Abn logo
Sep 25 2021 @ 01:01AM

ప్రత్యామ్నాయానికి సమాయత్తం

కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట రైతువేదికలో అవగాహన కల్పిస్తున్న డీఏఓ తిరుమలప్రసాద్‌

- రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ

- వరి సాగు చేస్తే నష్టాలు తప్పవని ప్రచారం

- వచ్చే యాసంగి కోసం ముందస్తుగా కసరత్తు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తేనే మేలు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆ దిశగా సమాయాత్తం చేసేందుకు వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెద్దఎత్తున ఆహార ధాన్యాలు నిల్వ ఉండడంతో బియ్యం సేకరణపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టింది. వరిసాగు చేస్తే కష్టాలు తప్పవనే కోణంలో ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నది. 

మూడేళ్లుగా భారీ వర్షాలు..

జిల్లాలో మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో ఆయకట్టు భూములకు రెండు పంటలకు సరిపడా సాగు నీళ్లు అందుతుండడంతో రైతులు అధికంగా వరి పంటనే సాగు చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,76,897 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా 2,10,757 ఎకరాల్లో వరి సాగు చేశారు. గడిచిన ఏడాది యాసంగి సీజన్‌లో కూడా జిల్లాలో 2,08,288 ఎకరాల్లో పంటలు వేయగా, ఇందులో అత్యధికంగా 1,97,741 ఎకరాల్లో వరి పంటలను సాగు చేయడం గమనార్హం. జిల్లా సాగు విస్తీర్ణంలో 75 శాతానికి పైగా వరి పంటనే రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సాగు చేసే వరి పంట ధాన్యాన్ని అధికంగా బాయిల్డ్‌ బియ్యంగా మారుస్తూ ఉంటారు. భారత ఆహార సంస్థ వద్ద పెద్దఎత్తున బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు ఉండడంతో వచ్చే సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వరి పంటను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల దృష్టిని వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు యత్నిస్తున్నది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి యాసంగి సీజన్‌ ప్రారంభం కానున్నది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు రైతులు నీటి అవసరాన్ని బట్టి ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఉంటారు. ముందస్తుగానే రైతులచే ఆరుతడి పంటలను సాగు చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పదేళ్ల క్రితం ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పంటలను సాగుచేశారో, అవే పంటలను వచ్చే యాసంగిలో సాగు చేస్తే రైతులకు మేలు కలగనున్నదని చెబుతున్నది. వాస్తవానికి జిల్లాలో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనె ఉత్పత్తుల పంటల సాగు విస్తీర్ణం పెరగడం లేదు. కూరగాయల సాగు కూడా పెరడంలేదు. గతంలో జిల్లాలో అత్యధికంగా వేరుశెనగతో పాటు జొన్న, మొక్కజొన్న, పెసర, బబ్బెర, కంది, శెనగ, మినుము పంటలను రైతులు సాగు చేసేవారు. కాలక్రమేణా సాగునీటి వసతి పెరగడంతో పాటు అడవిపందులు, కోతుల బెడద వల్ల వరి, పత్తి పంటల వైపే మొగ్గుచూపారు. వరి సాగు చేస్తే ఆ పంటను కేంద్రం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. శుక్రవారం జిల్లాలోని అన్ని రైతువేదికల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలే మేలు..

- తిరుమల్‌ ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, జొన్న, తదితర పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వరి సాగుచేయడం వల్ల కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడనున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపునకు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు అధికంగా లాభాలు రానున్నాయి.