‘రియల్‌‘’ ఢమాల్‌

ABN , First Publish Date - 2022-08-22T07:14:50+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొద్దిరోజుల వరకు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగిన రియల్‌ ఎస్టేట్‌, ఇళ్ల నిర్మాణ వ్యాపారం ప్రస్తుతం ఢమాల్‌ అయింది. రెండునెలలుగా ఖాళీ ప్లాట్లు, కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల అమ్మకాలు 70 శాతానికి పైగా నిలిచినట్లు తెలుస్తొంది.

‘రియల్‌‘’ ఢమాల్‌

ఉమ్మడి జిల్లాలో నిలిచిన క్రయవిక్రయాలు   

రెండు నెలలుగా మందగించిన భూముల వ్యాపారం

ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లకు వెనకాడుతున్న ప్రజలు 

రిజిస్ట్రేషన్ల చార్జీలు, బ్యాంక్‌ వడ్డీలే కారణం

గత ఏడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు

కామారెడ్డి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొద్దిరోజుల వరకు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగిన రియల్‌ ఎస్టేట్‌, ఇళ్ల నిర్మాణ వ్యాపారం ప్రస్తుతం ఢమాల్‌ అయింది. రెండునెలలుగా ఖాళీ ప్లాట్లు, కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల అమ్మకాలు 70 శాతానికి పైగా నిలిచినట్లు తెలుస్తొంది. భూముల ధరలు రెండు నుంచి మూడింతలు కావడంతో డెవలప్‌మెంట్‌ కష్టతరం అయిందన్న వాదన వినిపిస్తొంది. దీనికి తోడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చార్జీలను ఎడాపెడ పెంచడంతో రియల్టర్‌లపైనే కాకుండా ప్లాట్లు కొనుగోలు చేసే వారిపై తీవ్ర భారం చూపింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా రిజిస్ట్రేషన్‌లు తగ్గాయి. 

భారంగా మారిన భూముల విలువల పెరుగుదల

 నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డు, ప్రధాన రహదారి ప్రక్కన గజం రూ. 70 నుంచి రూ.1లక్ష వరకు, పలు డివిజన్‌లలో రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పలుకుతోంది. జిల్లా కేంద్రం నుంచి 10 కి.మీల వెళితే తప్ప రూ.10 వేలకు గజం దొరికే పరిస్థితి లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. ఇక ఆర్మూర్‌, బోధన్‌, భీంగల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలల్లోనూ గజం భూమి రూ.10 వేలకు తక్కువగా దొరకడం లేదు. దీంతో ఇటీవల ఖాళీ స్థలాల క్రయ విక్రయాలు నిలిచిపోయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో భూములు కొన్న వ్యాపారులు సంబంధిత వ్యక్తులకు ఇచ్చిన అడ్వాన్స్‌లను వదిలేసుకుంటుండగా మరికొందరు పెట్టుబడుల విషయంలో ఆందోళన చెందుతున్నారు. 

పెరిగిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు

ప్రభుత్వం భూముల విలువలు పెంచడంతో పాటు గతంలో ఉన్న స్టాంప్‌ డ్యూటి, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ట్రాన్స్‌ఫర్‌ చార్జీలంటివి కూడా పెంచింది. దీంతో గతంలో భూ మి విలువకు ఆరుశాతం ఉన్న చార్జీలు ప్రస్తుతం 7.5 శాతానికి చేరాయి. దీంతో గత ఏడాది జూలై నెలలో జరిగిన రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోల్చి చూస్తే ఈ ఏడాది సగానికి పైగా రిజిస్ట్రేషన్‌లు తగ్గాయి. గత ఏడాది జూలైలో నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 105 రిజిస్ట్రేషన్‌లు జరిగితే ఈ జూలైలో 42 మాత్రమే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. నిజామాబాద్‌ రూరల్‌లో గత ఏడాది జూలైలో 78 రిజిస్ట్రేషన్‌లు అవుతే ప్రస్తుత జూలై లో 31 మాత్రమే అయ్యాయి. కామారెడ్డి సబ్‌రిజిస్ట్రర్‌ కా ర్యాలయంలో గత ఏడాది జూలైలో 81 డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రస్తుత జూలై లో 21 మాత్ర మే రిజిస్ట్రేషన్‌లు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

