రియల్టీ సెంటిమెంట్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2021-07-23T05:48:00+05:30 IST

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్‌కు ఏమాత్రం కలిసి

రియల్టీ సెంటిమెంట్‌ ఢమాల్‌

  •  దెబ్బతీసిన కొవిడ్‌ రెండో ఉధృతి
  •  భవిష్యత్‌పైనే బిల్డర్ల ఆశలు


న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్‌కు ఏమాత్రం కలిసి రాలేదు.  ఈ కాలానికి ఈ పరిశ్రమ సెంటిమెంట్‌ను సూచించే ఇండెక్స్‌ 35 పాయింట్లకు పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఉన్న 57 పాయింట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫిక్కీ, నరెడ్కోలతో కలిసి నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ‘రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ క్యూ2, 2021 పేరుతో విడుదల చేసిన సర్వే నివేదిక ఈ విషయం పేర్కొంది.


ఇండెక్స్‌ 50 పాయింట్లపైన ఉంటే మార్కెట్‌ బాగున్నట్టు, అంతకంటే తగ్గితే నిరాశలో ఉన్నట్టు లెక్క. కొవిడ్‌ రెండో ఉధృతి జూన్‌ త్రైమాసికంలో మార్కెట్‌ను బాగా దెబ్బతీసింది. అయితే గత ఏడాది రెండో త్రైమాసికం తో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం రెండో త్రైమాసికం కొద్దిగా బాగానే ఉంది. అప్పట్లో ఈ సెంటిమెంట్‌ సూచీ గతంలో ఎన్నడూ లేని విధంగా 22 పాయింట్లకు పడిపోయింది. 


భవిష్యత్‌ ఆశాజనకం

వచ్చే ఆర్నెల్లపై మాత్రం మార్కెట్‌ వర్గాలు చాలా ఆశాభావంతో ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 56 శాతం మంది వచ్చే ఆరు నెలలు ఆశాజనకంగానే ఉంటుందని చెప్పారు. జనవరి-మార్చితో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువే. టీకాల అందుబాటు, పెరిగిన టీకాల కార్యక్రమం, లాక్‌డౌన్ల సడలింపు రానున్న రోజుల్లో మార్కెట్‌కు  కలిసి వస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 




కష్టాల్లో హైదరాబాద్‌ రియల్టీ 


ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం హైదరాబాద్‌ రియల్టీకి చుక్కలు చూపింది. మార్చి తర్వాత అమ్మకాలు 90 శాతం వరకు పడిపోయాయి. విచారణలు 30 శాతం తగ్గడంతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 90 శాతానికిపైగా పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ ‘99ఎకరా్‌స.కామ్‌’ ఈ విషయాలు తెలిపింది. కొవిడ్‌ రెండో ఉధృతితో ఏప్రిల్‌లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. జూన్‌ నుంచి పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందని పేర్కొంది.  


Updated Date - 2021-07-23T05:48:00+05:30 IST