విపరీతంగా కరోనా కేసులు.. హైదరాబాద్‌కు చేరువలో ఉండడమే కారణమా..?

ABN , First Publish Date - 2020-07-23T17:08:55+05:30 IST

లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20లోపే కాగా సడలింపుల అనంతరం ఈ సంఖ్య వెయ్యి దాటాయి. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. రోజుకు సగటున 16 కేసుల చొప్పున నమోదవుతున్నాయి.

విపరీతంగా కరోనా కేసులు.. హైదరాబాద్‌కు చేరువలో ఉండడమే కారణమా..?

కేసులు పెరుగుతున్నా కదలిక ఏదీ ?

నియంత్రణ చర్యలపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం

పాజిటివ్‌ వివరాలు వైద్య సిబ్బందికి ఆలస్యంగా చేరవేత 

కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లేందుకు జంకుతున్న సిబ్బంది

ప్రజలే జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20లోపే కాగా సడలింపుల అనంతరం ఈ సంఖ్య వెయ్యి దాటాయి. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. రోజుకు సగటున 16 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఓవైపు జిల్లా వణుకుతున్నా పకడ్బందీ నియంత్రణ చర్యలను చేపట్టంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. కేసులు వేగంగా పెరుగుతున్నా మరోవైపు వైద్య సేవలు మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పరీక్షల ఫలితాల కోసం 24 గంటలు వేచి ఉండడం.. ప్రాంతీయ వైద్య సిబ్బందికి పాజిటివ్‌ వ్యక్తి సమాచారం చేరవేయడానికి మరో 24 గంటల సమయం పడుతుండడం.. వారి ప్రాథమిక పరిచయస్తుల గుర్తింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. ఫలితంగా కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు


సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తుంటే నియంత్రణ చర్యలు మాత్రం నిదానంగా సాగుతున్నాయి. అటు అధికారుల్లో పట్టంపులేనితనం, ఇటు వైద్య సేవల్లో నిర్లక్ష్యంతో జిల్లాలో కరోనా కోరలు చాస్తున్నది. టెస్టుల దగ్గరి నుంచి వైద్యం అందించే వరకు నెలకొన్న జాప్యంతో అదుపులోకి రావడం లేదు. వైరస్‌ సోకిన వారు కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నా వారిని నియంత్రించకపోవడంతో వైరస్‌ సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నారన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతున్నది.


హైదరాబాద్‌కు చేరువలో ఉండడమే శాపమా ?

కరోనా విలయతాండవం చేస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌కు చేరువలో ఉండడమే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కేసులు పెరగడానికి కారణమవుతున్నట్లు కనిపిస్తున్నది. గ్రేటర్‌ పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం మండలాల్లో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌లతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నది. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాదాపుగా ఇలాంటి పరిస్థితే సిద్దిపేట జిల్లాలో నెలకొన్నది. ఈ జిల్లాలో గజ్వేల్‌ నియోజకవర్గం గ్రేటర్‌కు ఆనుకుని ఉండడం, నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగడడంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో గత మార్చి 19 నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకు వంద కేసులు నమోదు అవగా ఈ నాలుగైదు రోజుల్లో 150 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం జిల్లా యంత్రాంగాన్ని కుదిపేస్తున్నది. ఇక గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మెదక్‌ జిల్లాలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నది. ఈ జిల్లాలో సగటున రోజుకు ఐదారు కేసులే నమోదు అవుతుండడం ఆ జిల్లా యంత్రాంగానికి ఊరట కలిగిస్తున్నది. 


వెయ్యికిపైగా కేసుల నమోదు

సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య వెయ్యి దాటింది. బుధవారం వరకు జిల్లాలో 1055 కేసులు నమోదయ్యాయి. 779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 247 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన గత మార్చి నుంచి మే 19 వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై కేసులే వచ్చాయి. 29 మంది మృతిచెందారు. లాక్‌డౌన్‌ సడలించినప్పటి నుంచి కరోనా నియంత్రణ చర్యలకు పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి వేగంగా మొదలైంది. ఫలితంగా గత మే 19 తర్వాత నుంచి జూలై 22 వరకు అంటే 65 రోజుల్లో సగటున రోజుకు 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోనైతే దాదాపు అన్ని వార్డులను వైరస్‌ కవర్‌ చేసినట్టయింది. పట్టణంలో 200 మందికిపైగా పాజిటివ్‌ వచ్చింది.


24 గంటల తర్వాత సమాచారం చేరవేత

హైదరాబాద్‌లో శాంపిల్‌ పరీక్షలు నిర్వహించిన 24 గంటల తర్వాత జిల్ల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఫలితాల సమాచారం వస్తుంది. ఇది సంబంధిత ప్రాంతాల మెడికల్‌ ఆఫీసర్లకు పంపించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరో 24 గంటల సమయం తీసుకుంటుండడం విచిత్రంగా ఉన్నది. మొత్తం మీద పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సమాచారాన్ని రెండు రోజులకుకాని సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లకు అందడం లేదు. అదే సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఫోన్‌ చేసి, మీకు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని సమాచారం ఇస్తున్నారు. మీరు రోజు వేడినీళ్లు తాగాలని, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఫోన్‌ పెట్టేస్తున్నారు. ఇక ఆ తర్వాతి నుంచి తన ఆరోగ్య పరిస్థితులను పాజిటివ్‌ వచ్చిన వ్యక్తే చూసుకోవాల్సి ఉంటుంది.


ఇళ్లకు వెళ్లని వైద్య సిబ్బంది

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం తీసుకున్న మెడికల్‌ ఆఫీసర్లు తమ ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్లకు వెళ్లడం లేదు. దాంతో ఏఎన్‌ఎంలు కూడా అటువైపు చూడడం లేదు. పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తే తమకు ఎక్కడ సోకుతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. సంగారెడ్డి పట్టణంలోనే ఇటువంటి పరిస్థితులుంటే ఇక గ్రామాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సంగారెడ్డిలోని సాయినగర్‌, శ్రీనగర్‌లలో పాజిటివ్‌ వచ్చిన వారికి సమాచారం ఇచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 15 రోజులవుతున్నా మెడికల్‌ ఆఫీసర్లు కాని, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు కాని వారి ఆరోగ్య పరిస్థితిని ఒక్కసారైనా తెలుసుకోకపోవడం, మందులు ఇవ్వకపోవడం గమనార్హం. 


ప్రజలే ప్రాణాలు కాపాడుకోవాలి

కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతున్న పరిస్థితుల్లో ప్రజలే ఎవరి ప్రాణాలను వారు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనలిస్తున్నది. దాంతో వైరస్‌ నియంత్రణకు తామేమీ చేయలేమని ఆ శాఖ దాదాపు చేతులెత్తేసినట్టయింది. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు మాస్క్‌ కట్టుకుని రావాలని, భౌతికదూరం పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నారు. ప్రజలు ఇలాంటి నియంత్రణ చర్యలు పాటించకుండా తామే వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మీడియాకు ఇవ్వడం లేదు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారి సమాచారం ఇస్తే తాము అప్రమత్తమై, జాగ్రత్తగా ఉండగలుగుతామని ప్రజలు అంటున్నారు.

Updated Date - 2020-07-23T17:08:55+05:30 IST