Abn logo
Mar 1 2021 @ 23:50PM

పల్లెల్లో రియల్‌ దందా!

అనుమతులు లేకుండా అడ్డగోలుగా విక్రయాలు

పంచాయతీల పరిధిలో యథేచ్ఛగా వెంచర్లు

డీటీసీపీ అనుమతులు లేకున్నా ప్లాట్ల దందా

క్షే త్రస్థాయికి వెళ్లని డీటీసీపీ అధికారులు

రియల్‌ వెంచర్లలో కార్యదర్శుల ఇష్టారాజ్యం

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

భవిష్యత్తులో కొనుగోలుదారులకు ఇబ్బందులే!

బోధన్‌, మార్చి 1: కరోనా నేపథ్యంలో అన్ని వ్యాపారాలు దెబ్బతినగా ప్రతి ఒక్కరూ రియల్‌ ఎస్టేట్‌ దందాపై దృష్టి పెట్టారు. వ్యవసాయ భూములను మొరంతో నింపి వ్యవ సాయేతర భూములుగా మార్చి రియల్‌ దందాకు తెరలేపు తున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన రియల్‌ వ్యా పారం ఇప్పుడు పల్లెలకూ చేరుకుంది. లాభసాటి వ్యాపారం గా మారడం, పెట్టుబడి లేకుండా లక్షలాది రూపాయలు జే బులోకి వచ్చిపడే వ్యాపారం కావడంతో ఈ దందా అడ్డగో లుగా కొనసాగుతోంది. భూముల యజమానులకు అడ్వాన్స్‌ గా పదో పరకో చెల్లించి హద్దురాళ్లు పాతి గుట్టుచప్పుడు కా కుండా లోలోపల విక్రయించేసి నయాపైసా ఖర్చు లేకుం డా, ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా లక్షలాది రూపా యలు ఆర్జించి యజమానులకు ఇవ్వడంతో పాటు రియల్‌ వ్యాపారులు దర్జాగా దందా సాగిస్తున్నారు. పల్లెల్లో రోడ్ల పొ డవునా వ్యవసాయ భూములు రియల్‌ భూములుగా మారి పోతున్నాయి. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ప్లాట్ల విక్రయాలు సాగుతున్నాయి. కనీసం పంచాయతీలలో అను మతులు కూడా తీసుకోకుండా వెంచర్లు వెలుస్తున్నాయి. రి యల్‌ వెంచర్లను అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇషారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ జేబులు నింపుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజలను నిండా మోసం చేస్తున్నారు. అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేసిన అమాయక ప్రజలు ఇళ్ల నిర్మాణ సమయంలో ఇక్కట్లన్నింటి నీ అనుభవించాల్సి ఉంటుంది.

బోధన్‌ డివిజన్‌లో అడ్డగోలుగా రియల్‌ దందా

బోధన్‌ డివిజన్‌ పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా, ఎడపల్లి, రెంజల్‌ మండలాలలో అడ్డగో లుగా రియల్‌ దందా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రి యల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యవసాయ భూముల యజమానులకు ఎంతోకొంత అడ్వాన్స్‌గా ముట్ట జెప్పి కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత భూముల యజ మానుల కళ్లకు గంతలు కట్టి వారి భూమిని వారి కళ్లేదుటే విక్రయించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ప్లాట్లను విక్రయించి భూముల యజమానులకు డబ్బులు అప్పగిస్తు న్నారు. అడ్వాన్స్‌లతోనే రియల్‌ దందాను నెట్టుకొస్తున్నారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలోని మండల కేంద్రాలలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి పబ్బం గడుపుకొంటున్నారు. రియల్‌ వ్యాపారాలలో ప్రజాప్రతినిధు లు భాగస్వాములుగా ఉండడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వెంచర్లను రూపొందిస్తున్నారు. కొందరు సర్పంచ్‌లు ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా అవతారం ఎత్తి దర్జాగా దండుకుం టున్నారు. అన్నింటికీ తాము ఉన్నామంటూ అధికారులను బెదిరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతు లు లేకుండానే రియల్‌ వెంచర్లకు దారులు వేస్తున్నారు. ప్ర జాప్రతినిధులు కావడంతో పంచాయతీ కార్యదర్శులు సైతం నోరు మెదుపక చోద్యం చూస్తున్నారు. 

