ఎక్కడైనా.. ఎప్పుడైనా!?

ABN , First Publish Date - 2021-06-21T05:16:18+05:30 IST

అధికారం మనదే.. ఏం చేసినా అడిగేవారెవరు..!? అనుకున్నారో ఏమో!? వారు వీరు అంతా కలిసి మాఫియాగా ఏర్పడ్డారు. ప్రభుత్వ, అటవీ శాఖ భూములు, చెరువులు, వాటి కరకట్టలు, కొండలు, తిప్పలు ఇలా ఖాళీ భూములు, స్థలాలపై కన్నేశారు.

ఎక్కడైనా..   ఎప్పుడైనా!?
ముసునూరులో గ్రావెల్‌, మట్టితో పూడుస్తున్న బొంతరాయి గని గుంటలు

రెచ్చిపోతున్న గ్రావెల్‌ మాఫియా

భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు

కరిగిపోతున్న కొండలు, తిప్పలు

చెరువుల్లో ప్రమాదకరస్థితిలో గుంతలు

టిప్పర్ల కొద్దీ రవాణా.. 

తెరవెనుక అధికార పార్టీ నేతలు


అధికారం మనదే.. ఏం చేసినా అడిగేవారెవరు..!? అనుకున్నారో ఏమో!? వారు వీరు అంతా కలిసి మాఫియాగా ఏర్పడ్డారు. ప్రభుత్వ, అటవీ శాఖ భూములు, చెరువులు, వాటి కరకట్టలు, కొండలు, తిప్పలు ఇలా ఖాళీ భూములు, స్థలాలపై కన్నేశారు. ఫలాన చోట గ్రావెల్‌ ఉందని సమాచారం అందితే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. భారీ యంత్రాలతో ఇష్టం వచ్చినట్టు రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల కొద్దీ గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారికి అభివృద్ధి మాట చెబుతున్నారు. మాఫియాపై తిరగబడ్డ అధికారులను నయానో భయానో లొంగదీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి బృందం నిఘా పెట్టింది. ఆ వివరాలు..

- ఆంధ్రజ్యోతి బృందం

 

బుచ్చిరెడ్డిపాళెం : కొంతమంది ప్రజాప్రతినిధులు, బడా నేతలు, నాయకులకు గ్రావెల్‌ మేతగా మారింది. చెరువులు, వాటి కరకట్టలు, కొండలు, తిప్పలు, ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో భారీ ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు జరిపి గ్రావెల్‌ను తరలిస్తూ కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నారు. 10 నుంచి 20 అడుగుల లోతున మట్టి తవ్వకాలు జరుపుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం దాల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంతోపాటు దామరమడుగు, రేబాల, చెల్లాయపాళెం, కాగులపాడు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు లైఔట్లే లక్ష్యంగా కొంతమంది గ్రావెల్‌, మట్టి తోలకందారులు, వాహనదారులు, రియల్టర్లతో చేతులు కలిపి నిత్యం వేలాది ట్రిప్పుల గ్రావెల్‌ రవాణా చేస్తున్నారు. దగదర్తి మండలం చెన్నూరు వద్ద ఓ చెరువులో, బుచ్చి మండలంలోని కనిగిరి రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల నుంచి గ్రావెల్‌ను విస్తృతంగా రవాణా చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా కనిగిరి రిజర్వాయర్‌ నుంచి బుచ్చి నగర పంచాయతీ,  రేబాల, దామరమడుగులోని హైస్కూలు వెనుక ఓ లేఔట్‌, ఆ గ్రామ పరిసరాలలో పలు లేఔట్లు, గీతాంజలి ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని ఓ పెద్ద లేఔట్‌తోపాటు వెంకటేశ్వరపురం వరకు ఎక్కడ చూసినా ప్రైవేటు లేఔట్లు ఎర్రగా గ్రావెల్‌తో కళకళలాడుతున్నాయి.  గ్రావెల్‌ తరలించే వాహనాలను బుచ్చి పెద్దూరు బెస్తపాళెం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ   వారిపైనే కేసులు పెడతామని బెదిరించడంపై విమర్శలు రేగుతున్నాయి. భారీ వాహనాల దాటికి రోడ్డుపై పెద్ద గుంతలు, మలిదేవి కాలువ వంతెన, రామాచంద్రాపురం వద్ద వంతెన పగుళ్లిచ్చి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.   

