ఈ బ్యాట్లకు గుర్తింపు కష్టమే!

ABN , First Publish Date - 2021-05-18T06:12:08+05:30 IST

క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం వెదురు బ్యాట్లపై చర్చ జరుగు తోంది. దాని రూపకర్త లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దర్శి ల్‌ షా. ‘కేంబ్రిడ్జి సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ మెటీరియల్‌ ఇన్నోవేషన్‌’లో పరిశోధ కుడిగా పనిచేస్తున్న...

ఈ బ్యాట్లకు గుర్తింపు కష్టమే!

  • క్రికెట్‌ చట్టాలు ఒప్పుకోవంటున్న ఎంసీసీ
  • వెదురు బ్యాట్‌ రూపకర్త మనోడే


న్యూఢిల్లీ: క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం వెదురు బ్యాట్లపై చర్చ జరుగు తోంది. దాని రూపకర్త లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దర్శి ల్‌ షా. ‘కేంబ్రిడ్జి సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ మెటీరియల్‌ ఇన్నోవేషన్‌’లో పరిశోధ కుడిగా పనిచేస్తున్న 33 ఏళ్ల షా.. సహచరుడు బెన్‌ టింక్లెర్‌ డేవిస్‌తో కలిసి ఈ వెదురు బ్యాట్‌ను రూపొందించాడు. క్రికెటర్‌ అయిన దర్శిల్‌ తన కొత్త బ్యాటుకు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) త్వరలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు. 200 ఏళ్ల నుంచి వాడుతున్న ప్రస్తుత ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్లతో పోల్చుకుంటే వెదురు బ్యాట్‌లో ‘స్వీట్‌ స్పాట్‌’ అధికంగా ఉంటుందని అతడు చెప్పాడు. కానీ వెదురు బ్యాట్‌ ప్రస్తుత క్రికెట్‌ చట్టాలకు విరుద్ధమని ఎంసీసీ చెబుతోంది. ‘వెదురును చెక్కగా గుర్తించాలంటే ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. జూనియర్లు ఉపయోగించే బ్యాట్లు తప్ప ఇతర బ్యాట్ల బ్లేడును లామినేట్‌ చేయడం నిషిద్ధం’ అని ఎంసీసీ పేర్కొంది. అదే సమయంలో ఈ కొత్త ఆవిష్కరణను పరిశీలించాల్సిందేనని కూడా అనడం దర్శిల్‌ షాలో ఉత్సాహం నింపుతోంది. తమ సరికొత్త బ్యాట్‌కు అధికారిక గుర్తింపు రావడం అంత సులువు కాదని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. ‘లామినేట్‌ చేయడమే వెదురు బ్యాట్‌కు అనుమతిలో అడ్డంకిగా ఉంది. అందువల్ల ఎంసీసీ తన నిబంధనలను అంత సులువుగా సడలిస్తుందని మేం భావించడంలేదు. ఇదో సుదీర్ఘ ప్రక్రియ’ అని వ్యాఖ్యానించాడు. ‘వెదురు పెళుసుగా ఉండడంవల్ల లామినేట్‌ చేయకుండా బ్యాట్‌ను తయారు చేయ లేం. బ్యాట్‌ దృఢంగా ఉండాలంటే వెదురు చెక్కలను అతికించాల్సి ఉంటుంది’ అని షా వివరించాడు.


