రియల్టీ రికవరీ బాట

ABN , First Publish Date - 2021-01-07T07:08:04+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) రికవరీ బాట పట్టింది.

రియల్టీ రికవరీ బాట

  • అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో గణనీయ వృద్ధి 
  •  నైట్‌ఫ్రాంక్‌ అర్ధ సంవత్సర నివేదిక వెల్లడి


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) రికవరీ బాట పట్టింది. ఇళ్ల కొనుగోళ్లు, కార్యాలయ స్థలం లీజింగ్‌ రెండూ పెరిగాయి. త్రైమాసికంలో ఇళ్ల కొనుగోళ్లు 58,402 నుంచి 61,592 యూనిట్లకు పెరిగాయి. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ కూడా 1.64 లక్షల చదరపు అడుగుల నుంచి 1.75 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. పలు నగరాల్లో కొనుగోళ్లు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్‌ వార్షిక నివేదికలో తెలిపింది.


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పూణె, అహ్మదాబాద్‌ నగరాల్లో రియల్టీ మార్కెట్‌ తీరుతెన్నులను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. అయితే ఏడాది మొత్తం మీద మాత్రం ఇళ్ల కొనుగోళ్లు 37 శాతం, కార్యాలయ స్థలం లీజింగ్‌ 35 శాతం తగ్గాయి. 8 ప్రధాన నగరాల్లో 1,54,534 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019 సంవత్సరంలో అమ్ముడుపోయిన ఇళ్లు 2,45,861 యూనిట్లు. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ కూడా 6.06 లక్షల చదరపు అడుగుల నుంచి 3.94 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. ఇళ్ల అమ్మకాలు అహ్మదాబాద్‌లో అధికంగా క్షీణించగా పూణెలో కనిష్ఠ క్షీణత నమోదయింది. 


హైదరాబాద్‌లో పెరిగిన కొనుగోళ్లు

హైదరాబాద్‌లో అటు కార్యాలయ స్థలం, ఇటు ఇళ్ల కొనుగోళ్లు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో విశేషంగా పుంజుకున్నాయని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. 


 2020 జూలై-డిసెంబరు నెలల మధ్య కాలంలో 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకి తీసుకున్నారు. నిర్మాణం పూర్తయిన కార్యాలయ స్థలం కూడా 4 లక్షల చదరపు అడుగులుంది. 


 జూలై-సెప్టెంబరు నెలల మధ్య కాలంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో కార్యాలయ స్థలం లీజింగ్‌  లావాదేవీలు 640 శాతం పెరిగాయి. 


  కార్యాలయ స్థలం లీజింగ్‌లో బీఎ్‌ఫఎ్‌సఐ వాటా 2019 ప్రథమార్ధంతో పోల్చితే 4 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో కుదిరిన రెండు పెద్ద డీల్స్‌ ఇందుకు దోహదపడ్డాయి. 


  నివాస గృహాల కొనుగోళ్లు ఏడాది మొత్తం మీద 38 శాతం క్షీణించి 16,267 యూనిట్ల నుంచి 10,042 యూనిట్లకు పడిపోయాయి. ద్వితీయార్ధంలో 5260 ఇళ్లు అమ్ముడుపోయాయి. నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు 127 శాతం పెరిగాయి. 


Updated Date - 2021-01-07T07:08:04+05:30 IST