బ్యాంకు లోన్లకు భయపడుతున్న ప్రజలు

గతంలో ఎక్కడైనా ఇళ్లు కొనుగోలు చేయాలన్న లేవుట్‌ అనుమతులు ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొనాలన్న మధ్యతరగతి వారికి బ్యాంకులు లోన్ల రూపంలో భరోసా ఇచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో బ్యాంకు లోన్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వరుసగా ఆర్‌బీఐ బేసిక్‌ పా యింట్‌లు పెంచడం ద్వారా రుణాలు మరింత ప్రియంగా మారాయి. ఇప్పటికే రుణాలు పొందిన వారిపై ఈఎంఐల భారం పెరిగింది. ఉదాహరణకు రూ.25 లక్షల రుణాలు పొంది 20 ఏళ్ల పాటు రుణ చెల్లింపు వ్యవధి పెట్టుకున్న వారికి గతంలో ఉన్న వడ్డీరేటు కంటే ఒక శాతం పెరిగితే ఈఎంఐ రూపంలో రూ.2వేలకు పైగా భారం పడుతుంది. ఫలితంగా సదరు వ్యక్తి పూర్తి రుణం చెల్లించినప్పటికీ రూ.10లక్షల వరకు అదనంగా కోల్పోవాల్సి వస్తోంది.

బిల్డర్‌లు, రియల్టర్‌లలో ఆందోళన

ఒకవైపు భూముల ధరలు, మరోవైపు సిమెంట్‌, ఇనుము ధరలు భారీగా పెరగడంతో కట్టుబడి వ్యయం పెరిగింది. దీనికి కూలీల రేట్లు కూడా పెరగడంతో వీటన్నింటిని భరించి ఇల్లు నిర్మిస్తే ఏం గిట్టుబాటు కావడం లేదని బిల్డర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 గజాలలో నిర్మించిన ఇంటిని స్థలం విలువతో కలిపి సుమారు రూ.60లక్షల నుంచి రూ.80లక్షల వరకు విక్రయించాల్సి వస్తుందని అంతమొత్తం చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఆశలతో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు, పెట్టుబడులకు లేక మధ్యలోనే ఆగగా, పూర్తయినా ఇళ్లు కొనేవారి కోసం ఎదురుచూస్తున్నాయి. నిజామాబాద్‌నగరంతో పాటు, కామారెడ్డి, ఆర్మూర్‌, బాన్సువాడలాంటి పట్టణ కేంద్రాల్లో ప్లాట్లు కొంటే చాలు మూడేళ్లలో మీ ప్లాట్లు కొన్న రేట్లకు రెండింతల నగదు మీ చేతిలో పెడతామంటూ ప్లాట్ల అమ్మకాలు చేసిన వారు ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డారని తెలుస్తోంది.

కుటుంబంతో సహా

వ్యాపారి బలవన్మరణం

నిజామాబాద్‌ అర్బన్‌/సుభాష్‌నగర్‌: తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలనే దురాశ కొందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. అనుకున్నది జరగపోగా, ఉన్నది మొత్తం పోయి సమాజంలో బతకలేక, బంధువులు, మిత్రులకు ముఖం చూపెట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారితోపాటు అభంశుభం తెలియని తమ పిల్లలను సైతం అంతం చేస్తున్నారు. జనవరిలో నగరానికి చెందిన ఓ వ్యాపారి తన కుటుంబంతో సహా విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడగా.. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వ్యాపారంలో వచ్చిన నష్టాలే బలవన్మరణానికి ప్రధాన కారమణమని తెలుస్తోంది. విలాసవంతమైన జీవన విధానానికి అలవాటుపడి నష్టాలు రావడంతో వాటిని తట్టుకుని నిలబడే శక్తిలేక మరో దారిలేక చాలామంది ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. కుటుంబ పెద్దనే కాకుండా తనతోపాటు భార్య, పిల్లలను సైతం బలితీసుకుంటున్నారు.  

బంధువులంతా నిజామాబాద్‌ వారే..

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సూర్యప్రకాష్‌ (37), అక్షయ (36), ప్రత్యూష(11), అద్వైత్‌ (7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి సూర్యప్రకాష్‌ తన భార్య, కూతురు, కుమారుడికి క్రిమిసంహారక మందు ఇచ్చి తాను ఉరివేసుకున్నాడు. అయితే సూర్యప్రకాష్‌ బంధువులు ఎక్కువ శాతం నిజామబాద్‌లో ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న బంధువులు హోటల్‌కు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో హోటల్‌ ఆవరణ మొత్తం బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది.

పరారీలో ఆత్మహత్యకు కారకులు!

నగరంలో కలకలం రేపిన కుటుంబ సభ్యుల ఆత్మహత్య కారకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య వార్త మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆత్మహత్యకు గల కారకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే వీరిపై పోలీసులు 306 కింద కేసు నమోదు చేశారు. వేధింపులకు కారణమైన ముగ్గురిని ఎలాగైనా పట్టుకుంటామని ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - 2022-08-22T07:14:50+05:30 IST