Abn logo
Jun 26 2021 @ 13:24PM

రియల్‌ వ్యాపారంలో నష్టాలు.. యాసిడ్‌ తాగి ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై యాసిడ్‌ తాగాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఏ. హన్మత్‌రెడ్డి (40) కొన్నేళ్లుగా జీడిమెట్ల ప్రాంతంలోని అపురూప కాలనీలో ఉంటున్నాడు. అతనికి భార్య నాగలక్ష్మి, పిల్లలు ఉన్నారు. ఐదేళ్లుగా హన్మంత్‌రెడ్డి స్నేహితులు శేఖర్‌చారి, మరో ఇద్దరితో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో  ఓ సంఘటనతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు హన్మంత్‌రెడ్డిని ఉదయం తీసుకెళ్లి, రాత్రి వదలిపెట్టేవారు. వారి మధ్య ఏం జరిగిందో కానీ, ఈ నెల 24న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాత్రూంలో యాసిడ్‌ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా, శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.