవడతాయి. ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం వలనో, చూడటం వలనో అవి అలవడవు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య సంబంధాలు ప్రత్యక్షంగా ఉంటేనే విద్యార్థిలో పరిపక్వత పెరుగుతుంది. జీవితంలో వృత్తిగతంగా, సామాజికంగా ఎదగాలన్నా, సంతోషమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలన్నా క్యాంపస్‌ జీవితం అనేది ముఖ్యమే అవుతుంది. 


ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా ఈ–కంటెంట్‌ను అందించే విధానాన్ని విద్యార్థులు ఆమోదిస్తున్నారు. అయితే క్యాంపస్‌ విద్యావిధానం కావాలా లేక ఆన్‌లైన్‌ విద్యావిధానం కావాలా అని ప్రశ్నిస్తే నూటికి తొంభై శాతం మంది క్యాంపస్‌ విద్యావిధానానికే మొగ్గుచూపుతారు. కానీ కరోనా విపత్తు నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి, దూసుకుపోతున్న ప్రపంచ వేగాన్ని అందుకోవడానికి ఆన్‌లైన్‌ తరగతులు, స్వీయ అధ్యయనం చాలా అవసరం. ఆన్‌లైన్‌ విద్యా విధానం అనేది క్యాంపస్‌ విద్యావిధానానికి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదనేది వాస్తవమే అయినా భవిష్యత్తులో దాని పాత్ర మరింత పెరుగుతుందనటం నిస్సందేహం.

డాక్టర్‌ లావు రత్తయ్య

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌

Updated Date - 2020-09-29T06:18:02+05:30 IST