రియల్‌ మాయ!

ABN , First Publish Date - 2022-08-07T05:53:18+05:30 IST

జిల్లాలో ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడా లేకుండా రియల్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు.

రియల్‌ మాయ!
ఇచ్చోడ మండలం అడెగామ(కె)లో అక్రమంగా వెలిసిన వెంచర్‌

ఏజెన్సీలో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు

అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా దందా

మామూలుగా తీసుకుంటున్న పంచాయతీ అధికారులు

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

క్షేత్ర స్థాయిలో కొరవడుతున్న జిల్లా అధికారుల పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, ఆగస్టు6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడా లేకుండా రియల్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, బోథ్‌ మండలాలతో పాటు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలోనూ రియల్‌ వ్యాపారులు విచ్చలవిడిగా వెంచర్లను వేస్తూ అమ్మేసుకుంటున్నారు. మండల కేంద్రాల చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు కనిపించకుండానే కనుమరుగై పోతున్నాయి. రియల్‌ వ్యాపారులు భూముల ధరలను అమాంతంగా పెంచేయడంతో ప్లాట్ల ధరలు ఆకాశానంటుతున్నాయి. జిల్లాలో ఏజెన్సీ మండలాల్లోను భూదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలో గత ఏడాది రెండేళ్ల క్రితం వరకు మామూలుగానే కనిపించిన భూముల ధరలు ప్రస్తుతం భారీ డిమాండ్‌ కావడంతో వ్యవసాయదారులు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరు ఖద్దరు నేతలు, ఉద్యోగులు కూడా రియల్‌ వ్యాపారాన్నే ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఎక్కువగా అధికార పార్టీ నేతలే కావడంతో వీరికి అగ్రనేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో అడ్డగోలుగా దందాకు ఎగబడుతున్నారు. అనుమతులు, గినుమతులు జాంతానై అడిగే వారెలేరన్న ధీమాతో మరింత రెచ్చిపోతున్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు రియల్‌ వ్యాపారంతోనే బిజీబిజీగా మారిపోతున్నారు. ప్రజాసేవ ముసుగులో అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌ అక్రమ వెంచర్లపై హెచ్చరికలు చేసిన అక్రమదందాలకు అడ్డు అదుపు లేకుండానే పోయింది. 

ఫిర్యాదులు బుట్టదాఖలు...

ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ గ్రామాల్లో కొందరు ప్రజా ప్రతినిధులు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తూ అమ్మేయడంపై ఇప్పటికే పలువురు సర్పంచ్‌లు, గ్రామస్థులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టింపే లేకుండానే పోయింది. పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు రియల్‌ మాఫియాతో మిలాఖత్‌ కావడంతో గ్రామాల్లో అక్రమ వెంచర్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇచ్చోడ, బోథ్‌ మండల కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల్లో ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డగోలుగా వెంచర్లను ఏర్పాటు చేస్తూ అమ్మేస్తున్న అధికారులు పట్టించుకోవడమే లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో పారదర్శకంగా పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రత్యేకాధికారిని నియమించిన అక్రమదందాలకు అడ్డుకట్ట పడినట్లు కనిపించడం లేదు. చూస్తుండగానే ఏటా వందల ఎకరాల భూములు ప్లాట్లుగా మారి పోతున్నాయి. గ్రామాల్లో నిరాశతో కనిపిస్తున్న కొందరు అన్నదాతలకు డబ్బులను ఎరవేస్తూ తమదారికి తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో కొంత పలుకుబడి ఉండి తెలివి తేటలు ఉన్న వారంతా రియలెస్టేట్‌ వ్యాపారంవైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలోనే సులువుగా ఎక్కువ సంపాధించే అవకాశం ఉండడంతో ఎంతకైనా తెగిస్తున్నారు. గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించిన మళ్లీ కొన్నాళ్ల తర్వాత అదే దందాకు ఎగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే అడ్డగోలు దందాలు కొనసాగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కలెక్టర్‌గా పని చేసిన దివ్యదేవరాజన్‌ కఠినంగా వ్యవహరించడంతో అప్పట్లో కొంత వరకు కట్టడి అయినట్లు కనిపించింది. కాని ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో గ్రామాల్లో రియల్‌ వ్యాపారం ఊపందుకుంటుంది. 

ఏజెన్సీ చట్టాలకు తూట్లు..

ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి వెంచర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేకపోయినా కొందరు బడా నేతలు ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తూ అమాయకులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల్లో రియలెస్టేట్‌ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతున్న అధికారులు మాములుగానే తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థిరాస్తులు అమ్మాలన్న కొనాలన్నా గిరిజనులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి నిబంధనతో ఏమీ చేయలేమని ముందే పసిగట్టిన గిరిజనేతర నేతలు గిరిజన రైతుల పేరిటా బినామీ దందా నడుపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి లేఔట్‌కు అనుమతులు ఇవ్వడానికి అసలు వీలే లేదు. కానీ అధికారుల మొద్దునిద్రతో నిత్యం వెంచర్లు వెలుస్తునే ఉన్నాయి. ఏజెన్సీ మండలాల్లో అధికారంలో ఉన్న కొందరు నేతలు గిరిజనులను అడ్డుపెట్టుకుని అడ్డగోలు దందాకు ఎగబడుతున్నారు. అన్నీ తెలిసిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అక్రమదందాలు ఆగడమే లేదు. ఏజెన్సీ చట్టాల అమలుపై ఐటీడీఏ అధికారులకు అసలు పట్టింపు లేకుండానే పోయింది. గిరిజనుల భూములు కనిపించకుండా పోవడంతో ఉపాధి కరువై రైతులు ఉసురు తీసుకుంటున్నారు. 


Updated Date - 2022-08-07T05:53:18+05:30 IST