సంగ్రామానికి సై!

ABN , First Publish Date - 2021-01-26T06:31:26+05:30 IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, తదనంతరం రాష్ట్రప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరిస్తుండటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

సంగ్రామానికి సై!

అధిష్ఠానం నిర్ణయంతో వైసీపీ నాయకుల ఉరుకులు పరుగులు 

అధికారంపై నమ్మకమే దిక్కు

పలుచోట్ల అంతర్గత కలహాలే సమస్య 

ఎస్‌ఈసీపై టీడీపీ శ్రేణుల ఆశ 

ముందుకొస్తున్న యువతరం 

గ్రామాల్లో జోరుగా చర్చలు


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, తదనంతరం రాష్ట్రప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరిస్తుండటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తదనుగుణంగా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒంగోలు డివిజన్‌లోని 20 మండలాల్లో గల పంచాయతీలకు నోటిఫికేషన్‌ విడుదలవుతోంది. దీంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగిపోయింది. ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటం, వారికి సహకరిస్తామని ఉద్యోగసంఘాల నాయకులు ప్రకటించటంతో ఎన్నికలు జరగవన్న నమ్మకంతో ఉన్న అధికారపార్టీ నేతలు, శ్రేణులు కూడా తాజా పరిణామాలతో ఒక్కసారిగా కదలటంతో వాతావరణం వేడెక్కింది.


వెంటనే రంగంలోకి దిగాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశం 

 సుప్రీంకోర్టు నిర్ణయం సోమవారం మధ్యాహ్నం  వెలువడింది, సాయంత్రానికి ప్రభుత్వ ప్రజాసంబంధాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు సహకరిస్తుందని ప్రకటించారు. అనంతరం కొద్దిసేపటికే వైసీపీ నాయకులకు పార్టీ నుంచి సమాచారం అందింది. పార్టీ పరిశీలకుడు ప్రభాకరరెడ్డి జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ప్రత్యేక సమాచారాన్ని పంపారు. నూటికి నూరుశాతం పంచాయతీల్లో గెలుపు ద్వారా వైసీపీ సత్తాచాటాలని, ప్రభుత్వ గౌరవాన్ని నిలపాలని సూచిస్తూ అందుకనుగుణంగా వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. అయితే జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఎన్నికల సమరానికి సన్నద్ధమై ఉండగా ఎన్నికలు జరగవన్న భావనతో కొందరు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండగా మరికొందరు అసలు నియోజకవర్గాలకు దూరంగా ఉండిపోయారు. తాజా పరిస్థితితో వారంతా పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే కందుకూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు మహీధరరెడ్డి, నాగార్జునరెడ్డి, అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్‌ కృష్ణచైతన్య ఎన్నికలకు సిద్ధంకావటంలో ముందంజలో ఉన్నారు. గత రెండు, మూడురోజుల నుంచి వారు మండలాలవారీ, గ్రామాల వారీ పరిస్థితిని సమీక్షించుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేపట్టారు. 


ఎన్నికలపై దృష్టి సారించని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు 

కొండపి, పర్చూరు ఇన్‌చార్జ్‌లు డాక్టర్‌ వెంక య్య, రాంబాబులు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అవసరమైన కసరత్తు చేపట్టిన దాఖలాలు లేవు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ రెండురోజులుగా నియోజకవర్గంలో లేరు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు జనసేన కార్యకర్త ఆత్మహత్య సంఘటన, తదనంతర విమర్శలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్‌ మంగళవారం ఉదయానికి నియోజకవర్గానికి చేరుకుంటున్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకరబాబు ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై ఆందోళనలు చేయటం ద్వారా జగన్‌ దృష్టిలో పడాలన్న ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఎన్నికలకు సిద్ధమైన దాఖలాలు లేవు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఇంతవరకు ఎన్నికలపై దృష్టిసారించినట్లు కనిపించటం లేదు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు నియోజకవర్గంలోని నాయకులతో ఫోన్‌లో మాట్లాడటం తప్ప ఇప్పటివరకు ఎన్నికలకు సన్నద్ధం కాలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి వారు ఈ వైపు దృష్టిసారించారు. 


