ఓబీసీల తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-01-13T09:19:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నెలరోజుల్లో ఆరంభం కాబోతుండగా, యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ముఖ్యుడైన స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేయడం భారతీయ జనతాపార్టీకి పెద్ద ఎదురుదెబ్బ...

ఓబీసీల తిరుగుబాటు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నెలరోజుల్లో ఆరంభం కాబోతుండగా, యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ముఖ్యుడైన స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేయడం భారతీయ జనతాపార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఆయనతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాచేయడంతో పాటు, ఇంకో ఓబీసీ నాయకుడైన దారాసింగ్ చౌహాన్ కూడా మంత్రిపదవిని వదిలేశారు. బీజేపీనుంచి వలసలూ రాజీనామాలు ఇక్కడితో ఆగవనీ, రోజూ ఒకరిద్దరు మంత్రులు రాజీనామాలు చేస్తారని ఇప్పటికే యోగితో విభేదించి దూరమైన ఓబీసీ నాయకుడు రాజ్‌భర్‌ జ్యోతిషం చెబుతున్నారు. విపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు అధికారపక్షాన్ని ఈ రీతిలోనే దెబ్బతీసే బీజేపీ ఇప్పుడు అదేవేడిని యూపీలో ఎదుర్కొంటున్నది.


ఐదేళ్ళక్రితం యూపీ ఎన్నికలు మతం ఆధారంగా జరిగితే, ఈ మారు అవి కులం ప్రాతిపదికన జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. యూపీ ఎన్నికలు ఎప్పుడూ కూడా ప్రధానంగా కులమతాలమీదే ఆధారపడతాయి. ఈ మారు మండల్ శక్తుల సంలీన విలీనాలు, మతాధారిత పాలనమీద వాటి తిరుగుబాటు మౌర్య, చౌహాన్‌ల నిష్క్రమణతో విస్పష్టంగా కనిపిస్తున్నదని అంటున్నారు. యూపీ రాజకీయాల్లో స్వామి ప్రసాద్ మౌర్య ప్రభావం చిన్నదేమీ కాదు. మొదట బీఎస్పీతో ఉండి, మాయావతి వరుస ఓటముల అనంతరం 2017 అసెంబ్లీ ఎన్నికలముందు ఆయన బీజేపీతో చేతులు కలిపాడు. బీజేపీ తన అగ్రకుల ఓట్లతో పాటు ఓబీసీ ఓట్లనూ కొల్లగొట్టడానికి ఈ మౌర్యకులనాయకుడి ప్రవేశం ఉపకరించింది కనుకనే, కేబినెట్ మంత్రిహోదానిచ్చి గౌరవించింది. మొత్తం యూపీ జనాభాలో ఓబీసీలు నలభైశాతం వరకూ ఉంటే, యాదవులు, కుర్మీల తరువాత స్థానంలో అధికసంఖ్యాకులుగా ఉన్నది ఈ మౌర్య కులస్థులే. కార్యక్షేత్రం కుశీనగర్ లోనే కాక, ఆయన ప్రభావం కనీసం మరో నాలుగుజిల్లాల్లో విస్తరించిందని, యూపీలోని కనీసం వంద అసెంబ్లీ స్థానాల్లో ఆయన తన కులస్థులను ప్రభావితం చేయగలడని అంటారు. మౌర్య కులస్థులకు చెందిన మహాన్ దళ్ అనే ఓ చిన్న పార్టీతో గతంలోనే చేతులు కలిపిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు ఓ పెద్దనాయకుడిని ఆకర్షించడం ద్వారా యోగికి పెద్ద దెబ్బే కొట్టారు. అలాగే, మూడుశాతం జనాభా ఉన్న మరో ఓబీసీ కులం ‘నోనియా’ నాయకుడైన దారా సింగ్ చౌహాన్ ను కూడా బీజేపీకి దూరం చేయగలిగారు అఖిలేశ్. 


తన రాజకీయ భవిష్యత్తును నిర్థారించే ఈ ఎన్నికల విషయంలో అఖిలేశ్ చాలాకాలంనుంచీ జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ఓబీసీ కులాలకు చెందిన పార్టీలతోనూ, నాయకులతోనూ చేతులు కలుపుతున్నారు. ఐదేళ్ళక్రితం బీజేపీ విజయంలో ప్రముఖపాత్ర పోషించిన జాట్లు ఇప్పుడు ఆ పార్టీమీద ఆగ్రహంగా ఉన్నారు. రైతు ఉద్యమంతో బీజేపీకి దూరమైన జాట్ల పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌తో ఇప్పటికే అఖిలేశ్ చేతులు కలిపారు. ఓంప్రకాశ్ రాజ్‌భర్ అనే మరో ఓబీసీ కుల నాయకుడూ, ఆయన పార్టీ కూడా ఇప్పుడు అఖిలేశ్ పక్షాన ఉన్నది. 


బీజేపీ కూడా కొన్ని ఓబీసీ పార్టీలతో చేతులు కలిపినప్పటికీ, కీలకమైన ఓబీసీ నాయకులు పార్టీనుంచీ, ప్రభుత్వం నుంచీ ఈ ఎన్నికలవేళ వెళ్ళిపోతే తట్టుకొని నిలబడటం కష్టమే. పార్టీని విడిచిపోతున్నవారంతా బీజేపీని దళిత, బీసీ, రైతు వ్యతిరేక పార్టీగా విమర్శిస్తున్నారు. యోగి వ్యవహారశైలి, పనితీరు సరిగా లేదని అధిష్ఠానం దూతకు చెప్పడానికి మౌర్య గతంలో ప్రయత్నించినా పార్టీ అధిష్ఠానం యోగిని దారికి తేలేకపోవడంతో మౌర్య సరైన సమయంలో పెద్ద దెబ్బతీశారని అంటారు. యాదవుల పార్టీ అన్న విమర్శను కొంతైనా దూరం చేసుకొనేందుకు వరుసగా చేరుతున్న ఈ ఓబీసీ నాయకులు సమాజ్‌వాదీకి ఉపకరిస్తారు. ఇంకా ఎంతోమంది మంత్రులు రాజీనామాబాటలో ఉన్నారన్న వ్యాఖ్యల్లో నిజమెంతో తెలియదు కానీ, నష్టనివారణకు బీజేపీ పెద్దలు సత్వరమే నిర్దిష్ట చర్యలు చేపట్టకతప్పదు. యూపీ ఎన్నికలను సార్వత్రక ఎన్నికలకు సెమీఫైనల్‌గా చూస్తూ, నేడు యోగి, రేపు మోదీ అంటున్న అమిత్ షా దానిని నిజం చేయడానికి ఏ అస్త్రాలు ప్రయోగిస్తారో, ఎన్ని వ్యూహాలు పన్నుతారో చూడాలి.

Updated Date - 2022-01-13T09:19:27+05:30 IST