గుర్తింపుపై విశ్వాసం: తమ పరిశోధనకు బ్యాట్ల తయారీ సంస్థలు, చట్ట రూపకర్తలు, ఆవిష్కర్తల గుర్తింపు లభించగలదన్న నమ్మకాన్ని దర్శిల్‌ వ్యక్తం జేశాడు. ‘200 సంవత్సరాలుగా ఇంగ్లిష్‌ విల్లోతోనే బ్యాట్లను రూపొంది స్తున్నారు. చెక్కలో 10 వేలకుపైగా రకాలున్నాయి. అలాంటప్పుడు కేవలం  సరఫరా తక్కువగా ఉన్న ఒక రకంతోనే బ్యాట్లు తయారు చేయడమేమిటి? ఆ ఆలోచనే సరికాదు. ఉదాహరణకు సితార్‌ను ఒకే రకమైన చెట్టుకు సంబంధించిన చెక్కతో రూపొందించలేం. వివిధ రకాల చెట్ల చెక్కలతో దానిని తయారు చేస్తారు. క్రికెట్‌ బ్యాట్ల విషయంలోనూ అలా ఎందుకు చేయకూడదు?’ అని ప్రశ్నించాడు. తన వెదురు బ్యాట్‌ను జూనియ ర్‌ క్రికెట్‌లో ఉపయోగించడంపై దర్శిల్‌ సంతృప్తిగా ఉన్నాడు. తమ బ్యాట్ల తయారీకి వెదురు కొరత లేదంటున్న షా.. పైగా అది క్రికెట్‌ అభివృద్ధికి కూ డా  దోహదం చేస్తుందంటున్నాడు. మెక్సికో, చైనా, దక్షిణాసియాలో వెదురు విస్తారంగా లభిస్తుందని చెప్పాడు. ఈ దేశాలు క్రికెట్‌ పట్ల ప్రస్తుతం మక్కువ ప్రదర్శిస్తున్నాయని, వెదురు బ్యాట్లతో ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని వివరించాడు. 



బంతి-బ్యాటు సమతూకం


ఇప్పటికే క్రికెట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. వెదురు బ్యాటు పెద్దగా ఉండడం, అలాగే స్వీట్‌ స్పాట్‌ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  బ్యాటు-బంతి సమతూకం ఇంకా దెబ్బతిం టుందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై దర్శిల్‌ మాట్లాడుతూ ‘నేను మీడియం పేసర్‌ను. అందువల్ల బౌలర్లపై నాకు సానుభూతి ఉంటుంది. ఆటపై బౌలర్లు పట్టు సాధించాలంటే రెండు మార్పులు జరగాలి. ఇందులో పిచ్‌ల స్వభావాన్ని మార్చడం మొదటిది. బ్యాటు సైజును హేతుబద్ధీకరించడం రెండోది. 1970ల మాదిరి ఉన్న బ్యాటు మం దాన్ని తగ్గించాలి. అప్పుడే బ్యాటు-బంతికి మధ్య సమతూకం ఏర్పడు తుంది. కానీ అలా జరగడం అనుమానమే’ అని వివరించాడు. విల్లో బ్యాట్‌కంటే 40 శాతం బరువుగా ఉన్న తన వెదురు బ్యాట్‌లోనూ మార్పులు చేయాలని షా భావిస్తున్నాడు. ‘బ్యాట్‌ మందాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గించడం మా తదుపరి లక్ష్యం. బంతి.. బ్యాట్‌ అంచును తాకినా సిక్సర్‌గా వెళ్లడం బౌలర్లకు అసహనంగా ఉంటోంది. బ్యాటు అంచు మరింత సన్నగా ఉంటే స్వీప్‌ షాట్‌ ప్రయత్నంలో బంతి.. బ్యాట్‌ మధ్య భాగంలో తగులుతుంది. అప్పుడు బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమానంగా అవకాశాలుంటాయి’ అని దర్శిల్‌ చెప్పాడు. బ్యాట్‌ రేటు విషయంపై.. ‘జూనియర్‌ స్థాయిలో క్రికెట్‌పట్ల మక్కువ పెంచుకోవాలంటే బ్యాట్‌ రేటు తక్కువగా ఉండాలి. విల్లో కొరత, రవాణా ఖర్చులు, దిగుమతి సుంకం.. అన్నీ కలిసి బ్యాట్‌ ఖరీదు ఎక్కువై  సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. కానీ వెదురు బ్యాట్‌ ధర సాధారణ బ్యాట్‌కంటే 30 శాతం తక్కువగా ఉండనుంది’ అని దర్శిల్‌ షా తెలిపాడు. 

Updated Date - 2021-05-18T06:12:08+05:30 IST