అధిక సాంద్రత.. సంపత్తి!

ABN , First Publish Date - 2022-06-20T08:29:42+05:30 IST

పత్తిసాగును గణనీయంగా పెంచాలనే ప్రయత్నాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, పనిలో పనిగా అధిగ దిగుబడి కోసమూ వినూత్న పద్ధతిలో సాగుచేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే ‘అధిక సాంద్రత..

అధిక సాంద్రత.. సంపత్తి!

ఎక్కువ మొక్కలు.. ఎక్కువ కాయలు.. ఎక్కువ దిగుబడి

ఈ సీజన్‌లో 50 వేల ఎకరాల్లో కొత్త తరహా సాగు

సంప్రదాయ సాగుకన్నా మూడు రెట్ల మొక్కలు

4 కంపెనీలతో ఒప్పందం.. రైతులకు ఎకరానికి 5కిలోలు

చైనా, బ్రెజిల్‌, టర్కీ, ఆస్ట్రేలియాలో ఈ విధానం సక్సెస్‌

ఖర్చులకు ఎకరానికి రూ.4వేలు రైతులకు ఇవ్వాలని సిఫారసు


హైదరాబాద్‌, నల్లగొండ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పత్తిసాగును గణనీయంగా పెంచాలనే ప్రయత్నాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, పనిలో పనిగా అధిగ దిగుబడి కోసమూ వినూత్న పద్ధతిలో సాగుచేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే ‘అధిక సాంద్రత పత్తిసాగు విధానం’! ఇందులో సంప్రదాయ పత్తిసాగుకు భిన్నం గా మొక్కల సంఖ్యను పెంచుతారు. విత్తనాలను దగ్గర దగ్గరగా విత్తుతారు. సంప్రదాయ సాగులో ఎకరా విస్తీర్ణంలో 7,400 మొక్కలు ఉంటే.. ఈ సాగులో 25వేల దాకా మొక్కలు ఉంటాయి. మొక్కల సంఖ్య మూడింతలకు పైగా పెరుగుతుంది కాబట్టి సహజంగానే ఎక్కువ కాయలు వస్తాయి. మొత్తంగా ఎక్కువ దిగుబడి వస్తుంది. అధిక సాంద్రత సాగులో పత్తి దిగుబడి తక్కువలో తక్కువగా 30-40ు పెరుగుతుందని.. గరిష్ఠంగా 50ు దాకా దిగుబడి ఉంటుందని వరంగల్‌ ప్రాంతీయ పరిశోధన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త రాంప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


అధిక సాంద్రత పత్తి సాగు విధానాన్ని ఈ సీజన్‌ నుంచే అమలు చేయించాలని, 50వేల ఎకరాల్లో సాగుచేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. సాగులో విత్తనాలు, ఇతర పెట్టుబడి ఖర్చు కోసం రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ.4వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపడం గమనార్హం. తెలంగాణ పత్తికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణాన్ని, తద్వారా దిగుబడిని కూడా పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పత్తిసాగుకు నల్లరేగడి నేలలు అనుకూలం కాగా ఈ ‘అధిక సాంద్రత’ పత్తి సాగుకు తేలికపాటి నేలలు, ఎర్రనేలలు, చెలక నేలలను ఎంపికచేయటం విశేషం. చైనా, బ్రెజిల్‌, టర్కీ, ఆస్ట్రేలియా దేశాల్లో అధిక సాంద్రత పత్తి సాగుచేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు.  


 మొక్కల మధ్య దూరం తగ్గి... 

మొక్కల మధ్యలో దూరాన్ని తగ్గించటం ద్వారా తక్కువ విస్తీర్ణంలో మొక్కల సంఖ్యను గణనీయంగా పెంచి, అధిక దిగుబడిని సాధించటానికే ‘అధిక సాంద్రత పత్తి’ సాగును ప్రోత్సహిస్తున్నట్లు సీనియర్‌ శాస్త్రవేత్త రాంప్రసాద్‌ తెలిపారు. ఉదాహరణకు ఎకరా విస్తీర్ణంలో 7,400 మొక్కలు ఉంటే ఒక్కో మొక్కకు 30 కాయలు కాసినా పత్తి కాయల సంఖ్య 2.22 లక్షలు అవుతుంది. అదే 25 వేల మొక్కలకు ఒక్కో మొక్కకు 20 కాయలు కాసినా పత్తి కాయల సంఖ్య 5 లక్షలు అవుతుంది.  


4 కంపెనీల విత్తనాలు

పత్తిసాగుకు ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలు ప్రసిద్ధి. ఈ జిల్లాల్లో ఈ సీజన్‌ కోసం 50 వేల ఎకరాల్లో అధిక సాంద్రత పత్తిని సాగు చేయించాలని అధికారులు నిర్ణయించారు. అధిక సాంద్రత పత్తి సాగుకు యోగ్యమైన భూములును గుర్తించి జాబితా సిద్ధంచేశారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయశాఖ, జాతీయ ఆహార భద్రత మిషన్‌  కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. సాగుకు తగినట్లుగా నాలుగు ప్రైవేటు విత్తన కంపెనీలు నూజివీడు, కావేరి, రాశి, వేద విత్తనోత్పత్తి చేశాయి. రెండు, మూడేళ్లుగా ఆ నాలుగు కంపెనీలు చేసిన ప్రయోగాలు సఫలంకావటంతో వాటితో రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఒక్కో ఎకరానికి 5 ప్యాకెట్ల చొప్పున అధిక సాంద్రత పత్తి విత్తనాల పంపిణీని కూడా పూర్తి చేశారు. 