వెంకటాచలం : మండలంలోని కంటేపల్లి, సర్వేపల్లి రిజర్వాయర్‌, సర్వేపల్లి, గొలగమూడి, అనికేపల్లి, గూడ్లూరువారిపాళెం, ఎర్రగుంట, అనుపల్లిపాడు, ఇడిమేపల్లి, శ్రీకాంత్‌ కాలనీ, కసుమూరు, వెంకటాచలం తదితర గ్రామాల్లో గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే తెరవెనుక ఉండి ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తవ్వకాల మూలంగా ఆయా గ్రామాల్లో సుమారు 10 అడుగుల మేరకు లోతైన గొంతలు ఏర్పడ్డాయి.  

పొదలకూరు : అధికారుల ఉదాసీనతను అదునుగా చేసుకొని అక్రమార్కులు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. కొండలను తొలచి తిప్పలను చదును చేస్తున్నారు. మండలంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద సుమారు 10 నుంచి 15 అడుగుల లోతులో మూడు ఎకరాల మేర తిప్పపై గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడే ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్ల ద్వారా ఈ గ్రావెల్‌ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తాటిపర్తికి ఆనుకొని ఉన్న గొల్లకందుకూరు తిప్పను తొలిచి, క్రమేపి చదును చేస్తున్నారు. మండలంలోని చాటగొట్ల తిప్పలో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి దానిని ఆనుకొని ఉన్న ఓ లేఅవుట్‌కి వందల ట్రిప్పులు తోలారు.  నందివాయి, బిరదవోలు తిప్పలు రోజురోజుకు కరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇష్టారీతిగా తవ్వేస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. వర్షాలకు నీటితో నిండి అవి కాస్త ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మండలంలో  తరలిస్తున్న గ్రావెల్‌ దూరం. ప్రాంతాన్ని బట్టి రేటును ట్రాక్టర్‌ రూ.400 నుంచి 600 వరకు రూ.1600 నుంచి 2వేల వరకు గుట్టుచప్పుడు కాకుండా తోలుతున్నారు. 

వరికుంటపాడు : అధికార పార్టీ నేతల కనుసన్నల్లో  గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కనియంపాడు చెరువులో ఇటీవల గోరంత అనుమతితో కొండంత గ్రావెల్‌ను ఇటుక బట్టీల తరలింపునకు సమీప దుత్తలూరు మండలం నందిపాడుకు చెందిన అధికార పార్టీ నాయకుడు ప్రయత్నించడంతో కొంతమంది గ్రామస్ధులు వాహనాలను అడ్డుకున్నారు. అయితే గ్రామాభివృద్ధి కోసం రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఆ వ్యక్తి అంగీకరించడంతో అంతా గప్‌చుప్‌ అయ్యారు. అలాగే విరువూరు గ్రామ శివారు ప్రాంతంలో యంత్రాల ద్వారా గ్రావెల్‌ తవ్వి ప్రకాశం జిల్లా పామూరులోని లే అవుట్లకు తరలిస్తున్నారు. సాతువారిపల్లి చెరువు నుంచి సైతం ఏళ్ల తరబడి ఇటుకబట్టీలకు గ్రావెల్‌ తరలుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే మరికొన్ని గ్రామాల్లో  అఽభివృద్ధి పనుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  

కావలి రూరల్‌ : మండలంలోని ఆర్సీపాలెం, కొత్తపల్లి, ముసునూరు, ఆనెమడుగు, ఆముదాలదిన్నె తదితర గ్రామాల్లో ఎక్కడ గ్రావెల్‌, మట్టి కనిపించినా లే అవుట్ల నిర్మాణాలకు తరలించుకుపోతున్నారు. ఆర్సీపాలెంలో 300 క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఇచ్చినా రాత్రింబవళ్లు అనుమతులకు మించి తరలిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి కొత్తూరు చెరువులో మట్టిని స్థానికులు ఇళ్లకు తోలుకోబోగా అనుమతులు లేకుండా తరలించరాదని అడ్డుకున్న అధికార నేతలు వారే శనివారం పాఠశాల ఆవరణలో మట్టిని తోలించే ప్రయత్నం చేశారు. దాంతో స్థానికులు అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత పట్టణ పరిధిలోని ముసునూరు తిప్ప మీద ఉన్న ప్రభుత్వ స్థలంలోని గ్రావెల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా తుమ్మలపెంట రోడ్డులో వెంచర్లకు తోలుతున్నారు. అలాగే ముసునూరులోని రైల్వేట్రాక్‌ పడమర వైపున ఉన్న సుమారు 30 అడుగుల బొంతరాయి గనుల గుంతలను పూడి ్చ లేఅవుట్లు వేసేందుకు టిప్పర్లతో  తోలుతున్నారు. ఆముదాలదిన్నె, ఆనెమడుగు తదితర ప్రాంతాల చెరువుల నుంచి అక్రమంగా మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు.  

