పల్లెల్లో రియల్‌ మాఫియా

ABN , First Publish Date - 2022-01-20T06:12:26+05:30 IST

ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం.. ఇప్పుడు పల్లెల్లోనూ శరవేగంగా వి స్తరిస్తోంది. రియల్‌ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పో తోంది. ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడానే లేకుండా విచ్చలవిడిగా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేస్తున్నారు.

పల్లెల్లో రియల్‌ మాఫియా
బోథ్‌ మండలంలో వెలసిన అక్రమ వెంచర్‌

జిల్లాలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ వెంచర్లు

ఏజెన్సీ భూములపై బడా నేతల కన్ను

అనుమతి  లేకున్నా..  అడ్డగోలు దందా

‘మామూళ్లు’గానే తీసుకుంటున్న స్థానిక పంచాయతీ అధికారులు

బీడు భూములుగా దర్శనమిస్తున్నపంటపొలాలు

వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు

జిల్లావ్యాప్తంగా పట్టణాల్లో 64, గ్రామాల్లో 24 వెంచర్లకు మాత్రమే అనుమతి

ఆదిలాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం.. ఇప్పుడు పల్లెల్లోనూ శరవేగంగా వి స్తరిస్తోంది. రియల్‌ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పో తోంది. ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడానే లేకుండా విచ్చలవిడిగా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మండలాలతో పాటు జిల్లాకేంద్రం పరిసర ప్రాంతాలలోనూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తూ అమ్మేసుకుంటున్నారు. అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. గ్రామాల పరిసర ప్రాంతాలలో పంటల తో పచ్చగా కనిపించాల్సిన పంట భూములు, ప్రస్తుతం వెంచర్లతో బీడు భూ ములుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా మండలకేంద్రాల చుట్టు ఉన్న వ్యవ సాయ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. జిల్లాలోని పట్టణ ప్రాంతంలో 64, గ్రామీణ ప్రాంతంలో 24 వెంచర్లకు మాత్రమే అనుమతులున్నాయని సం బంధిత అధికారులు పేర్కొంటున్నారు. మిగితా 106 వెంచర్లు అనధికారిక లే ఔట్లుగా అధికారులు గుర్తించారు. లెక్క ప్రకారం జిల్లాలో వందలాది వెంచర్లు ఉన్నా.. ఎక్కడా హద్దురాళ్లను తొలగించిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ తొలగించినా వ్యాపారులు గుట్టుచప్పుడుకాకుండా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. జిల్లాలో ఏజెన్సీ మండలాలైన ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బేల, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌, నార్నూర్‌, ఉట్నూర్‌ మండల కేంద్రాల్లోనూ యథేచ్ఛగా దందా సాగుతోంది. పెట్టిన పెట్టుబడులకు పదింతల లాభాలు రావడంతో నిర్మల్‌ జిల్లాకు చెందిన కొందరు రియల్‌ వ్యాపారులు జిల్లాలో అక్రమ వెంచర్లను వేస్తూ తమ ప్రతినిధులతో పాటు మధ్యదళారులతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ఉద్యోగులు ఇదే పనిగా మార్చుకుని లేఔట్లను ఏర్పాటు చేస్తున్నారు. ‘అనుమతులు, గినుమతులు జాంతానై.. అడిగే వారెలేర’న్న ధీమాతో మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బోథ్‌ నియోజకవర్గంలోని బోథ్‌ మండలంతో పాటు ఇచ్చోడ మండల కేంద్రాల చుట్టు సాగు భూముల్లో అక్రమ వెంచర్లు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. పంచాయతీ, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అన్ని తెలిసీ.. అధికారుల మౌనం

ఏజెన్సీలో వెంచర్లను ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇచ్చోడ, ఉట్నూర్‌, గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో విచ్చలవిడిగా ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా.. మౌనంగానే ఉండిపోవ డంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో అడపాదడపగా అధికారులతో స మీక్ష సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత అంతా మరిచిపోవడంతో క్షేత్రస్థాయిలో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట పడడం లేదు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అక్ర మ వెంచర్లను తొలగించాల్సిన అధికారులే, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆర్థిక పరపతి, రాజకీయ నేతల ఒత్తిళ్లతో వాటి జోలికి వెళ్లడం లేదంటున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి వెంచర్లు, పెద్ద భవనాల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉండవు. 1/70 యాక్ట్‌ ప్రకారం గిరిజనుల అనుమతి లేకుండానే ఎలాంటి భూ మార్పిడి జరగడానికి వీలు లేదు. కాని ఇప్పటికే భూములు కలిగి ఉన్న గిరిజనేతర రైతులు తమ పలుకుబడితో వెంచర్లను ఏర్పాటు చేస్తూ అక్రమదందాకు ఎగబడుతున్నారు. ఏజెన్సీలో భూములు అమ్మాలన్న, కొనాలన్న గిరిజనులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనతో ఏమీ చేయలేమని తెలిసినా.. గిరిజనేతర రైతులు బినామీ పేర్లతో రియల్‌ వ్యాపారాని కి దిగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి లేఔట్‌ అనుమతులు కూడా ఇవ్వ డానికి వీలు లేదు. కాని నిత్యం విచ్చలవిడిగా వెంచర్లు వెలస్తూనే ఉన్నాయి. అయితే, కొందరు గిరిజనేతర నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. 

కూలీలుగా మారుతున్న అన్నదాతలు

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్న అన్నదాతలు.. భూములను అమ్మేసుకుని కూలీలుగా మారుతున్నారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు భూములు ఉన్నా.. పట్టాలు లేక పోవడంతో కొందరు అమాయక గిరిజనులను అడ్డంగా పెట్టుకొని రియల్‌ దందాకు ఎగబడుతున్నారు. గిరిజన గ్రామాల్లో చక్రం తిప్పుతున్న కొందరు గిరిజనేతర పెద్దలు రియల్‌ మాఫియతో చేతులు కలిపి గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నారు. చూస్తుండగానే యేటా వందల ఎకరాల భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. గ్రామా ల్లో నిరాశతో కనిపిస్తున్న కొందరు అన్నదాతలకు డబ్బులను ఆశచూపుతూ లొంగదీసు కుంటున్నారు. కొందరుపెద్దలు ఇదే పనిగా దళారీదందాకు ఎగబడుతున్నారు. గ్రామాల్లో కొంత పలుకుబడి ఉండి, తెలివితేటలు ఉన్న వారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సులువుగా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే అవకాశం ఉండడంతో ఎంతకైనా తెగిస్తున్నారు. వివాదస్పద భూములను గుర్తించి సెటిల్‌ చేస్తామని నమ్మబలుకుతూ విలువైన భూములను చౌక ధరలకే కొట్టేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించక పలువురు అన్నదాతలు విలువైన భూములను అమ్మేసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. వచ్చిన డబ్బులతో ఇతర వ్యాపారాల్లో స్థిరపడుతున్నారు. యేటా పంట భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గడం ఆందోళన రేపుతోంది.

ఎవరైనా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే చర్యలు తప్పవు

: రిజ్వాన్‌భాషా, అదనపు కలెక్టర్‌, ఆదిలాబాద్‌

జిల్లాలో అనధికార లేఔట్ల రిజిస్ర్టేషన్లు, అనధికార భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 106 అనధికార లేఔట్లను తొలగించడం జరిగింది. బై నెంబర్‌తో వచ్చే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ర్టేషన్‌ చేయకూడదు. గిరిజన ప్రాంతాల్లోని భూములకు రిజిస్ర్టేషన్‌ చేసే ముందు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలి. 

Updated Date - 2022-01-20T06:12:26+05:30 IST