ఎడపల్లి మండలంలో ఇద్దరు అధికారులపై వేటు

ఇటీవల ఎడపల్లి మండలంలో అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారి అధికా రులపై వేటు పడేలా చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో మొరం వేసి హద్దురాళ్లు పాతేంత వరకు చోద్యం చూస్తుండ డం.. ఫిర్యాదులు రాకపోతే ఎంతోకొంత దండుకొని చేతులు దులుపుకొంటున్నారు. వివాదాస్పదం అయితే మొక్కుబడిగా బోర్డులు ఏర్పాటుచేసి మమ అనిపిస్తున్నారు. డీటీసీపీ అధి కారులు క్షేత్రస్థాయికి వెళ్లి అనుమతులు లేని వెంచర్లను ప రిశీలించి వాటిని అడ్డుకోవాల్సి ఉంది. కానీ డీటీసీపీ అధికా రులు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయి లో ఎక్కడా అనుమతులు లేని వెంచర్లను అడ్డుకోవడం లే దన్న విమర్శలు ఉన్నాయి. 

బోధన్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో..

 బోధన్‌ ప్రధాన రహదారి పక్కనే వెలసిన రియల్‌ వెంచ ర్లకు అధికారులు బోర్డులు పెట్టారు. వెంచర్‌ నిర్వాహకులు మొరం వేసి తీరా చదును చేశాక ఫిర్యాదులు రావడంతో పంచాయతీ అధికారులు నిద్రమత్తు వీడారు. ప్రధాన రహదారి పక్కనే దర్జాగా వెంచర్లకు దారులు వేసినా అధికా రులు చోద్యం చూశారు. తీరా ఫిర్యాదులు రావడంతో అక్ర మ లేఅవుట్‌లని, అనుమతులు లేవని, ఎవరూ ప్లాట్లను కొనుగోలు చేయవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వ్యవ హారంలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్య క్తమయ్యాయి. బోధన్‌ డివిజన్‌లో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. పంచా యతీ కార్యదర్శులు కనీసం ఇప్పటికీ అటువైపు కన్నెత్తి చూ డడం లేదు. డీటీసీపీకి ప్రతిపాదనలు పంపేది పంచాయతీ కార్యదర్శులే అయినా తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్య వహరిస్తున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉన్న తాధికారుల పేర్లను చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నా రు. ఈ క్రమంలో అనుమతులు లేని అక్రమ వెంచర్లపై డీ టీసీపీ, జిల్లా పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనట్లు అయితే అక్రమ వెం చర్లతో అమాయక ప్రజలు నిండా మోసపోయే ప్రమాదం లేకపోలేదు. 

నోటీసులు జారీ చేసి హద్దు రాళ్లు తొలగించాం

గౌస్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి, బోధన్‌

డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతు లు లేకుండా వెంచర్లు వెలియడంతో నోటీసులు జారీ చేసి హద్దురాళ్లను తొలగించాం. పంచాయతీ కార్యదర్శులు అను మతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలి. తమ దృష్టికి వస్తే వెంచర్లను నిలిపివేసి నోటీసులు ఇస్తాం. బోర్డులను ఏ ర్పాటుచేస్తాం. 33 ఫీట్ల రోడ్లు లేకుండా డీటీసీపీ అనుమతు లు లేకుండా ఎవరు వెంచర్లను రూపొందించినా ఊరుకునే ది లేదు. కొన్నిచోట్ల ఉన్నతాధికారుల అనుమతులతో వెంచ ర్లు చేస్తున్నట్లు కార్యదర్శులు చెబుతుండడంపై మాకు ఎలాంటి సంబంధం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే ఎవ రిపైనైనా చర్యలు తప్పవు.

Advertisement
Advertisement