ఎకరానికి రూ. 4 వేలు ఇచ్చే యోచన!

సాధారణ పద్ధతిలో సాగుచేస్తే ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు (ఒక్కొక్కటి 475 గ్రాములు) సరిపోతాయి. అధిక సాంద్రత పత్తి సాగులో 5 విత్తన ప్యాకెట్లు అవసర పడుతాయి. 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ. 810 ఉంది. అంటే సాధారణ పద్ధతిలో ఎకరానికి రూ. 1,620 అవుతాయి. అదే అధిక సాంద్రత సాగులో రూ. 4,050 విత్తన ఖర్చవుతుంది. విత్తనాలు నాటడానికి కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది.    ఎరువుల వినియోగం తగ్గించినా.. అధికంగా ఎత్తు, గుబురు పెరగకుండా ‘గ్రోత్‌ రెగ్యులేటర్‌’ వాడాల్సి ఉంటుంది. నేల చదును ఖర్చులు కూడా పెరుగుతాయి.


దీంతో సగటున ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అంచనా వేశారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌ నుంచి కూడా 60:40 పద్ధతిలో నిధులు సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి రైతులే డబ్బులు పెట్టి విత్తనాలు కొనుగోలుచేస్తున్నారు. ఆ తర్వాత అని ్నఖర్చులు కలిపి ఎకరానికి రూ. 4 వేలు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ రైతుల వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో . ప్రభుత్వం అనుమతిస్తే ‘డీబీటీ’ సిస్టమ్‌లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు.


పెరుగుదల నియంత్రణకు ‘గ్రోత్‌ రెగ్యులేటర్‌’!

సాధారణంగా పత్తి మొక్కలు నాలుగైదు ఫీట్ల కంటే ఎత్తు పెరుగుతాయి. ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటే ఒక్కోసారి 6 ఫీట్ల ఎత్తుకు పెరిగే అవకాశం ఉంటుంది. కొమ్మలు, రెమ్మలు పెరిగి మొక్క గుబురుగా తయారవుతుంది. అధిక సాంద్రత సాగు విధానంలో మొక్కల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరుగుతుంది. అలాంటప్పుడు అడుగు పెట్టే గ్యాప్‌ లేకుండా అడవిలా పెరిగితే ఎలా? అనే సందేహాలు రైతులకు వస్తాయి. పైగా చేను చిక్కగా, మొక్కలు గుబురుగా ఉంటే.. కాయకుళ్లు, రసంపీల్చే పురుగుల బెడద ఎక్కువవుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ‘గ్రోత్‌ రెగ్యులేటర్‌’ విధానాన్ని అమలు చేస్తారు. ‘మెపిక్వాట్‌ క్లోరైడ్‌’ అనే మందును మొక్కలపై స్ర్పే చేయాల్సి ఉంటుంది. ఒక లీటరు నీటిలో 0.6 నుంచి 0.8 మి.లీ గ్రోత్‌ రెగ్యులేటర్‌ను పిచికారి చేస్తే.. పత్తి మొక్క ఎత్తు పెరగకుండా, గుబురుగా తయారవకుండా నియంత్రింస్తుంది. సులభంగా రైతులుగానీ, కూలీలు గానీ వెళ్లి పనిచేసే అవకాశం ఉంటుంది. గ్రోత్‌ రెగ్యులేటర్‌ విధానంతో కాయల సైజు కూడా పెరుగుతుంది. పైగా ఏకకాలంలో పక్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకేసారి కాయపగిలితే ఒకేసారి పికింగ్‌ చేయొచ్చు. పత్తి పికింగ్‌ ఖర్చుపెట్టుబడిలో 30ు పెరిగిన నేపథ్యంలో ఒకేసారి తీస్తే కూలీల ఖర్చు, పికింగ్‌ ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే ఇది మాత్రం ‘సింగిల్‌ పికింగ్‌’ పత్తి కాదు. నాలుగైదు పికింగ్‌లు కూడా వస్తుంది.  


140-150 రోజుల్లోనే 

సాధారణంగా పత్తి పంట కాలపరిమితి 6-8 నెలల వరకు ఉంటుంది. వానాకాలంలో పత్తి సాగు ప్రారంభించిన రైతులు.. యాసంగి వరకూ ఉంచుతారు. అయితే ‘అధిక సాంద్రత’ పత్తి సాగు 140 రోజుల నుంచి 150 రోజుల్లో పూర్తవుతుంది. అంటే కాలపరిమితి తక్కువగా ఉంటుంది. దీంతో రైతులకు రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి... గులాబీ రంగు పురుగు దాడి నుంచి తప్పించుకోవచ్చు. సాధారణంగా చలి కాలం రాగానే గులాబీ రంగు పురుగు దాడి మొదలవుతుంది. నవంబరు మొదటి వారం నుంచి మొదలై డిసెంబరు, జనవరి నెలల్లో తీవ్రంగా ఉంటుంది. అప్పటికే అధిక సాంద్రత పత్తి సాగు పూర్తవుతుంది. రెండు, మూడు పికింగ్‌లు అయిపోతాయి. రైతుకు రావాల్సిన పంట దాదాపుగా చేతికొస్తుంది.  రెండోది.. అవసరమైతే పత్తి సాగుచేసిన స్థానంలో రెండో పంటను వేసుకోవచ్చు. ఒకరకంగా వానాకాలంలో పత్తి సాగును పూర్తిచేసుకొని యాసంగిలో వేరే పంట సాగుచేసుకోవచ్చు. 

Updated Date - 2022-06-20T08:29:42+05:30 IST