రియల్‌ మాయ

ABN , First Publish Date - 2022-01-23T04:39:39+05:30 IST

యాచారం, కందుకూరు మండలాల మధ్యన

రియల్‌ మాయ
చింతపట్ల సమీపంలో కల్వర్టు వద్ద పోసిన మట్టి

  • అక్రమ అనుమతులతో వెలుస్తున్న వెంచర్లు
  • వెంచర్‌ కోసం కల్వర్టులను మూసేస్తున్న రియల్టర్లు
  • ప్లాట్లు చేయకుండానే ఆన్‌లైన్‌లో బ్రోచర్లు
  • తనిఖీలు లేకుండానే పర్మిషన్లు ఇస్తున్న అధికారులు


యాచారం, జనవరి 22 :  యాచారం, కందుకూరు మండలాల మధ్యన ఫార్మాసిటీ ఏర్పాటవుతుండటంతో ఈ ప్రాంతంలోని భూములకు డిమాండ్‌ బాగా పెరిగింది. జంటనగరాలకు చెందిన పలు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఇక్కడ వెంచర్లు చేయడానికి ఎగపడుతున్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మారుస్తు న్నారు. అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, నాలా కన్వర్షన్‌గా మార్చకుండానే భూములు చదును చేసి వెంచర్లు వేసి గోప్యంగా ప్లాట్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వెంచర్లు చేసేచోట వరదనీరు పారకుండా కల్వర్టులను మట్టిపోసి మూసి వేస్తున్నారు. 

రియల్‌ వ్యాపారుల మాయ మాటలను నమ్మి హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అధికారులు వెంచర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతి ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి తనిఖీలు చేయకుండానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మండల రెవెన్యూ అధికారుల సూచనలు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. రాజకీయ పార్టీల నేతల అండదండలతో రియల్టర్లు ఇష్టానుసారంగా వెంచర్లను ఏర్పాటు చేసి అమ్ముకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల చింతపట్లలో చెరువులోకి వరదనీరు రాకుండా కల్వర్టు వద్ద మట్టి పోసి రియల్టర్లు చదును చేశారు. ఈ విషయం పంచాయతీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లిలో సర్పంచ్‌కు కూడా తెలియకుండానే వెంచర్‌ వేస్తున్నారంటే రియల్టర్ల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసే సమయంలో వాస్తవాలు  తెలుసుకోకుండానే డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు ఇస్తుండటంతో అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉండటంతో రియల్టర్లు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు అక్రమ వెంచర్ల గురించి ఆరా తీయకపోవడం వల్లే రియల్టర్లది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ఇరిగేషన్‌శాఖ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు మండలంలో పర్యటించి అక్రమవెంచర్లను తక్షణమే కూల్చివేయడంతోపాటు అక్రమంగా అనుమతులు పొందిన రియల్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


అందమైన బ్రోచర్లతో ఎర

కొందరు రియల్టర్లు కొత్త మోసాలకు దిగుతున్నారు. వెంచర్‌ పూర్తి కాకుండానే అందమైన బ్రోచర్లు తయారు చేసి కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నారు. మా వెంచర్‌ ఫార్మాసిటీకి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో ఉందని, శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే పక్కనే ఉందని బ్రోచర్లను డిజైన్‌ చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. హాట్‌ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోయేలా వీటిని పొందుపర్చుతున్నారు. ఈ బ్రోచర్లను చూసిన కొందరు కొనుగోలుదారులు వెంచర్లను వెతుక్కుంటూ వస్తున్నారు. తీరా బ్రోచర్‌లో చూపిన అడ్ర్‌సకు వస్తే అక్కడ ఏ వెంచర్‌ కనిపించక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు యాచారం మండలం తక్కళ్లపల్లి వద్ద వెంచర్‌ ఉన్నట్లు బ్రోచర్‌లో చూసి వెతుక్కుంటూ వచ్చారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వెతికినా కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. వారు కేవలం ఆన్‌లైన్‌లో ఉన్న బ్రోచర్‌ చూసి వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి ఎన్నో మోసాలకు రియల్టర్లు పాల్పడుతున్నారని తెలుస్తోంది.


ఆన్‌లైన్‌లో నకిలీ బ్రోచర్లు

నేను దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటా. ఫేస్‌బుక్‌లో యాచారం మండలం తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో వెంచర్లు ఉన్నాయని చూసి రియల్టర్లను సంప్రదించాం. ప్లాట్‌ను బుక్‌ చేసుకోవడానికి నా మిత్రులతో కలిసి వ్యాపారికి రూ.2లక్షలు ఇచ్చాం. అదేరోజు వెంచర్‌ను చూద్దామని వస్తే ఎక్కడా కనిపించలేదు. రియల్టర్‌ను ప్రశ్నిస్తే చింతపట్ల వద్ద వెంచర్‌ ఉంది అక్కడ ప్లాటు ఇస్తామని చెప్పారు. ఇలా అబద్దపు బ్రోచర్లు ఆన్‌లైన్‌లో మోసం చేయడం ఎంతవరకు సమంజసం. 

- నరేందర్‌, దిల్‌సుఖ్‌నగర్‌


కఠిన చర్యలు తీసుకుంటాం

అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాటిని వెంటనే కూల్చివేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలను పాటిం చని వారిపై నిఘా వేశాం. 

- శ్రీలత, ఎంపీవో, యాచారం 


వరద నీటికి అడ్డుకట్టలు వేస్తే సహించం

రియల్టర్లు వరద నీరు పారే ప్రాంతాన్ని మూసి వెంచర్లు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుం టాం. ఎన్‌వోసీ లేకుండా పనులు చేయొద్దు. నంది వనపర్తి,  చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో వెంచర్‌దారులు వేసిన కట్టలను తొలగిస్తున్నాం.

- మంజుల, ఇరిగేషన్‌ డీఈ  



Updated Date - 2022-01-23T04:39:39+05:30 IST