విశ్వనాథన్ ఓటమి వెనుక అసలు రహస్యం ఇదే..!

ABN , First Publish Date - 2021-06-15T02:37:21+05:30 IST

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓ సాధారణ వ్యక్తి చెస్‌లో ఓడించాడు. చెస్‌లో పెద్దగా అనుభవం లేని ఆ వ్యక్తి చేతిలో విషీ ఓడిపోవడం సర్వత్రా..

విశ్వనాథన్ ఓటమి వెనుక అసలు రహస్యం ఇదే..!

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓ సాధారణ వ్యక్తి చెస్‌లో ఓడించాడు. చెస్‌లో పెద్దగా అనుభవం లేని ఆ వ్యక్తి చేతిలో విషీ ఓడిపోవడం సర్వత్రా సంచలనమైంది. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ పేరిట చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్‌ పోటీల్లో తలపడ్డారు. అందులో భాగంగానే  జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్‌ కామత్‌ సైతం పోటీపడి ఆనంద్‌ను ఓడించారు. ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. అయితే విషీని సదరు వ్యక్తి మోసం చేసి ఓడించాడని వార్తలొచ్చాయి. దీనిపై నిఖిల్ కామత్ ట్విటర్లో స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.


 ‘నేను చిన్నప్పుడు చెస్‌ నేర్చుకునే రోజుల్లో విశ్వనాథ్‌ ఆనంద్‌తో ఆడాలనుకున్నా. అది నిన్నటితో నిజమైంది. అక్షయపాత్ర సంస్థ వారు ఆనంద్‌తో కలిసి ఛారిటీ కోసం చెస్‌ పోటీలు నిర్వహించడంతో నాకా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే, నేను నిజంగానే విశ్వనాథ్‌ ఆనంద్‌ను చెస్‌లో ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. అదెలా ఉందంటే నేను నిద్రలేచిన వెంటనే ఉసేన్‌బోల్ట్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీపడి గెలిచినట్లుగా ఉంది’ అని నిఖిల్‌ పోస్టు చేశారు. అంతేకాకుండా తాను విషీని ఓడించడం అసాధ్యమనే విషయం వేరే చెప్పక్కర్లేదని, ఆ మ్యాచ్‌లో నేను కంప్యూటర్‌తో పాటు మరికొంతమంది వ్యక్తుల సాయం కూడా తీసుకున్నానంటూ నిఖిల్ వెల్లడించారు.


అయితే, నిఖిల్ మోసం చేసి విషీపై గెలిచినట్లు వార్తలు రావడంతో ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌(ఏఐసీఎఫ్‌) కార్యదర్శి భరత్‌ చౌహన్‌ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని వాపోయారు. ఇక దీనిపై విషీ కూడా స్పందించారు. ‘నిన్న పలు రంగాల ప్రముఖులతో ఆడటమనేది ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి. ఆటలోని నియమాలు పాటిస్తూ ఆడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే నేను ఆడాను. ఇతరుల నుంచి కూడా అదే ఆశించాను’ అని విషీ రీట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-06-15T02:37:21+05:30 IST