Apr 19 2021 @ 19:00PM

కేసీఆర్‌ తెలంగాణ దేవుడే: హీరో శ్రీకాంత్‌

ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం), హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం నటించిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో దాసరిగారి శిష్యులు ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దర్శకులై ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. దాసరిగారి శిష్యుల దగ్గర శిష్యరికం చేసిన హరీష్ కూడా వారిలాగే ఈ సినిమాతో పెద్ద దర్శకుడవ్వాలి. కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్రయూనిట్‌కు మంచిపేరు రావాలి..’’ అని అన్నారు.


నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం కష్టపడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కె.సి.ఆర్ గారి బయోపిక్‌ను తీసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను..’’ అని తెలుపగా.. దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది..’’ అన్నారు. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న జిషాన్ ఉస్మాన్ మాట్లాడుతూ.. గొప్పచరిత్ర కలిగిన ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘పెద్దలు మొహమ్మద్ అలీగారికి, నా ఆప్తులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్. నారాయణమూర్తిగారికి.. మమ్మల్ని, మా సినిమాను బ్లేస్ చేయడానికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీని జాతిపిత అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే. అలాంటి కేసీఆర్ రోల్ నాకు లభించినందుకు ఈ రోజు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునే వాడిని. థాంక్స్ హరీష్. ఈ సినిమాలో 50 మంది ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా కరోనా కంటే ముందు స్టార్ట్ అయ్యింది. కానీ వారందరి డేట్స్ సెట్ అవ్వక సినిమా ఆలస్యం అయ్యింది. ఇంత మంచి సబ్జెక్ట్‌ను, ఎంతో మంది ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారు ఎంతో ప్యాసినెట్‌గా ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. జిషాన్‌కు ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా చాలా చక్కగా నటించాడు. తను ఫ్యూచర్‌లో మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.