వైసీపీకి కలహాలే సమస్య 

అధికార వైసీపీకి పలు నియోజకవర్గాల్లో వెంటాడుతున్న అంతర్గత కలహాలు, అసంతృప్తులు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. చీరాల, దర్శి నియోజకవర్గాల్లో ప్రధాన నేతల మధ్య సఖ్యత లేదు. పర్చూరు, కనిగిరి, కొండపి, గిద్దలూరులాంటి నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య విభేదాలున్నాయి. చీరాలలో ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ సునీతల మధ్య అంతర్గత పోరు సాగుతోంది. అభ్యర్థుల ఎంపికే ఇక్కడ ప్రధాన సమస్య అయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే కొంత ఫలితం ఉండవచ్చు. దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మద్దతుదారులు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్నిచోట్ల ఈ ఇద్దరు మద్దతుదారుల మధ్య పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. కనిగిరిలో ఎమ్మెల్యేపై క్యాడర్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రధానంగా అక్కడ రాజకీయ పెత్తనం సాగించే ఒక సామాజికవర్గంలోని నాయకులు ఎమ్మెల్యే వైఖరిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అనేక పంచాయతీల్లో ఎమ్మెల్యే సమ్మతి, అసమ్మతి వర్గాలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. కొండపిలోనూ అధికారపార్టీలో రెండు, మూడు గ్రూపుల ప్రభావంతో వారికి వారే పోటీపడే అవకాశం నెలకొంది. గిద్దలూరులోనూ ఇటీవల అలాంటి పరిస్థితి పెరిగింది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దుకునే లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తయి అనేక పంచాయతీలో అధికారపార్టీకి షాక్‌ తగిలే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


టీడీపీలో దూసుకొస్తున్న యువతరం 

ప్రతిపక్ష టీడీపీలో పోటీకి సిద్ధమంటూ యువ నాయకులు దూసుకొస్తున్నారు. పలు గ్రామాల్లో ఆ పార్టీ సీనియర్లయిన వారికి ప్రభుత్వం నుంచి ఆయా పనులకు బిల్లులు రాక పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఈ దశలో అమీతుమీకి తాము సిద్ధమంటూ పలు గ్రామాల్లో ఆ పార్టీలోని యువ నాయకులు ముందుకు వస్తుండటం కనిపిస్తోంది. ఇప్పటికే పర్చూరు, అద్దంకి, కొండపి వంటి నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి స్పష్టంగా ఉంది. చీరాల, ఎస్‌ఎన్‌పాడు, వైపాలెం, గిద్దలూరుల్లోనూ అలాంటి వాతావరణమే ఉండటం టీడీపీ నేతలకు ఊపునిస్తోంది. కనిగిరిలో అయితే కొన్ని పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఇటు భయం.. అటు నమ్మకం 

ఈ ఎన్నికల్లో ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తమపై కొరడా ఝుళిపిస్తుందేమోనన్న భయం అధికార పార్టీ నేతలు, అధికారుల్లో కనిపిస్తోంది. అదేసమయంలో ఎన్నికల కమిషన్‌ ద్వారా అధికారపార్టీ బెదిరింపులు, అక్రమాలకు చెక్‌ పడుతుందని, తద్వారా ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కలిసొస్తుందన్న ధీమా టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. ఇంకోవైపు అధికారులు, పోలీసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీకి అనుగుణంగా తప్పిదాలకు పాల్పడి ఎన్నికల కమిషన్‌కు దొరికితే ఇబ్బందిపడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల సమరం ఎలా ముందుకు వెళ్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. 


Updated Date - 2021-01-26T06:31:26+05:30 IST