సొంత ఇలాకలో ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించరేం..!?

ABN , First Publish Date - 2021-01-08T18:15:35+05:30 IST

సీఎం జగన్ సొంత ఇలాకలో సొంత పార్టీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారా? ..

సొంత ఇలాకలో ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించరేం..!?

సీఎం జగన్ సొంత ఇలాకలో సొంత పార్టీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారా? కొందరు వైసీపీ నేతలు అరాచకాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా? వారి దౌర్జన్యాలను టిడిపి నేతలు ప్రశ్నిస్తే రివెంజ్‌ పాలిటిక్స్‌కు దిగుతున్నారా? చెన్నై వెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవిని పులివెందుల పోలీసులు అత్యవసరంగా ఎందుకు అరెస్ట్ చేశారు? కడప జిల్లాలో 21 మంది టీడీపీ సీనియర్లపై అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ ఇన్‌సైడ్‌ స్టోరీ చూడాల్సిందే. 


మళ్లీ కలకలం..

కడప జిల్లాలో హత్యారాజకీయాలు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం సొంత ఇలాకలో శాంతిభద్రతలు గాల్లో దీపంలా మారుతున్నాయి. కడప జిల్లాకు చెందిన జగన్‌ సీఎం కావడంతో.. జిల్లాలో శాంతిభద్రతలతో పాటు అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు ఆశించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారట. జిల్లాలో అధికారపార్టీ శ్రేణుల అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు, వరుస హత్యలు శ్రుతిమించిపోయాయని విపక్ష నేతలు గగ్గోలుపెడుతున్నారు. వైసిపి నాయకుల దౌర్జన్యాలను టిడిపి నేతలు ప్రశ్నిస్తే..రివెంజ్‌ పాలిటిక్స్‌కు దిగుతున్నారన్న వార్తలు కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.


అక్రమాలు ప్రశ్నిస్తే..!

కడప జిల్లాలో ఇటీవల జరిగిన వరుస హత్యలు, దాడులు వైసీపీ నేతల అరాచకాలకు నిదర్శనమని విపక్షాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి. జమ్మలమడుగు ప్రాంతంలో గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం కోట్లాది రూపాయల అక్రమాలపై ప్రశ్నించిన గురుప్రతాప్ రెడ్డి ఆ తర్వాత దారుణహత్యకు గురయ్యారు. జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు ఈ కిరాతకానికి ఒడిగట్టారన్న ఆరోపణలున్నాయి. మొన్నటికి మొన్న ప్రొద్దుటూరులో వైసిపి శ్రేణులు చేసే అరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తెచ్చిన టిడిపి నేత సుబ్బయ్య క్రూరంగా హతమయ్యారు. పులివెందుల ప్రాంతంలో దళిత మహిళ నాగమ్మను పాశవికంగా కడతేర్చారు. ఈ కేసును పక్కదారి పట్టించారని అడిగినందుకు 21 మంది టీడీపీ సీనియర్లపై పులివెందుల పోలీసులు ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. ఈ కేసులో టిడిపి రాష్ట్ర మహిళాధ్యక్షురాలు అనిత, ఎమ్మెల్సీ బిటెక్ రవి, ఎస్సీ ఎస్టీ సెల్ రాజు ఉన్నారు.


ఇప్పుడెందుకిలా..!?

కడప జిల్లాలో అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ శ్రేణులపై అరాచకాలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలో 2018లో ఇరువర్గాల మధ్య జరిగిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే బిటెక్ రవిపై అభియోగాలు ఉండటంతో..ఆ కేసును రెండేళ్ళ తరువాత  ఇప్పుడు తిరగతోడారు. బిటెక్ రవిని పులివెందుల పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల జిల్లాలో హత్యకు గురైన వారి కుటుంబాలను టీడీపీ నేతలు పరామర్శిస్తూ..వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. న్యాయం కోసం బాధిత కుటుంబాల తరుపున పోరాడుతున్న వారిని వైసిపి నేతలు టార్గెట్‌ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పాత కేసు తిరగదోడి బిటెక్ రవిని జైలుకు పంపడమే ఇందుకు ఉదాహారణగా చెబుతున్నారు.


జగన్ స్పందించరా..!?

కడప జిల్లాలో ఫ్యాక్షన్‌ హత్యలు, దాడులు తగ్గాయని జనం సంతోషిస్తున్న క్రమంలో.. హత్యారాజకీయాలు వేళ్లూనుకోవడం స్థానికంగా భయాందోళన సృష్టిస్తుందట. సీఎం సొంత ఇలాకలో శాంతిభద్రతలు క్షీణించడం వైసీపీ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉందని వారు ఆక్షేపిస్తున్నారట. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి కడప జిల్లాలో జరుగుతున్న హత్యారాజకీయాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.



Updated Date - 2021-01-08T18:15:35+05:30 IST