మిజోరాంతో శాంతి సాధన కోసం అరెస్టుకైనా సిద్ధమే

ABN , First Publish Date - 2021-08-02T07:39:18+05:30 IST

మిజోరం, అసోం మధ్య శాంతి నెలకొంటుందంటే తాను అరె స్టు కావడానికైనా సిద్ధమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.

మిజోరాంతో శాంతి సాధన కోసం అరెస్టుకైనా సిద్ధమే

అసోం సీఎం హిమంత

న్యూఢిల్లీ/ఐజ్వాల్‌/గువాహటి, ఆగస్టు1: మిజోరం, అసోం మధ్య శాంతి నెలకొంటుందంటే తాను అరె స్టు కావడానికైనా సిద్ధమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. తనపై మిజో పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసులు పెట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. చర్చలు మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తాయన్నారు. ‘‘పో లీసులు నాకు సమన్లు జారీ చేస్తే పాదయాత్రగా వెళ్లి దర్యాప్తునకు సహకరిస్తా. వాళ్లు నన్ను అరెస్టు చేస్తే, దానివల్ల పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందం టే దానికి కూడా సిద్ధమే. గువాహటి హైకోర్టు నుంచి బెయిల్‌ కూడా కోరను’’ అన్నారు. అలాగే.. మిజోరం పోలీసులు కేసు నమోదు చేసిన అసోంకు చెందిన ఆరుగురు పోలీసు అధికారులనూ కాపాడుకుంటానని, అసోం ఘటనపై మిజోరం పోలీసుల దర్యాప్తును అంగీకరించబోనని తేల్చిచెప్పారు. జూలై 26 సంఘటనపై ఎన్‌ఐఏ లేదా తటస్థ కేంద్ర సంస్థతో దర్యాప్తు జరపాలన్నారు. మరోవైపు ఉభయ రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, జోరాంథంగాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం ఫోన్‌లో చర్చలు జరిపారు. సంప్రదింపుల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించామని జోరాంథంగా తెలిపారు. సోషల్‌ మీడియాలో అనవసర మెసేజ్‌లు పెట్టి ఉద్రిక్తతలను రెచ్చగొట్టొద్దని మిజోరం ప్రజలకు పిలుపిచ్చారు. చర్చల ద్వారానే పరిష్కారం కనుక్కోవాలన్నారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. 


శాశ్వత పరిష్కారం దిశగా..

ఈశాన్య రాష్ట్రాల మధ్య ఘర్షణలకు ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. శాటిటైట్‌ ఇమేజింగ్‌ ద్వారా బోర్డర్లను గుర్తించనుంది. శాటిలైట్‌ ఇమేజింగ్‌తో కేంద్రం ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. కేంద్ర అంతరిక్ష విభాగం, ఈశాన్య భారత మండలి కలిసి ఉమ్మడిగా నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (నెసాక్‌)ను ఏర్పాటు చేశాయి. దీని ద్వారా సమర్థంగా వరద నిర్వహణ చేపడుతున్నారు.  

Updated Date - 2021-08-02T07:39:18+05:30 IST