హుజూరాబాద్‌లో ఈటల సూపర్ సక్సెస్.. టీఆర్ఎస్ ఓటమికి ఈ నాలుగు అంశాలే అసలు కారణాలు..!

ABN , First Publish Date - 2021-11-02T22:50:24+05:30 IST

హోరాహోరీ పోరులో కమలం వికసించింది. జోరు మీదున్న ఈటలను అందుకోలేక కారు వెనకబడిపోయింది. ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

హుజూరాబాద్‌లో ఈటల సూపర్ సక్సెస్.. టీఆర్ఎస్ ఓటమికి ఈ నాలుగు అంశాలే అసలు కారణాలు..!

హోరాహోరీ పోరులో కమలం వికసించింది. జోరు మీదున్న ఈటలను అందుకోలేక కారు వెనకబడిపోయింది. ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంపై తనకున్న పట్టును ఈటల మరోసారి నిరూపించుకున్నారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటెల రాజేందర్‌కు సొంత నియోజకవర్గంలోనే ఓటమి రూచి చూపించాలని తీవ్రంగా ప్రయత్నించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చివరకు పరాభవమే మిగిలింది. అస్త్రశస్త్రాలన్నీ వాడినా, అధికార బలాన్ని ఉపయోగించినా, పథకాల వ్యూహాలను రచించినా ఈటల గెలుపును మాత్రం టీఆర్ఎస్ అడ్డుకోలేకపోయింది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక పేరును పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నిక అసలు తమ లెక్కలోనే లేదంటూనే ఈటలపై ఈటెల్లాంటి పదునైన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అటు ఈటల కూడా పక్కా వ్యూహంతో అధికార పార్టీని ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పేరు వరకు పనికొచ్చినా.. ఇది పూర్తిగా ఈటల రాజేందర్ వ్యక్తిగత విజయమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీగా టీఆర్ఎస్ అష్టదిగ్భందనం చేసినా.. ఈటల ఎలా ఎదుర్కొన్నారు..? ఆయన గెలుపునకు కారణాలేంటి..? టీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అంశాలేంటన్న దానిపై ప్రత్యేక విశ్లేషణ.


గులాబీ జెండాకు ఓనర్లం.. అనే పదంతో మొదలై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శల వరకు..

మీకు గుర్తుండే ఉంటుంది. ఈటల రాజేందర్ మంత్రిగా టీఆర్ఎస్ సర్కారులోనే ఉన్న కాలంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్య అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. గులాబీ జెండాకు మేం ఓనర్లం అనే పదాన్ని ఈటల రాజేందర్ వాడటం వెనుక ఆయన ఆలోచన ఏంటో కానీ.. ఆ తర్వాతి నుంచే కేసీఆర్‌తో వైరం మరింత పెరిగింది. అప్పటి వరకు చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ.. ఆ తర్వాతి నుంచి మాత్రం పూర్తిగా ఎడమొఖం పెడమొఖంలా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ఆయనపై భూఆక్రమణ కేసులు నమోదవడం వెంటవెంటనే జరిగిపోయాయి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా తనను ఎవరూ టార్గెట్ చేయలేరు అన్న నిర్ణయానికి వచ్చేసిన ఈటల ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసేశారు. బీజేపీలో చేరి.. పోరుకు సై అన్నారు. నేను రెఢీ మీరు రెఢీనా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో లేని వాళ్లను, టీఆర్ఎస్‌పై దాడులు చేసిన వాళ్లను, కేసీఆర్‌ను విమర్శించిన వాళ్లను బంగారు తెలంగాణ పేరుతో పార్టీలోకి రప్పించుకుని.. ఉద్యమ సమయం నుంచి వెన్నంటే ఉన్న ఈటలకు మాత్రం కేసీఆర్ అన్యాయం చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లోకి మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. 


ఈటలపై సానుభూతి

పార్టీ నుంచి ఈటెల బయటకు వచ్చే ముందు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాక ఈటలపై అవినీతి ఆరోపణలు తగ్గిపోయాయి. నిజంగానే అవినీతి చేసి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానికి టీఆర్ఎస్ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఈటలపై ప్రజలకు నమ్మకం, సానుభూతి పెరిగాయి. అంతేకాకుండా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ల పెత్తనాన్ని సహించలేక ప్రశ్నించడం వల్లనే ఇదంతా జరిగిందన్న భావన కూడా ప్రజల్లో కలిగింది. ఈటలను ఒక్కరిని ఓడించడం కోసం హరీశ్ రావు నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హుజూరాబాద్‌లో తిష్ట వేయడం, రాజకీయ వ్యూహాలను రచించడం కూడా ఆ ప్రాంత ప్రజలకు రుచించలేదు. ఒక్కడిని ఓడించడం కోసం ఇంత చేయాలా? అన్న విస్మయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలంతా ఈటలపై మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో ఆయన ఒంటరివారయ్యారన్న భావన కలిగింది. అందుకే కేసీఆర్ పథకాలతో ప్రలోభ పెట్టినా హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే నిలిచారు.


దెబ్బకొట్టిన దళితబంధు

ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించిన దళితబంధు పథకం పెద్దగా కలిసి రాలేదు. ఆ పథకాన్ని ప్రారంభించిన గ్రామంలో కూడా మెజారిటీ రాలేదు. ఓట్ల కోసమే ఈ పథకాన్ని తెచ్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అంతేకాకుండా ఇతర కులాల్లోని నిరుపేదలు ఇలాంటి పథకం తమకోసం ఎందుకు పెట్టడం లేదని నిలదీసినంత పనిచేశారు. ఇది ఓ రకంగా ఇతర వర్గాల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను పెంచింది. అదే సమయంలో హుజూరాబాద్‌లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతోనే దళిత బంధు పథకం పెట్టారనీ.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ పథకం ఊసే ఉండదని కూడా దళితులు బలంగా నమ్మారు. దీనికి బలం చేకూరేలా అకౌంట్లో పడిన డబ్బులు కూడా ఫ్రీజ్ చేయడం వంటివి జరిగాయి. దీంతో తమను పథకం పేరుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చేశారు. రాష్ట్రమంతటా విస్తరిస్తామనీ.. బీసీ బంధు వంటి పథకం కూడా తెస్తామని ఏకంగా సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. 


కాంగ్రెస్ నామమాత్రపు పోటీ.. 

హుజూరాబాద్ పోరులో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతయింది. ఒక రౌండ్‌లో అయితే ఇండిపెండెంట్ అభ్య‌ర్థి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి క‌న్నా ఎక్కువ ఓట్ల‌ను పొందాడు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో అర‌వై వేల ఓట్ల‌ను పొందిన పార్టీ ఇప్పుడు నామమాత్రపు పోటీకే పరిమితమైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని పెట్టి.. దూకుడుగా ప్రచారం చేసి ఉంటే లెక్కలు వేరేగా ఉండేవి. త్రిముఖ పోరు జరిగేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ పని చేయలేదు. త్రిముఖ పోరు జరిగితే అంతిమంగా టీఆర్ఎస్ లాభపడుతుందన్న నమ్మకానికి వచ్చారు. అందుకే బలహీన అభ్యర్థిని నిలబెట్టి నామమాత్రపు ప్రచారంతో ముగించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న కారణంతోనే తాము ఈటలకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈటలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది ఓ రకంగా ప్రతిపక్షాలకు, మరీ ముఖ్యంగా ఈటలకు ప్లస్సయింది.

Updated Date - 2021-11-02T22:50:24+05:30 IST