మామిడి మజా!

ABN , First Publish Date - 2020-05-23T05:30:00+05:30 IST

రోజూ మామిడి పండ్లు తింటూనే ఉంటారు. మ్యాంగో జ్యూస్‌ తాగుతూనే ఉంటారు. అలా కాకుండా మామిడి పండ్లతో ఛీజ్‌ కేక్‌, ఐస్‌క్రీమ్‌, రైతా, పనీర్‌ రోల్స్‌... ఇలా కాస్త వెరైటీగా రెసిపీలు తయారు చేసుకుని టేస్ట్‌ చేస్తే ఆ మజాయే...

మామిడి మజా!

రోజూ మామిడి పండ్లు తింటూనే ఉంటారు. మ్యాంగో జ్యూస్‌ తాగుతూనే ఉంటారు. అలా కాకుండా మామిడి పండ్లతో ఛీజ్‌ కేక్‌, ఐస్‌క్రీమ్‌, రైతా, పనీర్‌ రోల్స్‌... ఇలా కాస్త వెరైటీగా రెసిపీలు తయారు చేసుకుని టేస్ట్‌ చేస్తే ఆ మజాయే వేరు. మరి మీరూ ట్రై చేయండి.





ఛీజ్‌ కేక్‌

కావలసినవి: బిస్కెట్లు - 125 గ్రాములు, వెన్న - 60 గ్రాములు, పనీర్‌ - 50 గ్రాములు, మామిడిపండు గుజ్జు - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, జున్ను - రెండు కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక స్పూన్‌.


తయారీ: బిస్కెట్లను పొడిగా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

  1. వెన్నను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి, బిస్కెట్ల పొడిలో వేసి కలుపుకోవాలి.
  2. ఈ మిశ్రమాన్ని కొద్దిగా మందపాటి, వెడల్పాటి పాత్రలో సమంగా వేసి కొద్దిగా ఒత్తాలి. (కేక్‌ తయారుచేసే పాత్ర తీసుకోవాలి)
  3. తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి.
  4. మిక్సీలో పనీర్‌, జున్ను వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి.
  5. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి కలుపుకోవాలి.
  6. తరువాత అందులో మామిడిపండు గుజ్జు వేసి కలియబెట్టుకోవాలి.
  7. ఈ మామిడిపండు మిశ్రమాన్ని బిస్కెట్‌ పొడి మిశ్రమంపై పోసి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి.
  8. ఇప్పుడు మరొకపాత్రలో కొద్దిగా మామిడిపండు గుజ్జు, పంచదార, నీళ్లు తీసుకుని స్టవ్‌పై మరిగించాలి.
  9. ఈ మిశ్రమాన్ని పైన ఒక లేయర్‌గా పోయాలి. అంతే... ఎంతో రుచికరమైన మ్యాంగో ఛీజ్‌ కేక్‌ రెడీ.




మ్యాంగో  ఐస్‌క్రీమ్‌


కావలసినవి: పాలు - ఒకకప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, మామిడిపండు ముక్కలు - ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - ఒక కప్పు.


తయారీ: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకొని, అందులో కస్టర్డ్‌ వేసి కలుపుకొని పక్కన  పెట్టుకోవాలి.

  1. మిగిలిన పాలను మరొక పాత్రలో తీసుకొని పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగి, పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ మిశ్రమం వేసి కలుపుకోవాలి. 
  2. కాసేపు మరిగిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా వేసి కలుపుకోవాలి. 
  3. మూత గట్టిగా ఉండే పాత్రలోకి మిశ్రమాన్ని మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. 
  4. కాసేపయ్యాక ఫ్రిజ్‌లో నుంచి తీసి బాగా కలియబెట్టి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి మ్యాంగో ఐస్‌క్రీమ్‌ సర్వ్‌ చేయాలి.




రైతా


కావలసినవి: మామిడిపండ్లు - రెండు, పెరుగు - రెండు కప్పులు, పంచదార - రెండు స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్‌, 


తయారీ: మామిడిపండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

  1. ఒక పాత్రలో పెరుగు, పంచదార తీసుకోవాలి. పంచదార కరిగే వరకు స్పూన్‌తో కలియబెట్టాలి.
  2. ఇప్పుడు అందులో మామిడిపండు ముక్కలు వేసి కలుపుకోవాలి.
  3. మరొక పాత్ర తీసుకొని స్టవ్‌పై పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి.
  4. ఎండుమిర్చి, మెంతులు వేసి మరికాసేపు వేగించాలి.
  5. ఈ పోపు మిశ్రమాన్ని మామిడిపండు రైతాపై పోసి కలుపుకోవాలి.
  6. కొన్ని మామిడి ముక్కలతో గార్నిష్‌ చేసుకోవాలి.
  7. ఫిజ్‌లో పెట్టుకుని కూల్‌ మ్యాంగో రైతాను సర్వ్‌ చేసుకోవాలి.




మ్యాంగో పనీర్‌ రోల్స్‌


కావలసినవి

మామిడిపండు - ఒకటి, పనీర్‌ - అర కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌ - గార్నిష్‌ కోసం.


తయారీ

  1. ముందుగా ఒక పాత్రలో పనీర్‌ను పొడిగా చేయాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  2. మామిడిపండు తొక్క తీసి కొద్దిగా సన్నని, వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  3. ఒక ప్లేట్‌లో ఆ ముక్కలు పెట్టి, ప్రతీ ముక్కపై కొద్దిగా పనీర్‌ మిశ్రమాన్ని పెట్టుకుంటూ రోల్‌ చేసుకోవాలి.
  4. చివరగా సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.
  5. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అయ్యాక సర్వ్‌ చేసుకోవాలి.





క్రంబ్‌ బార్స్‌


కావలసినవి

మామిడిపండ్లు - మూడు, పంచదార - ఐదు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్న పిండి - అర టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, ఉప్పు - పావు టీస్పూన్‌, వెన్న - ముప్పావు కప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌.


తయారీ

  1. ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి.
  2. మామిడిపండును ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. 
  3. తరువాత అందులో మొక్కజొన్నపిండి, పంచదార వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. మరొక పాత్రలో పిండి, బేకింగ్‌పౌడర్‌, తగినంత ఉప్పు తీసుకోవాలి.
  5. వెన్నను ముక్కలుగా కట్‌ చేసి పిండిలో వేసి కలపాలి.
  6. ఇప్పుడు కోడిగుడ్డు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేయాలి. బాగా కలియబెట్టాలి. మిశ్రమం పొడిపొడిగా తయారవుతుంది.
  7. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌పై ఒక లేయర్‌లా వేసుకోవాలి.
  8. దానిపై మామిడిపండు మిశ్రమాన్ని అంతటా సమంగా పడేలా పోయాలి.
  9. పైన కొద్దిగా పొడి పిండి మిశ్రమాన్ని చల్లాలి.
  10. ఓవెన్‌లో 40 నిమిషాల పాటు బేక్‌ చేయాలి.
  11. తరువాత ఓవెన్‌లో నుంచి తీయాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST