మార్కాపురంపై రియల్టర్ల కన్ను

ABN , First Publish Date - 2022-01-13T06:05:36+05:30 IST

మార్కాపురంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై రియల్టర్లు కన్నేశారు. రెవెన్యూ రికార్డుల పరంగా ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని ఆక్రమణలకు పాల్లడుతున్నారు.

మార్కాపురంపై రియల్టర్ల కన్ను
మార్కాపురంలో కబ్జాదారులు చదును చేసిన స్థలం

1.5ఎకరాల భూమి ఆక్రమణకు యత్నం

పోలీసులకు ఫిర్యాదుతో కబ్జాదారులు పరారీ

సహకరిస్తున్న అధికార యంత్రాంగం

తెరవెనుక వైసీపీ నేతలున్నారన్న ప్రచారం 

మార్కాపురం, జనవరి 12 : మార్కాపురంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై రియల్టర్లు కన్నేశారు. రెవెన్యూ రికార్డుల పరంగా ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని   ఆక్రమణలకు పాల్లడుతున్నారు. భూ హక్కుదారులలో ఒకరిద్దకి ఉన్న భౌతిక, మానసిక వైఫల్యాలను అవకాశంగా మార్చుకొని వారి దందాను కొనసాగిస్తున్నారు. ఏదేమైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చన్న ఉద్దేశంతో అధికారయంత్రాంగం సైతం వారి అడుగులకు మడుగులొత్తుతున్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 


మార్కాపురంలో హైదరాబాద్‌ వాసుల వీరంగం

మార్కాపురంలో నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన రియల్టర్లు ఇప్పుడు ప్రైవేటు స్థలాలపైనా దృష్టిసారించారు. అందుకు అనుగుణంగా రెవెన్యూ రికార్డులలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటీవల మార్కాపురంలోని కంభం రోడ్డులో ఉన్న శ్రీనివాస థియేటర్‌ ప్రాంతంపై కన్నేశారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజికపరంగా బలంగా ఉన్న వ్యక్తులు ఆక్రమంగా,  దౌర్జన్యంగా సామ, ధాన, భేద, దండోపాయాలను ప్రయోగించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అధికార యంత్రాంగాన్ని లోబర్చుకొని రంగంలోకి దిగుతున్నారు. అలాగే పట్టణంలోని కంభం రోడ్డులో ఒకవర్గం శ్మశానవాటిక సమీపంలో సుమారు ఒకటిన్నర ఎకరం భూమిని ఆక్రమించేందుకు హైదరాబాద్‌ వాస్తవ్యుల పేరుతో కొందరు బుధవారం యత్నించారు. ఎక్స్‌కవేటర్లతో ఆ ప్రాంతాన్ని చదును చేశారు. భూయజమానులు గేదెలకోసం పెంచుకున్న గడ్డిని సైతం తొలగించారు. విషయం తెలుసుకున్న భూయజమానులు అక్కడకు చేరుకొని వారిని ప్రశ్నించారు. వివాదం ఎంతటికీ తెగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణదారులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు.  


ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం ఏముంది?

పట్టణంలోని కంభం రోడ్డులోని శ్రీనివాస థియేటర్‌ సమీపంలో ముస్లిం శ్మశానవాటిక సమీపంలోని ఆర్‌ఎస్‌ఆర్‌లో సర్వే నెంబర్‌ 356-ఏ3లో 1.76ల భూమి పఠాన్‌ బడాన్‌ఖాన్‌ పేరుతో ఉంది. అనంతర కాలంలో ఆయన వారసులు ఆ భూమిని పంచుకున్నారు. వారిలో కొందరు ఆర్థిక అవసరాల రీత్యా ఇతరులకు అమ్ముకున్నారు. కొనుగోలుదారులు ఆయా స్థలాలో పశువులకు గడ్డిని పెంచుకుంటున్నారు. ఒకరిద్దరు భవనాలను సైతం నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, రైతు భరోసా డబ్బులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 


అధికార యంత్రాంగం సహకారం

ఇటీవల పెరిగిన బినామీ రియల్టర్ల పేరుతో అధికారపార్టీ నాయకులు సాగిస్తున్న దందాలకు యంత్రాంగం సైతం సహకరిస్తోంది. రెవెన్యూ రికార్డులలో ఉన్న లోపాలను ఆసరా చేసుకొని జరుగుతున్న ఈ భూ అక్రమాలకు వారు పూర్తిగా సహకరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ అక్రమాలకు సంబంధించి రికార్డులలో ఉన్న లోపాలను సగం మంది అధికారులే నేతలకు చేరవేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. 



Updated Date - 2022-01-13T06:05:36+05:30 IST