YS Jagan సొంత జిల్లాలో.. మేయర్‌పై తిరుగుబాటు.. కార్పొరేటర్లు గరం గరం.. మళ్లీ ఈ ట్విస్టేంటి..!

ABN , First Publish Date - 2021-12-07T19:23:09+05:30 IST

వైసీపీ కార్పొరేటర్లు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా..? చిన్న పని కావాలన్నా మేయర్‌ చెబితేనే చేస్తామంటే...

YS Jagan సొంత జిల్లాలో.. మేయర్‌పై తిరుగుబాటు.. కార్పొరేటర్లు గరం గరం.. మళ్లీ ఈ ట్విస్టేంటి..!

  • అంతా మేయరైతే ఇక మేమెందుకు 
  • డివిజన్‌లో చిన్న పనికైనా కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలేనా!
  • ఈ పదవుల్లో మేము ఎందుకు..?
  • డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో..
  • 29 మంది కార్పొరేటర్ల సమావేశం
  • డిప్యూటీ సీఎం ఎదుట రాజీ పంచాయితీ
  • చివరికి కమిషనరే సమస్య అయినట్లుగా చిత్రీకరణ

కడప జిల్లా : కార్పొరేషన్‌కు చెందిన వైసీపీ కార్పొరేటర్లు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా..? చిన్న పని కావాలన్నా మేయర్‌ చెబితేనే చేస్తామంటే అలాంటప్పుడు మేమెందుకు డివిజన్‌లో అని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యేందుకు రెడీ అవుతున్నారా..? సోమవారం జరిగిన పరిణామం చూస్తే భవిష్యత్తులో ఏమో గుర్రం ఎగురావచ్చన్నట్లుగా తిరుగుబాటు వస్తుందేమోనన్న గుసగుసలు చర్చకు తావిచ్చింది. కార్పొరేషన్‌లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా 48 మంది వైసీపీ కార్పొరేటర్లే, టీడీపీ నుంచి ఒకరు, స్వతంత్య్ర అభ్యర్థి మరొకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కార్పొరేషన్‌లో అధికారుల తీరు, బిల్లుల చెల్లింపు, పనుల కే టాయింపులో కావాల్సిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నా రనే అసంతృప్తి పలువురి కార్పొరేటర్లలో ఉండేది. అధికారులు కూడా కార్పొరేటర్లకు సరైన గౌరవం ఇవ్వలేదనే వాదన వారిలో ఉంది.


అయితే పారిశుధ్య కార్మికుల విషయంలో కార్పొరేటర్‌ రామలక్ష్మణ్‌రెడ్డి, కమిషనర్‌ రంగస్వామి మధ్య జరిగిన మాటలు కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశానికి దారి తీసినట్లు తెలుస్తోంది. అధికారులు సరిగా కార్పొరేటర్లకు గౌరవం ఇవ్వలేదంటూ సమావేశం కావాలని కార్పొరేటర్లు నిర్ణయించుకుని కార్పొరేషన్‌లోని నిత్యానందరెడ్డి ఛాంబర్‌లో సమావేశానికి హాజరయ్యారు. 29 మంది కార్పొరేటర్లు హాజరైనట్లు తెలుస్తోంది. సమావేశంలో పలు కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తినట్లు తెలిసింది. వరదలు వచ్చి ఆయా డివిజన్లలో మోటార్లు దెబ్బతిన్నా, డ్రైనేజీ కాలువలు పూడిపోయినా, ఎక్కడన్నా డస్టు పనులు చేయాలన్నా కూడా కార్పొరేటర్లు చేయలేని పరిస్థితి నెలకొంది. ఏ పని చేయాలన్నా మేయర్‌ చెబితేనే చేస్తామని కమిషనర్‌ అంటున్నారు. 


కనీసం 5 వేల రూపాయల పని కూడా మేయర్‌ చెప్పాలంటున్నారు. అలాంటప్పుడు ఆ డివిజన్లలో కార్పొరేటర్లు ఉండడం ఎందుకు. చేసిన పని పై నమ్మకం లేకుంటే వెళ్లి పరిశీలించండి పనిచేస్తే బిల్లు ఇవ్వండి అంతే తప్ప అన్నింటికి మేయర్‌ అనుమతే కావాలంటే డివిజన్లలో కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలేనా అంటూ పలువురు కార్పొరేటర్లు ఆక్రోశం వెల్లగక్కినట్లు తెలిసింది. ఇటీవల వర్షపు నీటి మళ్లింపు కోసం పూడిక తీత పనులు, మిగతా పనులు కొందరే చేశారు. వారు మాత్రమే చేయాలా మిగతా వారు చేయకూడదా అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో అధికారుల తీరును ఎండగట్టాలని చూసినప్పటికీ అయితే మిగతా కార్పొరేటర్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెల్లగక్కడంతో పరిస్థితి చెయి దాటుతుందని గమనించి కొందరు కార్పొరేటర్లు మేయర్‌ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది.


దీంతో హుటాహుటిన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కార్యాలయానికి రావాలని ఆదేశాలు రావడంతో అక్క డ డిప్యూటీ సీఎం అంజాద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు, కమిషనర్‌ రంగస్వామిల ఎదుట చర్చ జరిగింది. కార్పొరేటర్లు పలు సమస్యలను ఇక్కడ ఎకరువు పెట్టారు. సమస్యలకు కారణం కమిషనర్‌ రంగస్వామే అన్న విధంగా కొందరు చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో కమిషనర్‌ నొచ్చుకున్నట్లు సమాచారం. ఇక నుంచి ఇలా జరగదని కమిషనర్‌తో చె ప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కార్పొరేటర్ల సమావేశం కార్పొరేటర్ల అసంతృప్తి, ఆగ్రహం, కార్పొరేషన్‌‌పై కొందరి పెత్తనాన్ని జీర్ణించుకోనట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-12-07T19:23:09+05:30 IST