36 ఏళ్లకే.. ఎలీట్‌ ప్యానెల్‌లో చోటు

ABN , First Publish Date - 2020-06-30T08:57:33+05:30 IST

భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి చెందిన అత్యున్నత ఎలీట్‌ అంపైర్‌ ప్యానెల్‌లో 36 ఏళ్ల ...

36 ఏళ్లకే.. ఎలీట్‌ ప్యానెల్‌లో చోటు

భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌ రికార్డు

దుబాయ్‌: భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి చెందిన అత్యున్నత ఎలీట్‌ అంపైర్‌ ప్యానెల్‌లో 36 ఏళ్ల నితిన్‌కు చోటు లభించింది. దీంతో ఈ ప్యానెల్‌కు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. 2020-21 సీజన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్‌ లాంగ్‌ స్థానాన్ని నితిన్‌ భర్తీ చేస్తాడని ఐసీసీ సోమవారం ప్రకటించింది. గతంలో ఐసీసీ ఎలీట్‌ ప్యానెల్‌లో భారత అంపైర్లు శ్రీనివాస వెంకట్రాఘవన్‌, సుందర్‌ రవి మాత్రమే చోటు దక్కించుకోగలిగారు. నితిన్‌ ఇప్పటిదాకా 3 టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు. అంతకుముందు అతను ఐసీసీ ఇంటర్నేషనల్‌ అంపైర్‌ ప్యానెల్‌లో ఉండేవాడు. ‘నా కల నెరవేరింది. సరైన నిర్ణయాలతో నా స్థానాన్ని పదిలం చేసుకుంటా’ అని నితిన్‌ తెలిపాడు. మధ్యప్రదేశ్‌ తరఫున రెండు లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన నితిన్‌..2006లో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్‌ టెస్టులో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో 23 ఏళ్ల వయస్సులోనే సీనియర్‌ అంపైర్‌గా మారాడు. ఎలీట్‌ ప్యానెల్‌లో స్థానం దక్కడంతో మీనన్‌ వచ్చే ఏడాది యాషెస్‌ టోర్నీలో అంపైరింగ్‌ చేసే అవకాశం ఉంది. 2021 ఆరంభంలో ఇంగ్లండ్‌ భారత పర్యటనలో ఆడే ఐదు టెస్టులకు కూడా అతను విధులు నిర్వర్తించవచ్చు.

Updated Date - 2020-06-30T08:57:33+05:30 IST