అల్లూరు : మండలంలో గ్రావెల్‌ లభ్యత ప్రాంతమంటే నార్తుఆములూరు అని చెబుతుంటారు. కానీ అక్కడ ప్రస్తుతానికి గ్రావెల్‌ లభ్యత ముగిసినట్టే. బడా నాయకుల అండదండలతో లేఅవుట్లను సాకుగా చూపి గ్రావెల్‌ మొత్తం తవ్వేశారు. చివరకు ఆర్డీవో స్థాయి అధికారులు సైతం చేతులు కట్టుకుని చూస్తుండిపోయారే తప్ప ఎక్కడా ఆక్షేపణలు, ఆంక్షలు విధించిన దాఖలాలూ లేవు. నార్తుఆములూరు ప్రాంతంలో గ్రావెల్‌ నాణ్యమైనదిగా చెబుతుంటారు. టిప్పరు ధర రూ.4 వేలు వంతున దూరాన్ని బట్టి విక్రయించారు. ఈ నేపథ్యంలో కొన్ని వేల ట్రిప్పులు ఇతర ప్రాంతాలకు తరలించేశాయి. దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే గ్రావెల్‌ తరలింపులో కనీసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, మైనింగ్‌ అధికారుల చర్యలు కానీ లేకపోవడం గమనార్హం. 

ఇందుకూరుపేట : మండలంలో  ఇసుక,  గ్రావెల్‌  కోసం విస్తృత తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో పెన్నా పొర్లు కట్టల స్వరూపమే లేదు. సెబ్‌ అధికారులు మాత్రం కేవలం నిమిత్త మాత్రంగా ఉంటున్నారు. నదిలో ఎంతలోతు, ఎంతమేరకు తవ్వకాలు, ఎంత సరకు అనేదాని మీద ఖచ్చితమైన నియమాలు, నిబంధనలు లేవని, అవి ఏమైనా ఉంటే గనుల శాఖ చూస్తుందని సెబ్‌ అధికారులు తెలిపారు. 

సంగం : గ్రావెల్‌ను అక్రమంగా లేఅవుట్‌లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్ర మార్కులు. సంగం గ్రామానికి సమీపంలో 252 సర్వే నెంబరులో సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న తిరుమనతిప్ప కొండను గ్రావెల్‌ కోసం ఎక్స్‌కవేటర్లతో కరిగించేస్తున్నారు. ఇటీవల సంగంలో అనుమతి లేని ఓ లే అవుట్‌కు అక్రమంగా గ్రావెల్‌ తరలించి చదును చేశారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హెచ్చరించి వదిలేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన గ్రావెల్‌ తరలిపోతోంది.  

గూడూరురూరల్‌ : గూడూరు మండలంలోని గాంధీనగర్‌ ఇందిరమ్మకాలనీ సమీపంలో రాత్రివేళల్లో కొందరు గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్‌ తవ్వి ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న వీఆర్వోపై దాడి జరిగింది. అప్పట్లో అధికారులు చర్యలు తీసుకోవడంతో కొన్ని రోజులు అక్రమ రవాణా ఆగిపోయినా మళ్లీ కొనసాగుతోంది. 

చిల్లకూరు : ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా కొందరు యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నారు. ముత్యాలపాడు, తొణుకుమాల, తిప్పగుంటపాళెం, కలువకొండ, ఉడుతావారిపాళెం, తీపనూరు, అంకులపాటూరు తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. శనివారం ముత్యాలపాడు గ్రామ సమీపంలో అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వాహనాలపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. 



Updated Date - 2021-06-21T05:16:18+05:30 IST