ఆటోను ఢీకొట్టిన ఆడి కారు... భయానకంగా దృశ్యాలు

ABN , First Publish Date - 2021-06-29T18:25:37+05:30 IST

నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపి... ఓ వ్యక్తి మృతికి కారణమైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోను ఢీకొట్టిన ఆడి కారు... భయానకంగా దృశ్యాలు

హైదరాబాద్: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపి... ఓ వ్యక్తి మృతికి కారణమైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌లోని మైహోం అబ్రా అపార్ట్‌మెంట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆడి కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. దాని దెబ్బకు ఆటో ఒక్కసారి ముందుకు ఎగిరి... గింగిరాలు తిరుగుతూ దూరంగా పడిపోయింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. 


ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. సీసీ కెమరాలను పరిశీలించి పోలీసులు కారు నడిపిన వ్యక్తి ఉప్పల్‌లోని విజయ్‌పురి కాలనీలో ఉండే వాకిటి రఘునందన్ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డి(24)గా గుర్తించారు. ఇతను గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి స్నేహితుడు పి.ఆశిష్‌తో కలిసి కారులో రాయదుర్గంలో వచ్చాడు. అక్కడే తెల్లవారుజాము వరకు మద్యం తాగి ఉదయం ఇంటికి బయలు దేరారు. మత్తులో కారు నడిపిన సుజిత్..  అతివేగంతో నిర్లక్ష్యంగా ఆటోను ఢీకొట్టాడు. ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో కారు నంబర్ ప్లేట్లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. 


అయితే... ఈ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు తండ్రి సినీ ఫక్కీలో ప్రయత్నించాడు. తమ డ్రైవర్‌ను తీసుకు వెళ్లి పోలీసుల ముందు నిలబెట్టాడు.  కారు నడిపింది తన కుమారుడు కాదని తన వద్ద పనిచేసే డ్రైవర్ అని రఘునందన్ రెడ్డి డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అయితే అతని మాటలను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అందులో దృశ్యాల ఆధారంగా సుజిత్ రెడ్డే కారు నడిపాడని, అతనితో పాటు కారులో ఉన్నది పి.ఆశిష్ అని నిర్ధారించారు. ఈ మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 



Updated Date - 2021-06-29T18:25:37+05:30 IST